ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన గాత్రంతో తెలుగు సినీ సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది గాయని సునీత. క్యూట్ స్మైల్‌తో ‘ఝుం ఝుం మాయ’ అంటూ మనందరినీ మాయ చేసిన ఈ బ్యూటిఫుల్ సింగర్ తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనితో కలిసి ఏడడుగులు నడిచింది. అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెరిసిపోయారు. తమ పెళ్లిలో ప్రతి ఘట్టం ప్రత్యేకమే అన్నంతలా సందడి చేసిన ఈ న్యూ కపుల్ పెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
‘ఈ వేళలో నీవు’, ‘అలనాటి రామచంద్రుడు’, ‘పెదవి దాటని మాటొకటుంది’, ‘నీలి నీలి ఆకాశం’.. ఇలాంటి ఎన్నో మధురమైన పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది సింగర్ సునీత. తన 17 ఏళ్ల వయసులోనే పాటల ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. ఇలా ఓవైపు గాయనిగా కొనసాగుతూనే, మరోవైపు సింగిల్ పేరెంట్‌గా తన ఇద్దరు పిల్లల బాధ్యత చూసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిందీ లవ్లీ సింగర్. మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనితో తనకున్న స్నేహాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకుంది సునీత.
ప్రతి ఘట్టం ప్రత్యేకమే!
‘ఒక మంచి ఫ్రెండ్‌గా జీవితంలోకి వచ్చి.. ఇప్పుడు నా జీవిత భాగస్వామిగా మారబోతున్నారం’టూ తనకు కాబోయే లైఫ్ పార్ట్నర్ని ఇటీవలే మనందరికీ పరిచయం చేసిన ఈ క్యూట్ సింగర్.. తాజాగా ఆయనతో కలిసి ఏడడుగులు నడిచింది. శంషాబాద్ సమీపంలో అమ్మపల్లిలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం వేదికగా సునీత-రామ్‌ల వివాహం జరిగింది. అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య వేడుకగా జరిగిన ఈ పెళ్లిలో వధూవరులిద్దరూ పూర్తి సంప్రదాయబద్ధంగా ముస్తాబయ్యారు. సునీత.. రోజ్ గోల్డ్ కలర్ పట్టుచీరలో పుత్తడిబొమ్మలా కనిపించింది. ఇక వరుడు రామ్ క్రీమ్ కలర్ పట్టు ధోతీలో ముస్తాబయ్యారు. జీలకర్ర-బెల్లం, తాళికట్టు శుభవేళ, తలంబ్రాల వేడుక, అరుంధతీ నక్షత్రం చూడడం.. ఇలా ప్రతి క్షణాన్నీ నవ్వుతూ, ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ ఆస్వాదించిందీ అందాల జంట. ఇలా ‘మా పెళ్లిలో ప్రతి ఘట్టం ప్రత్యేకమే!’ అన్నట్లుగా తెగ సందడి చేసింది. ఇక మరోవైపు తన ఇద్దరు పిల్లలను హత్తుకుంటూ భావోద్వేగానికి గురైందీ లవ్లీ సింగర్. ఈ క్రమంలో ఈ కొత్త జంట పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వేడుకకు హీరో నితిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక అంతకుముందు జరిగిన హల్దీ, మెహెందీ.. వంటి ప్రి-వెడ్డింగ్ వేడుకలతో పాటు ప్రి-వెడ్డింగ్ పార్టీ, నిశ్చితార్థం.. ఇలా తన పెళ్లికి సంబంధించిన ప్రతి క్షణాన్నీ తన అభిమానులతో పంచుకుంటూ మురిసిపోయింది సునీత.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్వీట్ కపుల్!

