Photo: Instagram
ప్రస్తుతం ‘ది మోస్ట్ లవ్లీ సెలబ్రిటీ కపుల్’ అనగానే మనందరికీ గుర్తొచ్చేది అనుష్కాశర్మ-విరాట్ కోహ్లీనే. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ క్యూట్ కపుల్‌ను చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టారేమోనని అనిపించక మానదు. మూడేళ్ల క్రితం మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన ఈ అందాల జంట రోజురోజుకూ తమ అనుబంధాన్ని మరింత నిత్యనూతనం చేసుకుంటోంది. అందుకే వీరికి ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. మరికొన్ని రోజుల్లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్న విరుష్క దంపతులు మూడో వివాహ వార్షికోత్సవాన్ని (డిసెంబర్ 11) జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
ముచ్చటగా మూడో వసంతంలోకి!
పెళ్లికి ముందు ఓ యాడ్ షూటింగ్లో కలుసుకున్న అనుష్క-విరాట్ అభిరుచులు, అభిప్రాయాలు కలవడంతో కొన్నేళ్లు డేటింగ్ చేశారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2017లో డిసెంబర్ 11న ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరిగిన ఈ వివాహ వేడుక అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇక మొదటి, రెండవ వివాహ వార్షికోత్సవాలను కలిసే సెలబ్రేట్ చేసుకున్న విరుష్క దంపతులు మూడో వివాహ వార్షికోత్సవాన్ని మాత్రం వేర్వేరుగా జరుపుకొంటున్నారు. ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్ కోసం విరాట్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండగా, నిండు గర్భిణీ కావడంతో తమ నివాసంలోనే ఉంటోంది అనుష్క.
జీవితాంతం కలిసే ఉంటాం!
ఈ క్రమంలో తమ వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకుని సోషల్ మీడియా ద్వారా సతీమణికి శుభాకాంక్షలు తెలిపాడు విరాట్. తమ పెళ్లి నాటి అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేసుకుంటూ ‘3 ఏళ్లుగా...ఇంకా జీవితాంతం కలిసే ఉంటాం’ అని రాసుకొచ్చాడు. ఇక అనుష్క కూడా కోహ్లీతో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘మూడేళ్ల బంధం... మరికొన్ని రోజుల్లో ముగ్గురం కాబోతున్నాం.. మిస్ యూ’ అని తన ప్రేమకు అక్షర రూపమిచ్చింది. ఈ నేపథ్యంలో విరుష్క పెళ్లిరోజు ట్విట్టర్లో ట్రెండింగ్‌గా నిలవడం విశేషం. సమంత, జోయా అఖ్తర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మౌనీ రాయ్, జరీన్‌ఖాన్, డేనియల్ డివిలియర్స్(ఏబీ డివిలియర్స్ సతీమణి) లాంటి సెలబ్రిటీలతో పాటు పలువురు అభిమానులు, నెటిజన్లు ఈ అందాల జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ట్విట్టర్లోనూ వారే ట్రెండింగ్!
తమ అన్యోన్య దాంపత్య బంధంతో ఫ్యాన్స్‌కు రిలేషన్ షిప్ పాఠాలు నేర్పుతోంది విరుష్క జోడీ. సోషల్ మీడియాలోనూ ఈ జంటకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఇటీవల మరోసారి ఇది నిరూపితమైంది. ఈ ఏడాది అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్ ఈ దంపతులదేనని ట్విటర్ ఇండియా ఇటీవల తెలిపింది.
ఈ ట్వీట్‌ను ఎక్కువమంది మెచ్చారు!
మూడేళ్ల క్రితం పెళ్లిపీటలెక్కిన విరుష్క దంపతులు వచ్చే ఏడాది జనవరిలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను ఆగస్టులో సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారీ లవ్లీ కపుల్. ఈ సందర్భంగా గర్భంతో ఉన్న తన భార్యతో కలిసున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ ‘ఇక మేం ముగ్గురం కాబోతున్నాం. 2021 జనవరిలో’ అని రాసుకొచ్చాడు. దీంతో కొద్ది సేపట్లోనే ఈ ట్వీట్ వైరలైంది. లక్షలాది మంది ఈ ట్వీట్‌ను లైక్ చేయడంతో పాటు షేర్ చేశారు. అదేవిధంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ట్విట్టర్లో అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్ ఇదేనని ట్విట్టర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో విరాట్ షేర్ చేసిన ట్వీట్‌ను జత చేస్తూ ‘ది మోస్ట్ లైక్డ్ ట్వీట్ ఆఫ్ 2020’ అని ఇంగ్లిష్, హిందీ, తమిళ భాషల్లో పోస్ట్ చేసింది.