Image for Representation
పెళ్లి తంతులో భాగంగా వధువు మెడలో మూడు ముళ్లు వేస్తాడు వరుడు. ఆ తర్వాత ఏడు జన్మల వరకూ తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తూ ఆమెతో కలిసి ఏడడుగులు నడుస్తాడు. కష్టమొచ్చినా, కన్నీళ్లొచ్చినా తానున్నానంటూ ఒక్కో అడుగుతో ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇవ్వడమే అందులో దాగున్న పరమార్థం. అయితే మూడుముళ్లు వేయక ముందే, ఏడడుగులు నడవక ముందే జీవితాంతం తోడుంటానని కాబోయే భార్యకు ప్రమాణం చేశాడు ఓ యువకుడు. కాళ్లు దెబ్బతిని ఆస్పత్రి బెడ్‌పై జీవచ్ఛవంలా పడి ఉన్న ఆమె అంగీకారంతో అక్కడే తన దాన్ని చేసుకున్నాడు. కాళ్లు రాకున్నా కలకాలం కలిసుంటానంటూ ఆమె జీవితానికి ఓ భరోసానిచ్చాడు.
అచ్చం ఆ ‘వివాహ్’ మాదిరిగానే!
షాహిద్ కపూర్, అమృతారావ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘వివాహ్’ సినిమా గుర్తుందా? 2006లో విడుదలైన ఆ సినిమాలో షాహిద్ (ప్రేమ్)తో మరికొన్ని గంటల్లో పెళ్లనగా ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలవుతుంది అమృత (పూనమ్). అయితే ముహూర్తం సమయం దాటిపోకముందే ఆస్పత్రి బెడ్ పైనే ఆమె నుదుట సింధూరం దిద్ది తన భార్యను చేసుకుంటాడు షాహిద్.
సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సరిగ్గా పెళ్లి రోజు ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడిన కాబోయే భార్యను ఆస్పత్రి బెడ్ మీదనే పెళ్లి చేసుకున్నాడు ఓ పెళ్లి కొడుకు. ఆమె నుదుటి మీద తిలకం దిద్దాడు. ఇలాంటి కష్టాలు ఎన్నెదురొచ్చినా తనకు తోడుంటానంటూ అండగా నిలిచాడు.
ఆస్పత్రి బెడ్ పైనే పెళ్లి!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన ఆర్తి, అవ్ధేష్లకు పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందుకోసం ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే తామొకటి తలిస్తే విధి మరొకటి తలచినట్లు పెళ్లి జరిగే రోజే ప్రమాదవశాత్తూ ఇంటి కప్పు నుంచి జారి కింద పడిపోయింది ఆర్తి. ఆమె కాళ్లు, వెన్నెముకకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.
సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగితే పెళ్లికొడుకు తరఫు వాళ్లు పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడమో, లేదా వాయిదా వేసుకోవడమో చేస్తుంటారు. అయితే పెళ్లికొడుకు అవ్ధేష్ అలా చేయలేదు. వెంటనే తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నాడు. ఆమె కన్నీటిని తుడిచి ఓదార్చాడు. అంతేకాదు తను అంగీకరిస్తే అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకుంటానన్నాడు. అనవసర ఆలోచనలు పెట్టుకోవద్దని, ఇలాంటి ఎన్ని ఆపదలొచ్చినా తాను అండగా ఉంటానని ఆమెకు భరోసా ఇచ్చాడు. దీంతో సంతోషంతో తన అంగీకారం తెలిపింది ఆర్తి.
ఆ తర్వాత తన వివాహానికి కుటుంబ సభ్యులు, వైద్యుల అనుమతి తీసుకున్నాడు అవ్ధేష్. అందరూ అంగీకరించడంతో అనుకున్న ముహూర్తానికే ఆర్తి నుదుటి మీద తిలకం దిద్దాడు.
నీ వెంటే నేనుంటా!
‘ఇప్పటివరకు జరిగినదంతా విధి రాతే. ఏం జరిగినా వెనకడుగు వేయొద్దు అనుకున్నాను. ఎన్ని కష్టాలెదురైనా నా భార్యకు అండగా నిలబడాలనుకున్నాను. అందులో భాగంగానే ఆ నిర్ణయం తీసుకున్నాను’ అని తన భార్యపై ప్రేమను చాటుకున్నాడు అవ్ధేష్. ఇక ప్రస్తుతం ఆస్పత్రిలో కదల్లేని స్థితిలో ఉన్న ఆర్తి భర్త ఇచ్చిన భరోసాతో ఎంతో సంబరపడిపోతోంది.
‘ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలంటే మొదట్లో నేను కొంచెం భయపడ్డాను. కానీ, నా భర్త నాకు ధైర్యం ఇచ్చాడు. నా ఆరోగ్యం కుదుటపడకపోయినా తోడుగా ఉంటానన్నాడు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది వధువు.
ఈ జంటను చూస్తే ఎంతో ముచ్చటేస్తోంది!
ఇక ఆస్పత్రిలోనే వివాహం చేసుకున్న ఆర్తి-అవ్ధేష్ల జంటను నిండు మనసుతో ఆశీర్వదించారు అక్కడి వైద్య సిబ్బంది. ‘ఆర్తి ప్రమాదవశాత్తూ పైకప్పు నుంచి కింద పడడం వల్ల ఆమె వెన్నెముకకు తీవ్ర గాయమైంది. కాళ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆమె నడిచే పరిస్థితుల్లో లేదు. ఈ పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, భవిష్యత్ గురించి మరో ఆలోచన లేకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు అవ్ధేష్. అతడి మంచితనం మాకెంతో నచ్చింది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పెళ్లి తంతు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చాం. కానీ కాళ్లు మాత్రం కదపొద్దని సూచించాం. ప్రస్తుతం ఆ జంట చాలా సంతోషంగా ఉంది. వారిని చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తోంది’ అని వధువుకు చికిత్స చేస్తున్న వైద్యుడొకరు చెప్పుకొచ్చారు.
ఈ ఏటి మేటి పెళ్లి ఇదే!
ఆర్తి-అవ్ధేష్ల వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ జంటకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ‘ఈ వివాహం మా మనసుల్ని కదిలించింది’, ‘ఈ ఏటి మేటి పెళ్లి ఇదే’, ‘ప్రేమ ముందు విధి అయినా తల వంచక తప్పదు, ఆర్తి త్వరలోనే కోలుకుంటుంది’, ‘అవ్ధేష్ది ఎంత మంచి మనసో’ అంటూ కామెంట్లు పెడుతూ కొత్త దంపతులను ఆశీర్వదిస్తున్నారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుంటున్నారు. మరి మనం కూడా ఆర్తి త్వరగా కోలుకోవాలని, అవ్ధేష్తో ఆమె దాంపత్య జీవితం బాగుండాలని ఆకాంక్షిద్దాం!