‘అల్లో నేరేడు కళ్ల దాన.. ప్రేమ వల్లో పడ్డానే పిల్లదాన’ అనిపించుకుంటూ తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది బాలీవుడ్ అందాల తార ట్వింకిల్ ఖన్నా. నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. రచయిత్రిగా, కాలమిస్ట్‌గా, ఇంటీరియర్ డిజైనర్‌గానూ రాణించింది. అంతేనా.. నిర్మాతగా మారి పలు బాలీవుడ్ చిత్రాలకు కో-ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించింది. ఓవైపు ఆలిగా, ఇల్లాలిగా కుటుంబ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూనే.. మరోవైపు అమ్మగా ఇద్దరు పిల్లల ఆలనా పాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోందీ అందాల అమ్మ. ఇటు ఇంటిని, అటు వృత్తిని బ్యాలన్స్ చేయడంలో ట్వింకిల్ తర్వాతే ఎవరైనా అన్నంత ఓర్పు, నేర్పు ఈ చక్కనమ్మ సొంతం. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో ఈ ‘మిసెస్ ఫన్నీబోన్స్’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..
ముద్దుపేరే అసలు పేరైంది!
* ట్వింకిల్ ఖన్నా.. ఈ పేరుతోనే ట్వింకిల్ మనందరికీ పరిచయం. కానీ అది ఆమె ముద్దుపేరు. ఆమె అసలు పేరు టీనా జతిన్ ఖన్నా. బాలీవుడ్ అలనాటి నటీనటులు రాజేశ్ ఖన్నా - డింపుల్ కపాడియాల గారాలపట్టిగానే కాకుండా.. ఇండస్ట్రీలో నటిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసిందామె.
* ట్వింకిల్, ఆమె తండ్రి రాజేశ్ ఖన్నా.. వీరిద్దరి పుట్టినరోజు డిసెంబర్ 29 కావడం విశేషం. ‘నాన్నతో కలిసి పుట్టినరోజు షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఈ క్రమంలో చిన్నతనం నుంచి ఎన్నెన్నో జ్ఞాపకాలు మూటగట్టుకున్నా..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ.
* ట్వింకిల్‌కు పుట్టుకతోనే ఒక కన్ను కాస్త క్రాస్‌గా ఉండేదట! 1995లో తన సినీ అరంగేట్రం సమయంలోనూ ఇలాగే కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత శస్త్రచికిత్సతో తన కన్నును సవరించుకుందట!
ఆ అవకాశం వదులుకున్నా!
* నటించింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోలందరితో చేసిన ట్వింకిల్‌కు కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన ‘కుచ్ కుచ్ హోతా హై’లోనూ అవకాశమొచ్చిందట. అయితే ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించడంతో ట్వింకిల్‌కు బదులుగా రాణీ ముఖర్జీని తీసుకున్నారట!
* చదువుకునే రోజుల్లో ఎవరికైనా పెద్దయ్యాక నేను ఫలానా జాబ్ చేయాలి అన్న ఆశ ఉంటుంది. అలా తను కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకునేదట ట్వింకిల్. ‘12వ తరగతి పూర్తి చేశాక చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని ఆశపడ్డా. కానీ నా పేరెంట్స్ ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారు కావడంతో నేనూ వాళ్ల దారిలోనే నడవాలని వారు ఆశపడ్డారు. అలా సినీ పరిశ్రమకు పరిచయమైనా నటిగా సక్సెస్ అందుకోలేకపోయా..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ.
* మనిషిక్కడ.. మనసెక్కడో ఉంటే మనం చేసే పనిని ఎంజాయ్ చేయలేమంటుంది ట్వింకిల్. ‘సినిమాలు నాకు సంతృప్తినివ్వలేకపోయాయి. ఓ ఆర్కిటెక్ట్‌తో కలిసి పార్ట్‌టైమ్ జాబ్ చేసే క్రమంలో నా తపనేంటో నాకు తెలిసింది. అలా నటనను వదిలేసి ఇంటీరియర్ డిజైనర్‌గా అవతారమెత్తా. నా మనసు మాట విన్నా.. హ్యాపీగా ఉన్నా..’ అంటోందీ మిసెస్ అక్షయ్.
