Photo: Instagram
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు తాతయ్య, నానమ్మలుగా ప్రమోషన్ పొందారు. వారి పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ సతీమణి శ్లోకా అంబానీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. చిన్నారి రాకతో అంబానీ, మెహతా కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.
శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో!
ఈమేరకు తమ కుటుంబంలోకి బుల్లి వారసుడు అడుగుపెట్టినట్లు అంబానీ కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులతో శ్లోకా-ఆకాశ్ అంబానీ తల్లిదండ్రులయ్యారు. వారికి పండంటి మగబిడ్డ జన్మించాడు. నీతా-ముఖేష్ అంబానీ మొదటిసారిగా నానమ్మ, తాతయ్య హోదా పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నారు. అదేవిధంగా ధీరూభాయి-కోకిలాబెన్ ముని మనవడికి స్వాగతం పలకడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కొత్త సభ్యుడి రాకతో అంబానీ-మెహతా కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి’ అని అంబానీ కుటుంబం అందరితో ఈ శుభవార్తను పంచుకుంది.
చిన్నప్పటి స్నేహం ప్రేమగా మారి..!
ఆకాశ్-శ్లోకా మెహతాలిద్దరూ ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. అంబానీ, మెహతాలు కూడా మంచి స్నేహితులు కావడంతో ఇరువురి ఇళ్ల్లలో ఎవరింట్లో వేడుక జరిగినా మరొకరు ఫ్యామిలీతో సహా హాజరయ్యేవారు. అలా చిన్నతనం నుంచి కలిసి పెరిగిన ఆకాశ్-శ్లోక మంచి స్నేహితులుగా మారిపోయారు. క్రమంగా ఆ స్నేహం ప్రేమగా చిగురించింది.
ఈ క్రమంలో పెద్దల అంగీకారంతో జూన్ 2018న ఉంగరాలు మార్చుకున్న ఈ అందాల జంట గతేడాది మార్చి 9న పెళ్లి పీటలెక్కారు. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన వీరి వివాహం గతేడాది ‘గ్రాండ్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం విశేషం. అమితాబ్, ఐశ్వర్యారాయ్, రేఖ, బోనీ కపూర్, జుహీచావ్లా, సచిన్- అంజలి, ఏక్తా కపూర్, ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావ్, అక్షయ్-ట్వింకిల్, పీవీ సింధు, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ దంపతులు, ఐరాస మాజీ జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్...వంటి ప్రముఖులు ఈ శుభకార్యానికి హాజరయ్యారు.
ఇద్దరూ ఇద్దరే!
అంబానీలకు తగ్గట్లు వారి కోడలిగా వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్లోక. ప్రముఖ వజ్రాల వ్యాపారి, రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రస్సెల్ మెహతా-మోనా మెహతాల కుమార్తె అయిన శ్లోక ధీరూభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఆంత్రోపాలజీలో డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో న్యాయశాస్ర్త పట్టా అందుకుంది. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చి ‘రోజీ బ్లూ ఫౌండేషన్’ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. పేద విద్యార్థులకు విద్యను చేరువ చేసేందుకు పలు ఎన్జీవోలతో కలిసి పని చేస్తున్న ఆమె ‘కనెక్ట్ ఫర్’ అనే వలంటీర్ల సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తోంది.
ఆకాశ్ విషయానికొస్తే... తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్న అతడు 2014లో కంపెనీలో జాయినయ్యాడు. సోదరి ఈషా అంబానీతో కలిసి రిలయన్స్ జియో సంస్థ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వీరిద్దరూ ప్రస్తుతం రిలయన్స్ జియో బోర్డు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ గ్రాసరీ సంస్థలకు పోటీగా ప్రారంభమైన జియోమార్ట్ ఏర్పాటులో కూడా ఆకాశ్, ఈషాలే కీలకంగా వ్యహరించారు. ఈ క్రమంలో తమ వ్యాపార దక్షతకు గుర్తింపుగా ‘ఫార్చ్యూన్ 40 అండర్ 40- 2020’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ముఖేష్ అంబానీ కుటుంబంలోకి జూనియర్ అంబానీ అడుగుపెట్టాడంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, రాజ్యసభ ఎంపీ పరిమల్ నాథ్వానీ ట్విట్టర్ ద్వారా ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ ఫొటోలో మనవడితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఎంతో సంతోషంతో కనిపించారు ముఖేష్. సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది సేపటికే ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా అమ్మానాన్నలుగా ప్రమోషన్ అందుకున్న ఆకాశ్-శ్లోకా దంపతులకు, తాతయ్య-నానమ్మ హోదా పొందిన ముఖేష్-నీతా అంబానీలకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.