బాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో నేహా ధూపియా-అంగద్ బేడీ కూడా ఒకటి. వయసు పరంగా వారిద్దరి మధ్య పెద్ద తేడా లేకపోయినా... అంగద్ కంటే నేహ సుమారు మూడేళ్లు పెద్దది కావడం గమనార్హం. అయినా పెద్దల ఆశీర్వాదంతో 2018లో పెళ్లిపీటలెక్కిన ఈ అందాల జంట అదే ఏడాది మెహ్ర్ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం అమ్మగా ఓవైపు కూతురి ఆలనాపాలన చూస్తూనే, మరోవైపు కెరీర్‌ని బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది నేహ. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా మహిళా సమస్యలపై తన గళాన్ని వినిపించే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన పెళ్లి, తర్వాతి పరిణామాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
కేరళలోని కొచ్చికి చెందిన నేహ 2002లో మిస్ ఇండియా టైటిల్ గెలిచింది. ఆ తర్వాత ‘ఖయామత్: సిటీ అండర్ థ్రెట్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ‘క్యా కూల్ హై హమ్’, ‘షూటవుట్ ఎట్ లోఖండ్ వాలా’, ‘హే బేబీ’, ‘రష్’, ‘ఉంగ్లీ’.. వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. వీటితో పాటు ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘విలన్’, ‘పరమ వీర చక్ర’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఇలా సినిమాలు చేస్తున్న సమయంలో సహ నటుడు అంగద్ బేడీతో ప్రేమలో పడింది. పెళ్లికి ముందు కొద్ది రోజుల పాటు కలిసి సహజీవనం చేసిన వీరిద్దరూ 2018 మేలో పెద్దల అనుమతితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. దిల్లీలోని గురుద్వారాలో సిక్కు సంప్రదాయ ప్రకారం జరిగిన వీరి వివాహానికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్‌లో మెహ్ర్ అనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది నేహ. ఇక తల్లయ్యాక కూడా సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తోన్న ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు పలు టీవీ షోలలో హోస్ట్‌గా, జడ్జిగా వ్యవహరిస్తోంది. ప్రత్యేకించి ఆమె హోస్ట్ చేస్తున్న ‘నో ఫిల్టర్ విత్ నేహా’ అనే సెలబ్రిటీ ఛాట్ షో హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
#Free To Love అంటూ!
సామాజిక దృక్పథం మెండుగా ఉన్న నేహ మహిళా సమస్యలు, సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్, బాడీ షేమింగ్ విషయాల్లో మహిళలకు స్ఫూర్తినిచ్చే సందేశాలిచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ప్రముఖ టూత్ పేస్ట్ కంపెనీ నిర్వహించిన #Free To Love క్యాంపెయిన్‌లో పాల్గొంది. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో అంగద్తో ప్రేమ, పెళ్లికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
అలా ప్రపోజ్ చేస్తాడని ఊహించలేదు!
‘ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. అలాంటి శుభకార్యాన్ని వేడుకగా నిర్వహించడానికి కొద్ది నెలల ముందు నుంచే అన్ని ఏర్పాట్లు మొదలవుతాయి. కానీ నా పెళ్లి విషయంలో మాత్రం అన్నీ భిన్నంగా జరిగాయి. అసలు అంగద్ నాకు లవ్ ప్రపోజ్ చేస్తాడని అసలు ఊహించలేదు. ఎందుకంటే అతడు నా చిరకాల మిత్రుడు. అలాంటిది ఒకరోజు సడెన్‌గా మా ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని డైరెక్టుగా మా తల్లిదండ్రులను అడిగాడు. దీంతో వారు ‘మీ మనసుకు నచ్చింది చేయండి. మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటాం’ అంటూ మా ప్రేమను ఆశీర్వదించారు’ అని అప్పటి అనుభవాలను గుది గుచ్చిందీ ముద్దుగుమ్మ.
లేటు వయసులో పెళ్లి చేసుకుందేమో అన్నారు!
దిల్లీలోని గురుద్వారా వేదికగా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఒక్కటయ్యారు నేహ, అంగద్. పెళ్లైన రెండు రోజుల తర్వాత నేహ అత్యంత సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ వీరి వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పుడు కానీ వీరి వివాహం గురించి అందరికీ తెలియలేదు.
‘ఎలాంటి హడావుడి, హంగు ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకోవాలని నేను, అంగద్ ముందుగానే నిర్ణయించుకున్నాం. అందుకు తగ్గట్లే కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ శుభకార్యానికి ఆహ్వానించాం. దీంతో పెళ్లైన రెండు రోజులకే నాపై రకరకాల విమర్శలు వచ్చాయి. అసలు మేమెందుకు సింపుల్‌గా పెళ్లి చేసుకున్నామో తెలుసుకోకుండా చాలామంది ‘ఆ అమ్మాయి (నేహ) లేటు వయసులో పెళ్లి చేసుకుందేమో..!’, ‘ ఓహ్...పెళ్లి కుమారుడు, వధువు కన్నా చిన్నవాడు అయ్యుంటాడేమో..!’ అని నానా రకాలుగా మాట్లాడుకున్నారు. అయితే నేను ఇలాంటి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే నేను కోరుకున్న ప్రేమ, జీవితం అంగద్ రూపంలో నాకు లభించాయి. మరి అలాంటప్పుడు మా గురించి ఇతరులు ఏమనుకుంటే మాకెందుకు? ఎవరేమనుకున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం ఇలాగే ప్రేమను పంచుకుంటూనే ఉంటాం’ అంటూ తమ రిలేషన్షిప్ గురించి చెప్పుకొచ్చిందీ అందాల తార.