‘ప్రతి పురుషుని విజయం వెనక ఓ మహిళ ఉంటుంది’ అన్నట్లు తన సతీమణి అనుష్కే తన సక్సెస్ సీక్రెట్ అని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. కెరీర్ ప్రారంభంలో అద్భుతమైన ఆట ఉన్నా... దుందుడుకు స్వభావంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ స్టార్ క్రికెటర్... అనుష్కతో జీవితం పంచుకున్నాక ఎంతో ప్రశాంతంగా మారిపోయాడు. మైదానంలోనే కాదు బయట కూడా ఎంతో కూల్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆటతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇలా ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందిస్తున్న విరాట్... తన సక్సెస్ క్రెడిట్ మొత్తం తన సతీమణిదే అంటున్నాడు. అనుష్క తన బెటర్‌హాఫ్ అయినందుకు తానెంతో అదృష్టవంతుడినంటున్నాడు. మరి.. ఇంకా తన ముద్దుల భార్య గురించి కోహ్లీ ఏమన్నాడో తెలుసుకుందాం రండి...
నా సతీమణి సహకారంతో!
ప్రస్తుతం ఉన్న సెలబ్రిటీ జంటల్లో విరాట్-అనుష్క జోడీకి ఉన్న క్రేజ్ వేరు. కెరీర్ పరంగా వేర్వేరు దారులైనా వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకెళుతున్నారీ లవ్లీ కపుల్. వీరిద్దరి దాంపత్య బంధానికి గుర్తుగా ఇటీవల ‘వామిక’ అనే పండంటి బిడ్డ వీరి జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో కెరీర్ పరంగా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్న కోహ్లీ... 2014 ఇంగ్లండ్ పర్యటనలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఆ టూర్ అతనికి ఎన్నో నిద్ర లేని రాత్రులను మిగిల్చింది. ఆ సమయంలో తాను తీవ్ర కుంగుబాటుకు కూడా గురైనట్లు ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడీ స్టార్ క్రికెటర్. అయితే తన సతీమణి అందించిన సహకారంతో ఈ గడ్డు పరిస్థితులను అధిగమించానంటూ తాజాగా అందరితో షేర్ చేసుకున్నాడీ హ్యాండ్సమ్ హజ్బెండ్.
ఆమె నా సక్సెస్ సీక్రెట్!
‘నేను క్రికెట్లో సక్సెస్ కావడానికి 70 శాతం నా టెక్నిక్ కారణమైతే... మిగతా 30 శాతం నాకున్న మానసిక బలం. ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతుడిని అనుకుంటున్నా. ఎందుకంటే నా సతీమణి నాకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. నాకు ఒత్తిడి ఎదురైన ప్రతిసారీ నా వెన్నంటే నడిచింది అనుష్క. నాలో ఎప్పుడూ స్ఫూర్తి నింపడానికి ప్రయత్నిస్తుంటుంది. ఓ నటిగా, సెలబ్రిటీగా ఆమె కూడా ఇలాంటి సవాళ్లు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. అందుకే నా ఆలోచనలను తను సులభంగా అర్థం చేసుకుంటుంది. స్ఫూర్తివంతమైన మాటలతో నన్ను ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా నేను కూడా తన సమస్యలను అర్థం చేసుకుని సానుకూల దృక్పథం నింపేందుకు ప్రయత్నిస్తుంటాను. అలా వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఒకరికొకరు సహకరించుకోవడం వల్లే నేను అన్ని రకాలుగా సక్సెస్ అవుతున్నానేమో..!
తను లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదేమో!
‘నేనెప్పుడైతే అనుష్కను కలిశానో అప్పుడే నాలో మార్పు మొదలైంది. ఆమె కారణంగానే జీవితంపై నాకంటూ ఓ స్పష్టత వచ్చింది. నన్ను ఇంతగా అర్థం చేసుకునే భార్య నా లైఫ్‌లోకి వచ్చినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. ఒకవేళ అనుష్క నా జీవితంలోకి అడుగుపెట్టకపోయి ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో! ఇక వృత్తిగతంగా మేమిద్దరం ఎంత బిజీగా ఉన్నా మా ఇద్దరి కోసం సమయం కేటాయించుకుంటాం. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఇష్టపడతాం. అదే మా అనుబంధాన్ని ముందుకు తీసుకెళుతుందని గట్టిగా నమ్ముతున్నాను. భవిష్యత్‌లో మా కుటుంబం మరింత పెద్దదవుతుంది. ఇద్దరి జీవితాల్లో కూడా ఎన్నో మార్పులు సంభవిస్తాయి. కానీ అనుష్కతో ప్రయాణం శాశ్వతమైనది’ అంటూ తన అర్ధాంగిపై ప్రేమను కురిపించాడు విరాట్.