ప్రేమకు ప్రతిరూపంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే ప్రేమ పండగే ‘వేలంటైన్స్‌డే’. ప్రేమతో ముడిపడిన రెండు మనసుల్లో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి ఇదో ప్రత్యేకమైన సందర్భం. ఈ రోజున ప్రేమను తెలుపుకోవడంతో పాటు మనసుపడ్డ వారికి ఇష్టమైన కానుకలిచ్చి వారిని మెప్పిస్తుంటారు. ఈ క్రమంలో ప్రేమికుల రోజున ఓ వ్యక్తి తన అర్ధాంగికి కిడ్నీని బహుమతిగా ఇచ్చాడు. తద్వారా మూడేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న తన సతీమణికి సరికొత్త జీవితాన్ని ప్రసాదించాడు.
భార్యకు కిడ్నీ దానం చేశాడు!
జీవితంలో కొన్ని బంధాలు మన పుట్టుకతోనే మొదలైతే... మరికొన్ని బంధాలను దేవుడు సృష్టిస్తాడు. అలాంటి వాటిలో ఆలుమగల బంధం ఒకటి. బహుశా ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని’ ఇందుకే అన్నారేమో. జీవితంలో మన వెంట ఎవరున్నా, లేకపోయినా కట్టె కాలేవరకు మనతోనే కలిసుంటారు జీవిత భాగస్వామి. అలాంటి వారికి ఏమిచ్చినా మన రుణం తీర్చుకోలేం. వారిని సంతోషంగా చూసుకోవడం తప్ప. ఈ క్రమంలో మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతోన్న తన సతీమణి కష్టం చూడలేక ఏకంగా తన కిడ్నీని దానం చేశాడు ఓ వ్యక్తి. త్యాగం కూడా ప్రేమలో భాగమేనంటూ తన ఇల్లాలికి సరికొత్త జీవితాన్ని ప్రసాదించాడు.
భార్య బాధను చూడలేక!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రిటాబెన్ పటేల్ గత మూడేళ్లుగా ఆటో ఇమ్యూన్ కిడ్నీ డిస్ఫంక్షన్తో బాధపడుతోంది. మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో క్రమం తప్పకుండా మందులు వాడడంతో పాటు మూడు వారాలకొకసారి ఆమె డయాలసిస్ చేసుకోవాల్సిందే. ఈ క్రమంలో రోజురోజుకూ క్షీణించిపోతున్న తన ఆరోగ్య పరిస్థితిని చూసి ఆందోళనకు గురయ్యాడు ఆమె భర్త వినోద్ భాయ్ పాటిల్. అదే సమయంలో మూత్రపిండాన్ని మార్చకపోతే ఆమె ఆరోగ్యం మరింత దిగజారే ప్రమాదం ఉందని డాక్టర్లు అతడిని హెచ్చరించారు. దీంతో తన అర్ధాంగిని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తన కిడ్నీ దానం చేయాలనుకున్నాడు వినోద్. వెంటనే వైద్యులను సంప్రదించి సలహా అడిగాడు. అతడిని పరీక్షించిన వైద్యులు కిడ్నీ మార్పిడికి అతని కిడ్నీ సరిపోతుందని చెప్పడంతో వెంటనే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.
ప్రేమికుల దినోత్సవం రోజునే!
ఈ క్రమంలో వినోద్ ఇచ్చిన కిడ్నీతోనే రిటాబెన్కు శస్ర్తచికిత్స నిర్వహించారు వైద్యులు. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ సర్జరీ జరిగింది. ప్రేమికుల దినోత్సవం... అందులోనూ వినోద్-రిటాల పెళ్లి రోజునే ఈ శస్ర్తచికిత్స జరగడం విశేషం.
‘రిటాబెన్ మూడేళ్లుగా ఆటో ఇమ్యూన్ కిడ్నీ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నారు. వ్యాధుల నుంచి తనకు రక్షణ కల్పించాల్సిన రోగనిరోధక శక్తి తిరిగి ఆమె శరీరం పైనే దాడి చేయడంతో మూత్రపిండం పనితీరు క్రమంగా దెబ్బతింది. దీని కారణంగా శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆమె భర్త కిడ్నీ ఇస్తానని ముందుకు రావడంతో పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స పూర్తి చేశాం. ఇలా ప్రేమికుల దినోత్సవం రోజున శస్త్రచికిత్స నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని రిటాబెన్కు సర్జరీ చేసిన వైద్యుడొకరు చెప్పుకొచ్చారు.
తనను ఒంటరిగా ఎలా వదిలేస్తాను?
ఈ సందర్భంగా తన భార్య పడుతున్న కష్టాన్ని చూడలేకనే తన కిడ్నీని ఇచ్చానంటున్నాడు వినోద్. ‘రీటాబెన్తో నాది 23 ఏళ్ల దాంపత్య బంధం. నా ఫ్యామిలీలో నాకెంతో ప్రియమైన వ్యక్తి తను. ఇన్నాళ్లూ నా కష్టసుఖాల్లో తోడుగా నిలిచింది. అలాంటిది ఇప్పుడు తనను ఒంటరిగా ఎలా వదిలేస్తాను? మూత్ర పిండాల సమస్యతో తను మూడేళ్ల నుంచి క్రమం తప్పకుండా మందులు వాడుతోంది. మూడు వారాలకొకసారి డయాలసిస్ చేయించుకుంటోంది. తన కష్టాన్ని నేను చూడలేకపోయాను. మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలనుకున్నాను. అందుకే కిడ్నీని ఇచ్చాను. ఇది ప్రేమైనా అనుకోండి, బాధ్యతైనా అనుకోండి’ అని చెప్పుకొచ్చాడు వినోద్.
ఆలుమగల అన్యోన్యతకు అద్దం పట్టే ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేమికుల రోజున భార్య ఆరోగ్యం కోసం కిడ్నీ ఇచ్చిన వినోద్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘నిజమైన ప్రేమ అంటే ఇదే’, ‘మీరే నిజమైన వేలంటైన్’, ‘ప్రేమికుల రోజున మీ భార్యకు మీరు ఇచ్చిన గిఫ్ట్ నిజంగా ఎంతో గొప్పది’, ‘రిటాబెన్ త్వరగా కోలుకోవాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.