ఇంటీరియర్ డిజైనర్‌గా తనదైన ముద్ర!
* తన ఫ్రెండ్‌తో కలిసి ముంబయిలో ‘ది వైట్ విండో’ పేరుతో ఇంటీరియర్ డిజైన్ స్టోర్ తెరిచిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. తన డిజైనింగ్ స్కిల్స్‌తో ‘ఎలే డెకార్ ఇంటర్నేషనల్ డిజైన్ అవార్డ్’ను కూడా గెలుచుకుంది. అంతేనా.. రాణీ ముఖర్జీ బంగ్లాతో పాటు ఇతర సెలబ్రిటీ డ్రీమ్ హోమ్స్‌కి కూడా తన ఇంటీరియర్ స్కిల్స్‌తో వన్నెలద్దిందీ గ్రేట్ డిజైనర్.
* ‘మిసెస్ ఫన్నీబోన్స్’ పుస్తకంతో రచయిత్రిగా తన ప్రస్థానం ప్రారంభించింది ట్వింకిల్. 2015లో విడుదలైన ఈ పుస్తకం ఆ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పుస్తకంగా పేరు తెచ్చుకుంది. ఆపై ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ పేరుతో ఆమె రాసిన లఘు కథల పుస్తకంలో సామాజిక వేత్త అరుణాచలం మురుగనాథం (తక్కువ ధరకే శ్యానిటరీ న్యాప్కిన్లు తయారుచేసే మెషీన్ సృష్టికర్త) జీవిత కథను అక్షరీకరించింది. అంతేకాదు.. నిర్మాతగా మారి ఈ కథను ‘ప్యాడ్‌మ్యాన్’ పేరుతో తెరకెక్కించి జాతీయ పురస్కారం కూడా గెలుచుకుందీ బాలీవుడ్ స్టార్.
* 2018లో ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’ అంటూ ఆమె రాసిన పుస్తకం ఆ ఏడాది అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకంగా పేరు తెచ్చుకుంది.
మహిళల కోసమే ఈ వేదిక!
* ఇక సందర్భం వచ్చినప్పుడల్లా మహిళా అంశాలపై తన స్పందనను వినిపించే ట్వింకిల్.. ‘ట్వీక్ ఇండియా’ అనే డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించి మహిళలందరికీ ఆ అవకాశాన్నిచ్చింది. ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లో అందుబాటులో ఉన్న ఈ వెబ్సైట్లో అందం, ఆరోగ్యం, పిల్లల పెంపకం, కెరీర్, లైఫ్‌స్టైల్.. ఇలా మహిళలకు సంబంధించిన ఎన్నో విషయాలను పొందుపరుస్తుంటారామె. అంతేకాదు.. ఆయా అంశాలపై మహిళలు తమ సందేహాల్ని సైతం నివృత్తి చేసుకోవడానికి వారధిగా ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుందంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు ట్వింకిల్.
* పెళ్లి తర్వాత మహిళలు తమ ఇంటి పేరును మార్చుకోవడం సర్వసాధారణమే! కానీ పెళ్లై 19 ఏళ్లైనా ఇప్పటికీ తన పుట్టింటి పేరునే కొనసాగిస్తోందీ బాలీవుడ్ అందం. మరి, ఎందుకలా అని అడిగితే.. ‘ఈ విషయం గురించి నన్ను చాలామంది చాలాసార్లు ప్రశ్నించారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. నా ఇంటిపేరు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఖన్నానే..’ అంటూ ఓసారి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు.. తన మనసులోని మాటలతో పాటు #MarriedNotBranded అనే హ్యాష్‌ట్యాగ్‌ని పోస్ట్ చేసి పెళ్లైనంత మాత్రాన ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ చెప్పకనే చెప్పింది ట్వింకిల్.
