తల్లిదండ్రులవడం అనేది జీవితంలో మరో మెట్టు పైకెక్కడం లాంటిదే. అందుకే పెళ్లయిన ప్రతి జంట తమ ప్రేమకు ప్రతిరూపాలైన చిన్నారులకు ఎప్పుడెప్పుడు ఆహ్వానం పలుకుదామా అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది. అలా కరోనా నామ సంవత్సరంగా అందరికీ గుర్తుండిపోయే 2020లో కూడా కొందరు తారలు తమ ప్రాణంగా భావించే బుజ్జాయిలకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఈ ఏడాది అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొంది తమ చిన్నారుల ఆలనాపాలనలో మునిగి తేలుతోన్న కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి...
అమృతారావు
‘అతిథి’ సినిమాలో మహేశ్‌బాబుతో కలిసి ఆడిపాడిన అమృతారావు ఈ ఏడాది నవంబర్‌లో మొదటిసారిగా అమ్మగా హోదా పొందింది. 2007లో ‘వివాహ్’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన ఆమె ప్రముఖ రేడీయో జాకీ ఆర్జే అన్మోల్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో తమ ప్రేమ బంధానికి గుర్తుగా ఈ ఏడాది నవంబర్ 1న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అమృత. అనంతరం తమ చిన్నారికి ’వీర్’ అని నామకరణం చేసి ఆ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది.
నటాషా స్టాంకోవిక్
ఈ ఏడాది తొలి రోజున దుబాయి సముద్ర కెరటాల సాక్షిగా తమ ప్రేమాయణం, నిశ్చితార్థం విషయాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్ -క్రికెటర్ హార్దిక్ పాండ్యా. ఆ తర్వాత మేలో తామిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్రకటించిన ఈ లవ్లీ కపుల్ జులై 30న ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేసిన హార్దిక్ ‘మేం తల్లిదండ్రులయ్యాం. మాకు బాబు పుట్టాడు’ అని అందరితో తన సంతోషాన్ని పంచుకున్నాడు.
సోఫీ టర్నర్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా మరదలు, ప్రముఖ హాలీవుడ్ నటి సోఫీ టర్నర్ ఈ ఏడాదే అమ్మగా ప్రమోషన్ పొందింది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘ఎక్స్‌మెన్: డార్క్ ఫీనిక్స్’ తదితర చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె ప్రియాంక భర్త నిక్ సోదరుడు జో జోనస్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2019 మేలో పెళ్లి పీటలెక్కిన ఈ జంట ఈ ఏడాది జులై 26న ‘విల్లా’ అనే పండంటి పాపకు జన్మనిచ్చారు.
శిల్పాశెట్టి
‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన శిల్పాశెట్టి ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి తల్లయింది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మ 2009లో రాజ్‌కుంద్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2012లో వియాన్ అనే బాబుకు జన్మనిచ్చిన ఆమె ఈ ఏడాది ఫిబ్రవరి 10న సరోగసీ ద్వారా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన బుజ్జి పాపాయికి సమిషా శెట్టి కుంద్రా అని పేరు పెట్టుకున్న ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను షేర్ చేసుకుంది.
‘మా హృదయాలు ఎంతో సంతోషంతో నిండిపోయాయి. లిటిల్ ఏంజెల్ మా జీవితంలోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. జూనియర్ ఎస్ ఎస్ కే ఫిబ్రవరి 15న మా ఇంట్లోకి అడుగుపెట్టింది. అలా మా ఇంటి మహాలక్ష్మి మా కుటుంబంలోకి అడుగుపెట్టి మా జీవితాలను పరిపూర్ణం చేసింది’ అని ఈ సందర్భంగా రాసుకొచ్చింది శిల్ప.
