బాలీవుడ్‌కు సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో ప్రియాంకా చోప్రా-నిక్ జొనాస్ జోడీ ఒకటి. 2018 డిసెంబర్లో జోధ్‌పూర్ ప్యాలస్ సాక్షిగా పెళ్లిపీటలెక్కిన ఈ లవ్లీ కపుల్ తమ దాంపత్య జీవితాన్ని నిత్య నూతనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. తాజాగా తన భర్తపై ఉండే ప్రేమను మరోసారి చాటుకుంది ప్రియాంక. ఈ సందర్భంగా నిక్‌తో తన రిలేషన్ షిప్, పిల్లలు... తదితర ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
ప్రియాంక-నిక్ మొదటిసారిగా 2017లో మెట్‌గాలా వేదికగా జరిగిన ఓ సంగీత విభావరిలో కలుసుకున్నారు. ఆ క్షణం నుంచే ప్రేమలో పడిన వీరిద్దరూ 2018లో పెళ్లి పీటలెక్కారు. తనకంటే పదేళ్లు చిన్న వాడైన నిక్ని పెళ్లి చేసుకుని దాంపత్య బంధంలోకి అడుగుపెట్టింది ప్రియాంక. తమ అన్యోన్య దాంపత్యంతో ప్రేమకు వయసుతో పని లేదంటూ నిరూపిస్తున్నారీ అందాల జంట. కరోనా కల్లోలం కారణంగా లాస్ ఏంజెల్స్‌లోని తమ ఇంటికే పరిమితమైన ఈ బ్యూటిఫుల్ కపుల్ మళ్లీ ఎవరి పనుల్లో వారు బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో నిక్‌తో తన వైవాహిక జీవితం, పిల్లలు, వృత్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది ప్రియాంక.
క్రికెట్ జట్టుకు సరిపోయేంతమంది పిల్లల్ని కనాలనుంది!
బాలీవుడ్ నటి అనుష్కా శర్మ ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా త్వరలోనే రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఇక రెండేళ్ల క్రితం పెళ్లిపీటలెక్కిన ప్రియాంక నుంచి ఎప్పుడు శుభవార్త వింటామా? అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సందర్భంలో పిల్లల గురించి ప్రశ్న ఎదురు కాగా... ‘నాకు పిల్లల పట్ల చాలా ఉత్సాహంగా ఉంది. ఇక నిక్కు కూడా పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే మాకు వీలైనంత ఎక్కువమంది పిల్లల్ని కనాలనుంది. ఒకరిద్దరితో సరిపెట్టుకోను. కనీసం క్రికెట్ జట్టుకు సరిపోయేంతమంది పిల్లల్ని కనాలని ఉంది (సరదాగా నవ్వుతూ)’ అని చెప్పుకొచ్చిందీ గ్లోబల్ స్టార్.
నిక్ నీటిలో చేపలా కలిసిపోతాడు!
తన కంటే పదేళ్లు చిన్నవాడైన నిక్ని పెళ్లి చేసుకున్న ప్రియాంకపై కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలపై స్పందించిన ఆమె ‘నాకు, నిక్కు 10 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. పైగా మేము పెరిగిన వాతావరణం, సంస్కృతి నేపథ్యం కూడా వేరైనప్పటికీ అవి ఎప్పుడూ మా ప్రేమ బంధానికి అడ్డంకి కాలేదు. ఇప్పటివరకు మా మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు. నిక్ నీటిలో చేపలా అందరితో కలిసిపోతాడు. ఒక సాధారణ జంట లాగే మేం కూడా ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా భాగస్వామికి ఏది ఇష్టమో, ఏది అయిష్టమో తెలుసుకుంటున్నాం. అదేవిధంగా కుటుంబంలో వచ్చే ఇబ్బందుల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాం.
ఇక లాక్డౌన్ కారణంగా దాంపత్య బంధం కొత్త అర్థం నాకు తెలిసొచ్చింది. వ్యక్తిగత పనుల్లో నిత్యం బిజీగా ఉండే మా ఇద్దరికీ క్వారంటైన్ రూపంలో చక్కని ఏకాంత సమయం దొరికింది. మా బంధాన్ని మరింత దృఢంగా మార్చుకునేందుకు ఈ సమయాన్ని వినియోగించుకున్నాం’ అని తన క్వారంటైన్ అనుభవాల గురించి తెలిపిందీ అందాల తార.
తను నా జీవితంలోకి రావడం నా అదృష్టం!
ఈ క్రమంలో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా తను సాధిస్తున్న విజయాలకు తన భర్త అందిస్తున్న తోడ్పాటే కారణమంటోంది ప్రియాంక. ‘నిక్ లాంటి జీవిత భాగస్వామి లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. తను నాకు అన్ని విషయాల్లో అండగా నిలుస్తున్నాడు. నిక్ కారణంగానే వృత్తిగతంగా, వ్యక్తిగతంగా నేను ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తున్నాను. నా జీవితాన్ని సాధ్యమైనంత ఉత్తమంగా గడిపేందుకు ప్రయత్నిస్తున్నాను. అలా చేయడంలో నాకు అన్ని విధాలా సహకరిస్తున్న నిక్కు కృతజ్ఞతలు’ అని తన భర్తపై ప్రేమను కురిపించిందీ ముద్దుగుమ్మ.
ఎంతలా మారిపోయావు!!
ఇదిలా ఉంటే ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘17 ఏళ్ల వయసులో నేను ఇలా ఉన్నాను’ అంటూ పోస్ట్ చేసిన ఈ ఫొటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. వారితో పాటు హృతిక్ రోషన్, లారాదత్తా, దియామీర్జా, కత్రినా కైఫ్, రాజ్‌కుమార్ రావ్ లాంటి సెలబ్రిటీలతో పాటు అభిమానులు ‘వావ్... బ్యూటిఫుల్’, ‘ఈ 20 ఏళ్లలో ఎంతలా మారిపోయావు..!’ అంటూ కామెంట్లు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం ‘వుయ్ కెన్ బీ హీరోస్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో పాటు ఆమె నటించిన మరో బాలీవుడ్ సినిమా ‘ద వైట్ టైగర్’ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ప్రస్తుతం ‘టెక్ట్స్ ఫర్ యు’, ‘మ్యాట్రిక్స్ 4’ అనే హాలీవుడ్ చిత్రాల షూటింగ్లో పాల్గొంటోందీ ముద్దుగుమ్మ.