Photo: Instagram
పెళ్లి, పిల్లలు పుట్టడం ప్రతి మహిళ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తాయి. పెళ్లయ్యాక ప్రాథమ్యాలు మారతాయని, తల్లయ్యాక పూర్తి సమయం ఇంటికే కేటాయిస్తారని, ఫలితంగా దాని ప్రభావం వృత్తిగత జీవితంపై పడుతుందనేది చాలామంది భావన. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే పెళ్లయిన తారలకు అవకాశాలు అడుగంటుతాయని, అమ్మయ్యాక సినిమా కెరీర్‌ను వదులుకోవాల్సిందేనని అంటుంటారు. అయితే అమ్మతనం మహిళల వృత్తిగత జీవితంపై ఏ మాత్రం ప్రభావం చూపదని చెబుతోంది ‘బొమ్మరిల్లు’ బ్యూటీ జెనీలియా డిసౌజా. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రితేశ్ దేశ్ముఖ్తో వివాహం తర్వాత పూర్తిగా కుటుంబానికే పరిమితమైన జెన్నీ... ఇద్దరు కొడుకులతో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. ఈక్రమంలోనే మళ్లీ సిల్వర్ స్ర్కీన్‌పై దర్శనమిచ్చేందుకు రడీ అవుతోంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
రీ ఎంట్రీకి సిద్ధం!
జెనీలియా... దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. హ...హ..హాసిని అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ‘సై’, ‘బాయ్స్’, ‘హ్యాపీ, ‘రెడీ’, ‘ఆరెంజ్’.. వంటి తెలుగు చిత్రాలతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎనిమిదేళ్ల క్రితం బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వారి ప్రేమకు గుర్తుగా రియాన్, రాహిల్ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇక వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ అందాల తార మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.
13 ఏళ్ల తర్వాత!
జెనీలియా నటించిన చిత్రాల్లో ‘బొమ్మరిల్లు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. 2006లో విడుదలైన ఈ సినిమాలో హాసినిగా ఆమె పండించిన అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. దీంతో ఇదే సినిమాను ‘ఇట్స్ మై లైఫ్’ పేరుతో బాలీవుడ్‌లోనూ రీమేక్ చేయాలనుకున్నారు. హర్మన్ బవేజా, జెనీలియా హీరో హీరోయిన్లుగా 2007లోనే షూటింగ్ కూడా పూర్తయింది. అయితే అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేకపోయింది. ఈక్రమంలో ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఇటీవల నేరుగా టీవీల్లో ప్రసారం చేశారు. దీంతో చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపించింది జెన్నీ. ఈ సందర్భంగా అమ్మతనం, సినిమాల్లో రీ ఎంట్రీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్ చేసుకుంది.
అందుకే సినిమాలకు విరామం ఇచ్చాను!
‘నేను హీరోయిన్గా నటించిన చాలా చిత్రాలు ఇతర భాషల్లోకి రీమేక్ అయ్యాయి. కానీ నేను వాటిలో నటించలేదు. అయితే ‘బొమ్మరిల్లు’ తమిళ, హిందీ రీమేక్‌లలో నేనే హీరోయిన్గా చేశాను. అందుకే ఈ సినిమా అంటే నాకు ఎంతో ప్రత్యేకం. ఇది చాలా అందమైన కథ. తల్లిదండ్రులు, పిల్లల మధ్య సహజంగా ఉండే కమ్యూనికేషన్ గ్యాప్, దానిని అధిగమించి అనుబంధంగా ఎలా మార్చుకోవాలో చాలా చక్కగా ఈ సినిమాలో చూపించారు. ‘ఇట్స్ మై లైఫ్’తో మళ్లీ నన్ను నేను తెర మీద చూసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తల్లయ్యాక నేను అసలు సినిమాలు చేయలేదు. కానీ మళ్లీ ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. సెకండ్ ఇన్నింగ్స్‌లో నాకెలాంటి పాత్రలు వస్తాయో, ప్రేక్షకులు నన్ను మళ్లీ ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియడం లేదు. పెళ్లి కాక ముందు నేను 365 రోజులూ షూటింగ్‌కు హాజరయ్యేదాన్ని. ఆ సమయంలో నేను హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించలేదు. కానీ దక్షిణాదిన మాత్రం నిర్విరామంగా సినిమాలు చేశాను. అందుకే పెళ్లయ్యాక సినిమాలకు కాస్త విరామం ఇద్దామనుకున్నాను. అనుకున్నట్లే పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయించాను. ఆ తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అమ్మతనాన్ని కూడా పూర్తిగా ఆస్వాదించాలనుకున్నాను. అందుకే ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా ఉన్నాను.’
‘పెళ్లయితే కెరీర్‌కు ఫుల్స్టాప్ పడ్డట్టే’ అన్నారు!
‘2012లో నేను రితేశ్‌ను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుంటే సినిమా కెరీర్‌కు ఫుల్స్టాప్ పడినట్టేనని, సినిమా అవకాశాలు అసలు రావని చాలామంది నాతో అన్నారు. కానీ నేను నా వివాహాన్ని మాత్రం ఆపదలుచుకోలేదు. ఎందుకంటే పెళ్లి, పిల్లలు అనేవి కూడా నేను కోరుకున్న జీవితంలో ఒక భాగం. నేను కోరుకున్నట్లే నా జీవితం సాగుతోంది. అందులో భాగంగానే మళ్లీ సినిమాలు చేయలనుకుంటున్నాను. కానీ గతంలో మాదిరిగా సంవత్సరం పొడవునా షూటింగ్‌లకు హాజరుకాలేను. నటిగా నన్ను నిరూపించుకుంటూ ఏడాదికి 2-3 సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నాను’.
అదే మా అన్యోన్య బంధానికి కారణం!
‘ఇక నేను సినిమాల్లో నటించాలని ఎంత ఆసక్తిగా ఉన్నానో అంతకన్నా ఎక్కువగానే ఎదురుచూస్తున్నాడు రితేశ్. ‘ఎందుకు ఖాళీగా ఉండి నీ ట్యాలెంట్‌ను వృథా చేసుకుంటావు? సినిమాల్లో నటించు’ అని రెండేళ్లుగా నన్ను అడుగుతూనే ఉన్నాడు. తను అలా సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకెంతో సంతోషంగా ఉంటుంది. భర్త నుంచి అలాంటి సహాయ సహకారాలు ఉంటే ఎలాంటి పనులైనా మహిళలకు కష్టమనిపించవు. నిజం చెప్పాలంటే...గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూ నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఆ బాధ్యతలను ఎప్పుడూ భారమనుకోలేదు. పైగా రితేశ్ ఎప్పుడూ నా వెన్నంటే ఉంటున్నాడు.
ఇక మా ఇద్దరి మధ్య అన్యోన్యతకు కారణమేంటని చాలామంది అడుగుతుంటారు. నేను, రితేశ్ పదేళ్ల పాటు ప్రేమలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకి ఇప్పటికీ మా వద్ద సమాధానం లేదు. నాకు తెలిసి మేమిద్దరం ఎక్కువగా కమ్యూనికేట్ అవుతుంటాం. అది లేకపోవడం వల్లే అనేక బంధాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయనుకుంటున్నా! తను లేకపోతే నేను ఉండలేనని పలుసార్లు ఎమోషనల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా ప్రాథమ్యాల గురించి రితేశ్‌కు బాగా తెలుసు. అందుకు మా ఆయనను ప్రశంసించాలి. కేవలం నేను గొడవ పెట్టుకోవాలనుకుంటే తప్ప... మా మధ్య సాధారణంగా గొడవలు రావు(నవ్వుతూ). ఇక ఓ భార్యగా తన ఇష్టాయిష్టాలేంటో నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఇక ఇంటి విషయాల్లో కూడా రితేశ్ నాకు ఎంతో సపోర్టివ్‌గా ఉంటాడు. ‘ఇది నువ్వే చేయాలి.. నువ్వు మాత్రమే చేయాలి’ అన్న నియమాలు, నిబంధనలు ఎప్పుడూ ఉండవు. బహుశా మా ఇద్దరి మధ్య పరస్పర అవగాహన, కమ్యూనికేషన్ వల్లే మా బంధం మరింత దృఢంగా మారిందని అనుకుంటున్నాను’ అంటూ జంటలందరికీ రిలేషన్షిప్ పాఠాలు నేర్పుతోందీ బాలీవుడ్ బ్యూటీ.