ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ జంటల్లో జెనీలియా-రితేశ్ దేశ్‌ముఖ్ జోడీ కూడా ఒకటి. ఎనిమిదేళ్ల క్రితం ఏడడుగులు నడిచిన ఈ లవ్లీ కపుల్ దాంపత్య బంధానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తుంటారు. సందర్భమొచ్చినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు తమ ప్రేమను ఒలకపోస్తుంటారు. తాజాగా రితేశ్ పుట్టిన రోజు సందర్భంగా తన ప్రియమైన భర్తకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ప్రేమ సందేశం పంపింది జెనీలియా. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోన్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
జెనీలియా...తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ‘బొమ్మరిల్లు’తో అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ మొదటి సినిమా ‘తుఝే మేరీ కసమ్’ చిత్రీకరణలో మొదటిసారిగా కలుసుకున్న వీరిద్దరూ అప్పుడే ప్రేమలో పడిపోయారు. తొమ్మిదేళ్ల పాటు ప్రేమలో ఉండి పెద్దల ఆశీర్వాదంతో 2012లో పెళ్లి పీటలెక్కారు. వారి అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా రియాన్, రాహుల్ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇక తమ అన్యోన్య దాంపత్య బంధంతో నేటి తరం దంపతులకు రిలేషన్షిప్ పాఠాలు నేర్పుతున్నారీ రొమాంటిక్ కపుల్. ఇందులో భాగంగా వీలైనప్పుడల్లా ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తాజాగా రితేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టా ద్వారా తన భర్తకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ లవ్లీ పోస్ట్ పెట్టింది జెనీలియా.
హ్యాపీ బర్త్‌డే నవ్రా!
ఈ సందర్భంగా తన భర్తతో కలిసున్న మధుర క్షణాలను ఓ వీడియో రూపంలో షేర్ చేసుకున్న జెన్నీ...‘కాబోయే జీవిత భాగస్వామి గురించి మనకు ఎన్నో కలలుంటాయి. అలాంటి ‘పర్ఫెక్ట్ పర్సన్’ మనకు ఎప్పుడు తారసపడతాడా? అని ఆశగా ఎదురుచూస్తుంటాం. కొన్నిసార్లు ఆ వ్యక్తిని మనం కనుగొనలేకపోవచ్చు. అయితే నిన్ను(రితేశ్)కలుసుకున్నాక మరొకరిని వెతికే అవసరం నాకు రాలేదు. నీలాంటి వ్యక్తే జీవిత భాగస్వామిగా రావాలనుకున్నాను. అదృష్టవశాత్తూ నేను కోరుకున్నట్లే జరిగింది. నువ్వే నా లైఫ్ పార్ట్నర్గా వచ్చావు. ప్రేమికులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా...ఇలా జీవితంలో అన్ని రకాల దశలను దాటిపోతూ మనం ముందుకు సాగుతున్నాం. ఇవన్నీ నాకు ఎన్నో అందమైన అనుభూతులను అందించాయి. అయితే జీవితంలో నాకు దక్కిన గొప్ప వరమేంటంటే...నువ్వు నా జీవితంలోకి రావడం. ఇప్పుడే కాదు.. ఎప్పటికైనా ఈ ప్రశ్నకు నా సమాధానం మారదు. అలాగని మనం పర్ఫెక్ట్ కపుల్ అని నేను అనుకోవడం లేదు. అందరిలాగే మన మధ్య ఎన్నో అపార్థాలు, ఇబ్బందులు, గొడవలు వచ్చాయి. కానీ మనం అందులోనే ప్రేమను వెతుకున్నాం. మన బంధాన్ని పరిపూర్ణంగా మార్చుకుంటున్నాం. ఐలవ్యూ రితేశ్... హ్యాపీ బర్త్‌డే నవ్రా(మరాఠీలో భర్తను ‘నవ్రా’ అని పిలుస్తారు)’ అని భర్తపై ఉన్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది జెన్నీ.
నన్ను భర్తగా ఎంచుకున్నందుకు థ్యాంక్స్!
ఈ క్రమంలో జెనీలియా షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది సేపటికే వైరలైంది. ఈ సందర్భంగా తన సతీమణి పెట్టిన పోస్టుకు స్పందించిన రితేశ్.. ‘నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమకు ఎలా స్పందించాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు చాలా థ్యాంక్స్!’ అని కామెంట్ పెట్టాడు. అతడితో పాటు కృతీసనన్, అనిల్ కపూర్, అర్జున్ రాంపాల్, సునీల్ శెట్టి...తదితర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు జెనీలియా పోస్టుపై లైకులు, ఎమోజీల వర్షం కురిపించారు. రితేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెట్టారు.