Photo: Instagram
ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇటీవల ఏడడుగులు నడిచారు కొణిదెల నిహారిక-జొన్నలగడ్డ చైతన్య. ఉదయ్‌పూర్ ప్యాలస్ వేదికగా వైవాహిక బంధంలోకి అడుగిడిన ఈ జంట తాజాగా ఆత్మీయులు, సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు మెగా-అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరూ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ మెగా రిసెప్షన్‌కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మ్యాచింగ్ దుస్తుల్లో మెరిసిపోయారు!
గత శనివారం తమ నివాసంలో నిహాను పెళ్లి కుమార్తెను చేయడంతో నిహారిక-చైతన్య పెళ్లి సందడి మొదలైంది. ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఉదయ్ విలాస్ హోటల్లో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా వీరి వివాహ వేడుకలు జరిగాయి. వివాహానికి హాజరు కాలేని వారి కోసం తాజాగా హైదరాబాద్‌లో వివాహ విందు ఏర్పాటు చేశారీ లవ్లీ కపుల్. పెళ్లి వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో సూపర్బ్ అనిపించుకున్న కొత్త దంపతులు తాజా వివాహ విందులోనూ మ్యాచింగ్ దుస్తులతో మెరిసిపోయారు. ఈ సందర్భంగా ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించిన లైట్ గ్రీన్, గోల్డ్ కలర్ లెహెంగాలో మెరిసిపోయింది నిహారిక. దుస్తులకు తగ్గట్టుగా లైట్ మేకప్, మెడలో ధరించిన కుందన్ ఆభరణాలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయని చెప్పచ్చు. ఇక వరుడు చైతన్య వైట్ కలర్ షేర్వాణీలో తళుక్కుమన్నాడు.
అప్పుడు జాన్వీ...ఇప్పుడు నిహారిక!
ఈ సందర్భంగా నిహా ధరించిన బ్రైడల్ లెహెంగా ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే మనీశ్ మల్హోత్రా బ్రైడల్ కలెక్షన్లో భాగంగా ఇటీవల తెరకెక్కించిన ఓ ప్రకటనలో జాన్వీకపూర్ ఇలాంటి లెహెంగాలోనే దర్శనమిచ్చింది. ఆ అవుట్‌ఫిట్‌లో అచ్చం రాకుమారిలా కనిపించిన జాన్వీ ఫొటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా రిసెప్షన్ వేడుకలో అదే తరహా లెహెంగాలో కనిపించింది నిహారిక. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘సూపర్బ్..మనీశ్ దుస్తుల్లో అప్పుడు జాన్వీ...ఇప్పుడు నిహారిక ఎంతో అందంగా ఉన్నారు’, ‘ఈ లెహెంగాలో మెగా ప్రిన్సెస్ మరెంతో అందంగా కనిపిస్తోంది’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
రిసెప్షన్ వేడుకలో దాదాపు మెగా-అల్లు కుటుంబ సభ్యులందరూ పాల్గొనగా రామ్‌చరణ్-ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా బ్లాక్ కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్‌లో ముస్తాబై వచ్చిన ఉపాసన కొత్త దంపతులతో కలిసి సరదాగా ఫొటోలు దిగింది. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘నిశ్చయ్’ జంటకు శుభాకాంక్షలు తెలిపింది.
నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను!
అంతకుముందు నిహారిక-చైతన్య పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వరుణ్ తేజ్, బన్నీ సతీమణి స్నేహారెడ్డి కొత్త దంపతులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దగ్గరుండి తన ముద్దుల చెల్లి పెళ్లి చేసిన వరుణ్, నిహారిక పెళ్లి ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంటూ ‘నా బంగారు తల్లి నిహారిక, మా డ్యాషింగ్ బావ చైతన్యకు శుభాకాంక్షలు. నేనిప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో వర్ణించేందుకు మాటలు రావడం లేదు. నా చెల్లి-బావలను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు.
అర్హ ఇప్పటికే మిమ్మల్ని మిస్సవుతోంది!
ఇక కొత్త దంపతులతో తన కూతురు కలిసున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది అల్లు స్నేహారెడ్డి. ‘నా ముద్దుల కూతురు అర్హ ఇప్పటికే మిమ్మల్ని మిస్సవుతోంది’ అంటూ కొత్త జంటకు ‘కంగ్రాట్స్’ తెలిపింది.
ఈ క్రమంలో ప్రి వెడ్డింగ్ వేడుకలు మొదలైనప్పటి నుంచి ‘నిశ్చయ్’ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. తాజాగా రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలు కూడా నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి.