మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల మిసెస్‌గా ప్రమోషన్ పొందింది. వేద మంత్రాలు...పెద్దల ఆశీర్వచనాల నడుమ జొన్నలగడ్డ చైతన్యతో కలిసి ఏడడుగులు నడిచింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ మెగా వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. మరి మూడుముళ్ల బంధంతో తన సరికొత్త ప్రయాణానికి నాంది పలికిన మన ‘మెగా డాటర్’ పెళ్లి విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.
తాళికట్టు శుభవేళ...!
అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూసిన మెగా డాటర్ నిహారిక వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలస్ వేదికగా బుధవారం (డిసెంబర్ 9) రాత్రి 7.15 నిమిషాలకు నిహారిక మెడలో మూడు ముళ్లు వేశాడు చైతన్య. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ శుభకార్యానికి మెగా-అల్లు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకలో భాగంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారీ లవ్లీ కపుల్.
ఈ సందర్భంగా బంగారు వర్ణపు కంజీవరం చీర, పర్పుల్ కలర్ బ్లౌజ్, టెంపుల్ జ్యుయలరీలో మెగా ప్రిన్సెస్ మెరిసిపోయింది. ఇక వరుడు చైతన్య డార్క్ గ్రీన్ కలర్ షేర్వాణీ, మ్యాచింగ్ కలర్ పైజామాలో సూపర్బ్ అనిపించాడు. ప్రి వెడ్డింగ్ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న నిహారిక-చైతన్య మనువాడే వేళ మరింత సంతోషంతో కనిపించారు. జీలకర్ర-బెల్లం, తాళికట్టు శుభవేళ...ఇలా ప్రతి సందర్భంలోనూ ఎంతో ఆనందంగా కనిపించారీ అందాల జంట. ఇక తలంబ్రాల వేడుకలో భాగంగా తన భర్త జుట్టును సరిచేస్తూ మురిసిపోయింది నిహారిక. ఈ క్రమంలో మెగా, అల్లు కుటుంబ సభ్యులందరూ నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
నిన్ను చాలా మిస్సవుతున్నా నిహా తల్లి!
ఈ సందర్భంగా తన కూతురుని అత్తారింటికి సాగనంపే సమయం ఆసన్నం కావడంతో పాత జ్ఞాపకాలు తలుచుకుని భావోద్వేగానికి గురయ్యాడు నాగబాబు. తన గారాల పట్టి పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘నా చిన్నారి తొలి రోజు పాఠశాలకు వెళ్తున్నట్లు అనిపిస్తోంది. కానీ ఆమె సాయంత్రం తిరిగి ఇంటికి రాదు. నా కూతురు ఎదిగి, పాఠశాలకు వెళ్తున్నప్పుడు తనతో రోజంతా ఆడుకోలేమనే ఫీలింగ్ వెంటాడేది. ఆ ఫీలింగ్‌ను దూరం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈసారి (పెళ్లి చేయడాన్ని ఉద్దేశిస్తూ) ఎంత కాలం పడుతుందో చూడాలి. దాన్ని కాలమే నిర్ణయిస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా నిహారిక తల్లి’ అని తన కూతురుపై ఉన్న ప్రేమకు అక్షర రూపమిచ్చాడీ మెగా బ్రదర్.
సకుటుంబ సపరివార సమేతంగా!
శనివారం పెళ్లి కుమార్తెను చేయడంతో ప్రారంభమైన నిహారిక-చైతన్య వివాహ వేడుకలు ఐదు రోజుల పాటు అత్యంత కనువిందుగా జరిగాయి. చిరంజీవి-సురేఖ, రామ్‌చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహారెడ్డి, సుస్మిత, శ్రీజ, సాయి ధరమ్ తేజ్ తదితర మెగా-అల్లు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక పవన్ కల్యాణ్ రాకతో నిహారిక పెళ్లికి మరింత కళ వచ్చింది. పవన్ కుమారుడు అకీరానందన్, కూతురు ఆద్య ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ క్రమంలో మెగా-అల్లు సకుటుంబ సపరివార సమేతంగా సాగిన నిహారిక పెళ్లి వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు మెగాభిమానులు, నెటిజన్లు నిహారిక-చైతన్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈ లవ్లీ కపుల్‌కు మనమూ కంగ్రాట్స్ చెబుతూనే... సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఈ జంట పెళ్లి ఫొటోలపై ఓ లుక్కేద్దాం రండి.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్వీట్ కపుల్!