లిసా హెడెన్
మోడల్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, నటిగా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది లిసా హెడెన్. పలు బాలీవుడ్ హిట్ సినిమాల్లో మెరిసిన ఈ బాలీవుడ్ అందం బ్యూటీ 2016లో డినో లల్వానీ అనే బ్రిటిష్ వ్యాపారవేత్తను వివాహమాడింది. తమ దాంపత్య బంధానికి గుర్తుగా 2017లో జాక్ లల్వానీ అనే మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ అందాల తార.. గతేడాది ఆగస్టులో మరోసారి తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘లియో’ అనే ఓ బాబుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన ఇద్దరు కుమారులు కలిసున్న ఫొటోలను షేర్ చేసిన లిసా ‘మీ ఇద్దరూ నా హృదయాన్ని తాకారు. మీ ఇద్దరినీ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని వర్ణించేందుకు నాకు మాటలు రావడం లేదు. లియో అండ్ జాక్.. మీ ఇద్దరినీ అలా ప్రేమగా చూస్తూ జీవితాంతం గడిపేస్తాను’ అని తన సంతోషాన్ని అందరితో షేర్ చేసుకుంది.
కల్కి కొచ్లిన్
‘దేవ్ డి’, ‘జిందగీ న మిలేగీ దొబారా’, ‘షైతాన్’, ‘యే జవానీ హై దివానీ’, ‘మార్గరిటా విత్ ఏ స్ట్రా’.. తదితర చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది కల్కి కొచ్లిన్. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో ప్రేమలో పడిన ఆమె 2011లో అతనితో కలిసి పెళ్లి పీటలెక్కింది. అయితే రెండేళ్లకే వారి బంధం బీటలు వారింది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన మ్యుజీషియన్ గై హెర్ష్‌బెర్గ్‌తో ప్రేమలో పడిన ఈ అందాల తార... గతేడాది సెప్టెంబర్‌లో తాను అమ్మను కాబోతున్నానంటూ ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 7న ‘Sappho’ అనే ఓ పాపకు జన్మనిచ్చిన కల్కి తన కూతురి ఫుట్ ప్రింట్స్ ఫొటోలను షేర్ చేస్తూ ‘నవమాసాలు నా గర్భంలో పెరిగిన నా కూతురు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తన పేరు ‘Sappho’. నా ఆరోగ్యం, నా కూతురు క్షేమం కోరుతూ శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు’ అని తన ముద్దుల పాపాయిని ప్రపంచానికి పరిచయం చేసింది.
సయాలీ భగత్
‘బ్లేడ్ బాబ్జీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సయాలీ భగత్. ‘ది ట్రైన్’, ‘గుడ్ లక్’, ‘హల్లా బోల్’, ‘యారియాన్’ తదితర బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. 2013లో దిల్లీకి చెందిన వ్యాపార వేత్త నవీన్ ప్రతాప్ సింగ్‌ని పెళ్లి చేసుకున్న ఆమె జూన్‌లో ఓ బుజ్జి పాపాయికి జన్మనిచ్చింది. ఆ బిడ్డకు ఇవాంకా సింగ్‌గా నామకరణం చేసిన సయాలీ ‘హలో ఇన్‌స్టా ఫ్యామ్.. మా బుల్లి ఏంజెల్ ఇవాంకా సింగ్‌కి హాయ్ చెప్పండి’ అంటూ తన బేబీని ప్రపంచానికి పరిచయం చేసింది.
సంఘవి
‘హాయ్ రే హాయ్.. జాం పండు రోయ్’ అంటూ ‘సింధూరం’ సినిమాలో రవితేజతో పాటు కుర్రకారును కూడా తన వెంట తిప్పుకుంది సంఘవి. ఈ చిత్రంతో పాటు ‘సీతారామరాజు’, ‘సమర సింహారెడ్డి’, ‘ఆహా’, ‘సూర్యవంశం’, ‘సందడే సందడి’ సినిమాల్లో సందడి చేసిందీ అందాల తార. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం ఫిబ్రవరిలో వెంకటేష్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో కలిసి పెళ్లి పీటలెక్కిన సంఘవి ఈ ఏడాది మేలో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా 42 ఏళ్ల వయసులో అమ్మగా ప్రమోషన్ పొందిన ఆమె కూతురితో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ ‘నా లిటిల్ ఏంజెల్ ఇదిగో..’ అంటూ తన బుజ్జి పాపాయిని అందరికీ పరిచయం చేసింది.
