పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఓ మధురానుభూతి. ఎన్నో బంధాలు...అనుబంధాలు...భావోద్వేగాలకు పెళ్లి మూలంగా మారుతుంది. అందులోనూ అమ్మాయిలు అయితే మరీనూ...! అప్పటివరకు అల్లారు ముద్దుగా పెరిగి పుట్టింటి నుంచి అత్తవారింట్లోకి అడుగుపెట్టే ప్రతి అమ్మాయీ ఎంతో ఉద్వేగానికి లోనవడం సహజం. ఈక్రమంలో కొద్ది రోజుల క్రితం పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా పెళ్లి సమయంలో భావోద్వేగానికి లోనయింది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో తన సోదరి సుస్మితను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుందీ అందాల తార.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలస్ వేదికగా డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యతో కలిసి ఏడడుగులు నడిచింది నిహారిక. అనంతరం తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేస్తూ చైతన్యపై తనకున్న ప్రేమను చాటుకుంటోంది. తాజాగా తన వివాహంలో చోటు చేసుకున్న కొన్ని మధుర క్షణాలను ఓ వీడియో రూపంలో అందరితో పంచుకుంది నిహా. సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో నిహారికను పెళ్లి కూతురిని చేయడం, చిరంజీవి-సురేఖ, పవన్, రామ్‌చరణ్-ఉపాసన, అల్లుఅర్జున్-స్నేహలత, సుస్మిత, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్...ఇలా అందరితో నిహారిక సంతోషంగా గడపడం, పెళ్లికూతురుగా ముస్తాబైన నిహాను పెళ్లి మండపానికి తీసుకురావడం, అతిరథ మహారథుల సమక్షంలో చైతన్య మెగా ప్రిన్సెస్ మెడలో మూడుముళ్లు వేయడం.. వంటి ఎన్నో అపురూప ఘట్టాలను మనం చూడవచ్చు.
నా జీవితానికి అర్థం నువ్వేనని అర్థమైంది!
ఇక పెళ్లి వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో సంతోషంగా ఉన్న నిహారిక చైతన్య తాళి కడుతున్న సందర్భంలో తీవ్ర భావోద్వేగానికి లోనయింది. అలాగే పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ ప్రేమ సందేశంతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘డియర్ నిహా...మూడు ముళ్ల బంధంతో మన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న ఈ సమయంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్నీ నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. 30 ఏళ్లుగా జీవితంలో నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాతే అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని...నా జీవితానికి అర్థం నువ్వేనని కూడా తెలిసింది’ అని ఆ సందేశంలో చెప్పుకొచ్చాడు చైతన్య. మరి, కట్టుకోబోయే వాడు అంత ప్రేమగా మాట్లాడిన మాటలు విన్న నిహారిక పట్టరాని ఆనందంతో ఏడ్చేసింది. అదే సమయంలో కల్యాణ తిలకం దిద్దితున్న తన సోదరి సుస్మితను హత్తుకుని ఎమోషనల్ అయ్యింది.
బ్యూటిఫుల్ వీడియో!
ఈక్రమంలో నిహారిక పెళ్లి ఘట్టానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను సుమారు 5.72లక్షల మంది చూడడం విశేషం. ‘బ్యూటిఫుల్ వీడియో’, ‘లవ్లీ’, ‘మాకూ కన్నీళ్లు వస్తున్నాయ్’ అంటూ హార్ట్, లవ్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్‌ను నింపేస్తున్నారు నెటిజన్లు. మరి అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ వీడియోను మీరూ చూసేయండి!