‘సినీ తారలకి పెద్ద పనులేముంటాయి?’, ‘అసలు లైఫ్ అంటే సినిమా వాళ్లదే’, ‘ ఏ అర్ధరాత్రో పడుకుని బారెడు పొద్దెక్కాక నిద్ర లేస్తుంటారు!’ ‘పెద్ద పెద్ద హీరోయిన్ల ఇళ్లల్లో పని మనుషులే పనులన్నీ చేస్తుంటారు’! అంటూ సినీ తారల జీవనశైలి గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటుంటారు. అయితే వృత్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకునే ముద్దుగుమ్మలు కూడా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నేనూ ఉన్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి బాధ్యతలన్నీ తానే నిర్వర్తిస్తానంటోంది. ఈ సందర్భంగా వర్క్‌లైఫ్ బ్యాలన్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ.
దీపికా పదుకొణె... ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న ఈ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 13 ఏళ్ల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమాతో కెరీర్ ఆరంభించిన ఆమె అతి తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఓ వైపు గ్లామర్ పాత్రలు పోషిస్తూనే మరో వైపు ‘ఛపాక్’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. అభిరుచి గల నిర్మాతగానూ పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పలు వ్యాపార ప్రకటనల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలో ఇండియాలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తోన్న సినీతారల్లో ఒకరిగా గుర్తింపు పొందిందీ క్రేజీ హీరోయిన్.
ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటా!
2018 నవంబర్‌లో రణ్వీర్ సింగ్‌తో ఏడడుగులు వేసింది దీపిక. ప్రస్తుతం అతనితో కలిసి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోన్న ఆమె ఇంటి పనులన్నీ తానే చేసుకుంటుందట. ఈ క్రమంలో- తన వృత్తిగత, వ్యక్తిగత జీవితాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
‘నేను కూడా సాధారణ మహిళల్లాగానే ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చూసుకుంటాను. ఒక్కో రోజు ట్యాప్‌లో నీళ్లు రావు. మరొక రోజు పని వాళ్లు రారు. నాకు మేనేజర్లు ఉన్నా వారు సినిమాలకు సంబంధించిన పనులు మాత్రమే చూసుకుంటారు. కాబట్టి ఇంటి బాధ్యతలన్నీ నేనే చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ నేనే కొనుగోలు చేస్తుంటాను. పప్పులు, ఉప్పులు ఆర్డర్ ఇస్తుంటాను. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాను. ఇప్పటికిప్పుడు నేను మారలేను. ఇక ఎవరైనా అతిథులు మా ఇంటికి వచ్చినప్పుడు వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. వారికి ఇష్టమైన వంటకాలేంటో తెలుసుకుని స్వయంగా వండి పెడతాను. నేను ఈ పనులన్నీ చేయడం చూసి రణ్వీర్ ఆశ్చర్యపోతుంటాడు. ‘ఈ పనులన్నీ నీకెందుకు’? అని అడుగుతుంటాడు. కానీ ఇష్టంతోనే ఈ పనులన్నీ చేస్తున్నానంటూ అతనికి చెబుతుంటాను’ అని అంటోందీ స్టార్ హీరోయిన్.
అదే మా సక్సెస్ఫుల్ రిలేషన్‌షిప్‌కి కారణం!
‘రామ్‌లీలా’, ‘పద్మావత్’ సినిమాల్లో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్నారు దీపిక-రణ్వీర్. ఈ జంట కలిసి నటిస్తోన్న మరో చిత్రం ‘83’. కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తన భర్తతో రిలేషన్షిప్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టిందీ ముద్దుగుమ్మ.
‘రణ్వీర్, నేను స్నేహితులుగా పరిచయమయ్యాం. మా ఇద్దరివీ భిన్న రకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు. కానీ కొన్ని అంశాల్లో మేం ఒకరికొకరం కనెక్ట్ అయ్యాం. అవే మా ప్రేమకు పునాది వేశాయనుకుంటాను. ఇక రణ్వీర్తో నాది ఎనిమిదేళ్ల సుదీర్ఘ అనుబంధం. అయినా ఇప్పటికీ మేం ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటున్నాం. అభిరుచులు, ఇష్టాల గురించి పరస్పరం తెలుసుకుంటున్నాం. అదే మా సక్సెస్ఫుల్ రిలేషన్‌షిప్‌కు కారణమనుకుంటున్నా. ఇక ఇంటి విషయాలే కాదు.. మేం చేస్తున్న సినిమాల గురించి కూడా పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటాం. నా ప్రతి ప్రాజెక్టు గురించి రణ్వీర్తో చర్చిస్తాను. అలాగే రణ్వీర్ కూడా తన సినిమాల గురించి నాతో చెబుతుంటాడు. వృత్తిగతంగానూ పరస్పరం సలహాలు, సూచనలు ఇచ్చుకుంటాం. ఇక కరోనా కారణంగా వచ్చిన లాక్డౌన్ మా అనుబంధాన్ని మరింత దృఢంగా మార్చింది. నా మనసుకు దగ్గరైన వారితో అధిక సమయం గడిపే అవకాశం ఇచ్చింది’ అంటూ తమ అన్యోన్య దాంపత్యం గురించి చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
తన అందం, అభినయంతో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన దీపిక టాలీవుడ్‌లోనూ సత్తా చూపేందుకు సిద్ధమవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.