స్నేహ
తెలుగింటి బాపూ బొమ్మ స్నేహ ఈ ఏడాది ప్రారంభంలో రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందింది. సౌందర్య తర్వాత మళ్లీ అంతటి హోమ్లీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ అందాల తార జనవరి 24న ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆమె భర్త ప్రసన్న తమ బుజ్జి పాపాయి కాళ్లకు తొడగడానికి రడీగా ఉంచిన పింక్ కలర్ షూ పెయిర్ ఫొటోను షేర్ చేస్తూ ‘మా ఏంజెల్ అడుగుపెట్టింది’ అని క్యాప్షన్ జత చేశాడు.
మందిరా బేడీ
నటిగా, క్రికెట్ కామెంటేటర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, టీవీ హోస్ట్‌గా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసింది మందిరా బేడీ. 1999లో రాజ్కౌశల్తో పెళ్లిపీటలెక్కిన ఆమె 2011లో ‘విర్’ అనే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఓ ఆడపిల్ల తన ఇంట్లో అడుగుపెడితే తన కుటుంబానికి మరింత పరిపూర్ణత వస్తుందని భావించిన మందిర ఈ ఏడాది జులైలో నాలుగేళ్ల తారా బేడీ కౌశల్ అనే చిన్నారిని దత్తత తీసుకుంది. అక్టోబర్‌లో తన కూతురును ప్రపంచానికి పరిచయం చేసిన ఆమె ‘దేవుడు అందించిన వరంలా తార మా దగ్గరకు వచ్చింది. 2020 జులై 28 నుంచి తను కూడా మా కుటుంబంలో భాగస్వామిగా మారిపోయింది’ అని అందరితో సంతోషాన్ని షేర్ చేసుకుంది.
* బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసానీ -నిన్ దుసంజ్ దంపతులు ఆగస్టు 1 న ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
* బాలీవుడ్ బుల్లితెర నటుడు సుమీత్ వ్యాస్- ఏక్తా కౌల్ దంపతులు జూన్3న అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. వీరికి ‘వేద్’ అనే అనే మగబిడ్డ పుట్టాడు.
బాలీవుడ్ టీవీ నటుడు కరణ్వీర్ బొహ్రా- తీజయ్ సిద్ధు దంపతులు ఈ ఏడాది ముచ్చటగా మూడోసారి తల్లిదండ్రులయ్యారు. గతంలో కవలలకు జన్మనిచ్చిన ఈ లవ్లీ కపుల్ డిసెంబర్ 20న మరో ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
కొత్త ఏడాదిలో తల్లిదండ్రులు కాబోతున్నది వీరే!
అనుష్కా శర్మ
ది మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరొందిన అనుష్కాశర్మ-విరాట్ కోహ్లీ కొత్త ఏడాదిలో అమ్మానాన్న హోదా అందుకోనున్నారు. మూడేళ్ల క్రితం పెళ్లిపీటలెక్కిన ఈ లవ్లీ కపుల్ ఈ ఏడాది ఆగస్టులో ‘మేం ముగ్గురం కాబోతున్నాం’ అంటూ ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించారు.
కరీనా కపూర్
బాలీవుడ్లో ప్రేమంచి పెళ్లి చేసుకున్న జంటల్లో కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ జోడీ కూడా ఒకటి. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లిపీటలెక్కిన ఈ లవ్లీ కపుల్‌కు 2016లో తైమూర్ అనే బాబు జన్మించాడు. ఈ క్రమంలో తైమూర్‌కు తోబుట్టువును అందిస్తున్నామంటూ ఈ ఏడాది ఆగస్టులో తమ అభిమానులకు శుభవార్త చెప్పారు కరీనా దంపతులు. దీంతో త్వరలోనే రెండోసారి అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారీ రొమాంటిక్ కపుల్.
అనితా హస్సా నందానీ
‘నువ్వు-నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది అనితా హస్సానందానీ. 2013లో రోహిత్ రెడ్డితో కలిసి ఏడడుగులు నడిచిన ఈ అందాల తార కొత్త ఏడాదిలోనే అమ్మ కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబర్‌లో తాను గర్భం దాల్చిన విషయాన్ని అందరితో షేర్ చేసుకుందీ ముద్దుగుమ్మ.