ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఓ ఇంటివారయ్యారు నిహారిక-చైతన్య. ఉదయ్‌పూర్ ప్యాలస్ వేదికగా అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత పెళ్లికి హాజరు కాలేని ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తన కూతురు వివాహానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుంటున్నారు నాగబాబు. ఇప్పటికే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మొదటి రెండు రోజుల పెళ్లి వేడుకలను పంచుకున్న ఆయన తాజాగా మరో వీడియోను అందులో అప్లోడ్ చేశారు.
అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్!
మూడో రోజు పెళ్లి వేడుకలంటూ షేర్ చేసిన ఈ వీడియోలో హైదరాబాద్‌లోని తమ నివాసం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్‌కు చేరుకోవడం, వెడ్డింగ్ ఇన్విటేషన్ విశేషాలు, ఉదయ్ విలాస్ ప్యాలస్ అందాలు, ‘నిశ్చయ్’ జోడీ సంగీత్ డ్యాన్సులతో పాటు మెగా-అల్లు కుటుంబాల సందడిని చూడచ్చు. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలస్ వేదికగా నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి గల కారణాలను ఈ వీడియో ద్వారా పంచుకున్నారు నాగబాబు.
‘నిశ్చయ్’ ఇష్ట ప్రకారమే!
‘నా కూతురు నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి చాలా కారణాలున్నాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో అతి తక్కువమందితోనే పెళ్లి వేడుకలు జరపాలని నిబంధనలు ఉన్నాయి. అందుకే కేవలం మా మెగా-అల్లు కుటుంబ సభ్యులు, జొన్నలగడ్డ ఫ్యామిలీతో పాటు అత్యంత సన్నిహితులతో మాత్రమే పెళ్లి వేడుకలను జరపాలని ప్లాన్ చేశాం. అదీ కాక గతంలో మా కుటుంబంలో ఇంతకు ముందు జరిగిన పెళ్లి వేడుకలను మేం పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాం. ఎందుకంటే బన్నీ, రామ్ చరణ్‌లతో పాటు అంతకుముందు మా కుటుంబంలో జరిగిన వివాహాలకు కొన్ని వేలమంది హాజరయ్యారు. దీంతో వారికి కావల్సిన ఏర్పాట్లు చూసుకోవడంలోనే సమయమంతా గడిచిపోయేది. అసలు దగ్గరుండి పెళ్లి చూసే పరిస్థితి ఉండేది కాదు. అందుకే నిహారికకు డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే బాగుంటుందని అనుకున్నాం. వివాహం తర్వాత ఎక్కువమందితో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకున్నాం. నిహారిక-చైతన్య ఇష్ట ప్రకారమే ఈ వెడ్డింగ్ ప్లాన్ చేశాం. ఉదయ్‌విలాస్ ప్యాలస్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నింటిని వరుణ్ చూసుకున్నాడు. ఇక చీరలు, ఆభరణాలు, అలంకరణలు, ఇతర ఏర్పాట్లను నా సతీమణి దగ్గరుండి చూసుకుంది. ఇక నిహారిక, ఆమె స్నేహితుల సలహాలతో ప్యాలస్‌ను అందంగా ముస్తాబు చేశారు’ అని చెప్పుకొచ్చాడీ మెగా బ్రదర్.
మూడు రోజుల ముందు నుంచి జ్వరం!
కళ్లల్లో పెట్టి చూసుకున్న తన కన్న కూతురును అత్తారింటికి పంపేటప్పుడు ఏ తల్లికైనా కన్నీళ్లు రావడం సహజం. ఈ క్రమంలో నిహారిక తల్లి పద్మజ కూడా పెళ్లి వేడుకల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా చిన్నారి కుమార్తె అప్పుడే పెళ్లికూతురు అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. అందరు తల్లిదండ్రుల మాదిరిగానే మేం కూడా మా కుమార్తె వివాహాన్ని వేడుకగా చేయాలని భావించాం. మేం అనుకున్నట్లు అంతా మంచిగానే జరిగినందుకు ఎంతో ఆనందిస్తున్నా. అయితే పెళ్లికి మూడు రోజుల ముందు నుంచి నాకు బాగా జ్వరం. దీంతో నా భర్త, వరుణ్ పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు’..
‘నిశ్చయ్’ను చూస్తే అది నిజమేననిపిస్తుంది!
‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. నిహారిక-చైతన్యల జోడీని చూస్తే అది నిజమేననిపిస్తుంది. వాళ్లిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వారిద్దరినీ అలా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. వాళ్లిద్దరి ఆలోచనా విధానం...అభిరుచులు ఒకేలా ఉంటాయి. నా కుమార్తె...ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిని సొంతం చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఇక నిహా అయితే ఈ పెళ్లిలో మునుపెన్నడూ లేనంత సంతోషంగా కనిపించింది’..
నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి!
‘పెళ్లి కుమార్తెను చేసిన సమయంలో నా నిశ్చితార్థపు చీరలో మెరిసిపోయింది నిహారిక. తనను ఆ చీరలో చూడగానే ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నా భర్త కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అవి మాకు భావోద్వేగభరితమైన క్షణాలు. అలాగే అవే నా జీవితంలో ఓ అపురూప క్షణాలు’ అని చెప్పుకొచ్చింది పద్మజ.
మొక్కులు తీర్చుకున్నారు!
ఇక పెళ్లి వేడుకలు ముగియగానే తన భర్తతో కలిసి అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకుంది నిహారిక. ఆ తర్వాత తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిహారిక తల్లి పద్మజ, జొన్నలగడ్డ దంపతులు కూడా వారి వెంట ఉన్నారు.