అది ఫ్లాపైంది.. మా పెళ్లైంది!
ప్రేమించిన వ్యక్తితో పెళ్లంటే రాసిపెట్టుండాలి. ట్వింకిల్-అక్షయ్ ప్రేమకథ తెలిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. తొలిసారి ఓ ఫొటోషూట్‌లో కలుసుకున్న ఈ జంట.. తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో అక్షయ్ ట్వింకిల్‌కు ప్రపోజ్ చేయడంతో ఆమె తల్లి డింపుల్ వీరిద్దరికీ ఒక కండిషన్ పెట్టిందట! ఏడాది పాటు ఇద్దరూ కలిసుండి ఎలాంటి సమస్యలు రాకపోతే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానందట డింపుల్. అయితే అదే సమయంలో ట్వింకిల్ నటించిన ‘మేలా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో పెళ్లి ప్రస్తావన తెచ్చిన అక్షయ్‌తో ట్వింకిల్.. ‘మేలా సినిమా ఫ్లాపైతే నిన్ను పెళ్లి చేసుకుంటా..’ అని చెప్పిందట! ఆ చిత్రం ఫ్లాప్ కావాలని అక్షయ్ ఎంత గట్టిగా అనుకున్నాడో కానీ అది నిజంగానే ఫ్లాపైంది.. అలాగే డింపుల్ పెట్టిన కండిషన్ ప్రకారం వీరిద్దరూ ఏడాది పాటు ఎలాంటి అరమరికల్లేకుండా కలిసుండడంతో 2001లో ఇద్దరికీ పెళ్లి జరిగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2002లో ఆరవ్ అనే కొడుకు, 2012లో నిటారా అనే కూతురు పుట్టారు.
|
మనసులో మాట!
ఓసారి ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న అక్షయ్-ట్వింకిల్ ఒకరిపై ఒకరికున్న ప్రేమను, తమ మనసులోని మాటల్ని ఇలా పంచుకున్నారు. ‘మేలా సినిమా సక్సెసవుతుందని తను చాలా నమ్మకంతో ఉంది.. కానీ నాకోసమే ఆ సినిమా ఫ్లాపైనట్లుంది..’ అంటూ ముసిముసిగా నవ్వుతూ అక్షయ్ మురిసిపోతే.. ‘నాకేమో త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేవడం అలవాటు. అయితే రాత్రుళ్లు మాత్రం నేను-అక్షయ్ రమ్మీ ఆడందే అసలు నిద్రపోము..’ అంటూ తన రిలేషన్షిప్ సీక్రెట్‌ని రివీల్ చేసింది ట్వింకిల్. పండగలు, పార్టీలు, ప్రత్యేక సందర్భాలు, వెకేషన్లు.. ఇలా ప్రతి సందర్భంలోనూ ఇప్పటికీ తమ అన్యోన్య దాంపత్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, పిల్లలతో దిగిన ఫొటోలు-వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ నేటి దంపతులకు రిలేషన్షిప్ పాఠాలు నేర్పుతుంటారీ లవ్లీ కపుల్.
|
కూతురిగా, భార్యగా, అమ్మగా.. ఇలా వ్యక్తిగతంగా సక్సెసైన ట్వింకిల్.. తన మనసు మాట వింటూ వృత్తిపరంగానూ దూసుకుపోతోంది. నేటి అతివలకు వర్క్-లైఫ్ బ్యాలన్స్ పాఠాలు నేర్పుతోంది. మరి, ఈ మిసెస్ ఫన్నీబోన్స్కు మనమూ బర్త్‌డే విషెస్ చెప్పేద్దాం..!
హ్యాపీ బర్త్‌డే ట్వింకిల్!