సింగిల్ పేరెంట్‌గా తన ఒంటరి జీవితానికి స్వస్తి పలుకుతూ ఇటీవల కొత్త జీవితం ప్రారంభించింది స్టార్ సింగర్ సునీత. తన మధురమైన గాత్రంతో మాయ చేసే ఈ బ్యూటిఫుల్ సింగర్ మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వేదికగా అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచారీ జంట. ఇక ఈ కొత్త జంట పెళ్లి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా సందడి చేస్తున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించిన సునీత... రామ్‌తో పరిచయం, పెళ్లి, పిల్లల స్పందన... తదితర విషయాల గురించి తాజాగా పంచుకుంది.
17 ఏళ్ల వయసులోనే పాటల ప్రస్థానాన్ని ప్రారంభించిన సునీత ఎన్నో మధురమైన పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని ఒడిదొడుకులు ఆమె పాటల ప్రవాహానికి ఏ మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఇలా ఓ వైపు గాయనిగా కొనసాగుతూనే... మరో వైపు సింగిల్ పేరెంట్‌గా తన పిల్లల బాధ్యతలు చూసుకుంటూ వచ్చిందామె. అయితే తన ఒంటరి జీవితానికి స్వస్తి పలుకుతూ ఇటీవల రామ్ వీరపనేనితో కలిసి మరోసారి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది సునీత. ఈ సందర్భంగా రామ్‌తో తన వివాహాన్ని స్వర్గంతో పోల్చిన ఆమె తన పెళ్లి, పిల్లల గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
మొదట నా పిల్లలే గుర్తుకు వచ్చారు!
‘రామ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. వాస్తవానికి తను నా సోషల్ మీడియా ఖాతాలను చూసుకునే వారు. అలా మా ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది. కానీ ఈ పరిచయం బలపడి స్నేహంగా మారడానికి చాలా సమయమే పట్టింది. ఈ క్రమంలో మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. దీని గురించి ఇరు కుటుంబాలతో మాట్లాడి వారి అంగీకారం తర్వాతే పెళ్లి చేసుకున్నాం. ఇక రామ్‌తో పెళ్లి ఆలోచన వచ్చినప్పుడు మొదట నాకు నా ఇద్దరు పిల్లలే గుర్తుకు వచ్చారు. ఎందుకంటే నేను తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాలతో వారు ఇబ్బంది పడకూడదనుకున్నాను. ఇక నా తల్లిదండ్రులు ఎన్నో ఏళ్లుగా నన్ను వివాహం చేసుకోమని కోరుతున్నారు. కానీ పిల్లలు చిన్నవారు కావడంతో నా పెళ్లి నిర్ణయాన్ని పక్కన పెడుతూ వచ్చాను. వారు అభద్రతా భావంతో పెరగకూడదని నా వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వారు పెరిగి పెద్దవారయ్యారు. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకునే పరిణతి వారిలో పెరిగింది. ఇక ‘రామ్‌ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను’ అని నా పిల్లలతో చెప్పినప్పుడు వారు నన్ను కౌగిలించుకున్నారు. ‘చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా’ అంటూ సంతోషంతో పొంగిపోయారు. నన్ను ఇంత బాగా అర్థం చేసుకునే పిల్లలు లభించడం నా అదృష్టం. ఇక నా కుటుంబం కూడా నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలబడింది’.
కష్టసుఖాలను పంచుకోవడానికి ఓ తోడుండాలి!
‘జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను పంచుకోవడానికి కచ్చితంగా మనకంటూ ఓ తోడుండడం ఎంతో ముఖ్యం. అలా నాకంటూ ఓ తోడుండాలనుకుంటున్న తరుణంలో నాకు కనిపించిన మంచి మనసున్న మనిషి రామ్. తను మా కుటుంబ సభ్యులందరికీ బాగా తెలిసిన వ్యక్తే. రామ్ నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం. తనతో నా వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందన్న నమ్మకం నాకుంది.’
‘ఇక కరోనా ఆంక్షల నేపథ్యంలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించాం. కానీ మా రెండు కుటుంబాలు చాలా పెద్దవి. దీంతో అతిథుల జాబితా 200కు చేరుకుంది. ఇక వివాహం తర్వాత ఎలాంటి రిసెప్షన్ పార్టీలు ఏర్పాటు చేయడం లేదు. ఎందుకంటే పెళ్లి తర్వాత మేం కలవాల్సిన వ్యక్తులు చాలామందే ఉన్నారు. వారందరి కోసం రాబోయే రోజుల్లో చిన్న చిన్న పార్టీలు నిర్వహిస్తున్నాం. అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ స్టార్ సింగర్.




Ram Veerapaneni Weds Sunitha Upadrasta from Ravi Studios on Vimeo.