అతనేమో టీమిండియా అల్లరి కుర్రాడు. ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ ఎక్కడైనా అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఆమేమో అందం, ప్రతిభ కలగలిపిన డ్యాన్సర్ అండ్ కొరియాగ్రాఫర్. మిస్టరీ స్పిన్నర్ మణికట్టు మాయజాలం, సెన్సాఫ్ హ్యూమర్‌కు ఆమె ముగ్ధురాలైతే, ఆ యూట్యూబ్ స్టార్ అందం, డ్యాన్స్‌కు ఆ క్రికెటర్ క్లీన్ బౌల్డయ్యాడు. అలా మొదట ఇద్దరి కళ్లూ-కళ్లూ కలిశాయి. ఆ తర్వాత మనసూ-మనసూ మాట్లాడుకున్నాయి. తమ ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని పట్టుబట్టాయి. పెద్దలు కూడా వారి ప్రేమను ఆశీర్వదించడంతో పెళ్లి పీటలెక్కారు. వారే టీం ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ లవ్‌బర్డ్స్ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారీ లవ్లీ కపుల్. దీంతో క్రికెట్, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు.
మన్సూర్ అలీఖాన్ పటౌడీ-షర్మిలా ఠాగూర్, అజహరుద్దీన్-సంగీతా బిజ్లానీ, యువరాజ్ సింగ్-హేజెల్ కీచ్, హర్భజన్ సింగ్-గీతా బస్రా, జహీర్ ఖాన్-సాగరికా ఘట్గే, విరాట్-అనుష్క, మనీష్-అశ్రిత, హార్దిక్-నటాషా... ఇలా పెళ్లితో పెనవేసుకున్న క్రికెట్-సినిమా బంధాల్లో మరో జంట చేరింది. వారే చాహల్-ధనశ్రీ వర్మ. దిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లోని ఓ రిసార్ట్ వేదికగా హిందూ సంప్రదాయ పద్ధతిలో ఏడడుగులు నడిచారు క్యూట్ కపుల్. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఇరు కుటుంబ పెద్దలు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. టీం ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు.
సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు!
పెళ్లి వేడుకల్లో భాగంగా ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని రూపొందించిన సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు నూతన వధూవరులు. ప్రత్యేకించి ధనశ్రీ ధరించిన డ్రస్ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. రెడ్ కలర్ సిల్క్ లెహెంగా, వెల్వెట్ కలర్ బ్లౌజ్, అందమైన దుపట్టాలో మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ. తన పెళ్లి దుస్తులకు తగ్గట్టుగా ధరించిన మ్యాచింగ్ ఆభరణాలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. ఇక ఐవరీ షేర్వాణీ, మెరూన్ కలర్ తలపాగా ధరించి తళుక్కుమన్నాడు చాహల్.
ఇద్దరం ఒక్కటయ్యాం!
ఈ సందర్భంగా తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారీ బ్యూటిఫుల్ కపుల్. ‘గతంలో మా పరిచయం మొదలైంది. మేం ఎప్పుడూ సంతోషంగా ఉంటామని తెలుసుకున్నాం. అందుకే ఇద్దరం ఒక్కటయ్యాం’ అంటూ #DhanaSaidYuz హ్యాష్‌ట్యాగ్‌తో ఈ జంట షేర్ చేసిన పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.
సినిమా-క్రికెట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా-నటాషా, రోహిత్-రితికా శర్మ, కేఎల్ రాహుల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్‌గేల్, సురేశ్ రైనా, వసీం జాఫర్, నవ్‌దీప్ షైనీ, మన్దీప్ సింగ్, క్రిస్టెల్ డిసౌజా, సంయుక్తా హెగ్డే తదితరులు సోషల్ మీడియా వేదికగా చాహల్-ధనశ్రీ జంటకు అభినందనలు తెలిపారు. వీరి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెట్టారు.
అలా ‘అవును’ అనేసుకున్నారు!
యుజ్వేంద్ర చాహల్... క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టే ఈ హర్యానా బౌలర్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. ప్రత్యేకించి వన్డే, టీ 20 ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తోన్న ఈ క్రికెటర్ ఇప్పటికే యాభైకి పైగా వన్డేలు, 40కి పైగా టీ 20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇలా అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమందిని బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపిన చాహల్‌ను తన అందంతో క్లీన్ బౌల్డ్ చేసింది ముంబయికి చెందిన ధనశ్రీ వర్మ. ఆమె తండ్రి సాగర్ వ్యాపార వేత్త. తల్లి వర్షా వర్మా డెంటిస్ట్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తల్లి లాగే వైద్య విద్యను అభ్యసించిన ధనశ్రీ కొన్నేళ్ల పాటు దంత వైద్యురాలిగా పనిచేసింది. అయితే ఆ తర్వాత డ్యాన్స్‌ని కెరీర్‌గా మలుచుకుంది. ‘ధనశ్రీ వర్మ డ్యాన్స్ కంపెనీ’ పేరిట ఓ సొంత డ్యాన్స్ అకాడమీని ఏర్పాటు చేసింది. ఈ అందాల తార డ్యాన్స్ అంటే పడి చచ్చే అభిమాన గణం చాలానే ఉంది. ఆమె సొంత యూట్యూబ్ ఛానల్‌కు 21.6 లక్షల మందికి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు 26 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండడం విశేషం. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా ప్రేమలో మునిగితేలుతున్న చాహల్-ధనశ్రీ ఈ ఏడాది ఆగస్టులో ఘనంగా రోకా వేడుకను జరుపుకొన్నారు. ‘మా కుటుంబాలతో పాటు మేమిద్దరమూ ‘అవును’ అనేశాం’ అంటూ అప్పుడే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టారు. తాజాగా ఏడడుగులు నడిచి తమ ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు.
మరి, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన చాహల్-ధనశ్రీలకు మనమూ శుభాకాంక్షలు చెప్పేద్దాం. వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఈ లవ్లీ కపుల్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలపై ఓ లుక్కేద్దాం రండి.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ క్యూట్ కపుల్ !!