Photo: Instagram
కొద్ది రోజుల క్రితం సడెన్‌గా సినిమాలకు స్వస్తి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది బాలీవుడ్ నటి సనాఖాన్. హిందీ సినిమాలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి చేసుకుని మరోసారి అందరినీ సర్ప్రైజ్ చేసింది. గుజరాత్‌కు చెందిన ముఫ్తి అనాస్ సయీద్‌తో కలిసి ఆమె పెళ్లిపీటలెక్కింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలో సనాఖాన్ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సినిమాలకు స్వస్తి చెప్పి!
ముంబయికి చెందిన సనాఖాన్ మోడలింగ్‌తో కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత టీవీ షోలు, కమర్షియల్ యాడ్‌ఫిల్మ్స్‌లో నటిస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘హల్లాబోల్’, ‘జయహో’, ‘వజా తుమ్‌హో’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ ... తదితర బాలీవుడ్ సినిమాల్లో కనిపించిన ఈ సొగసరి ‘కల్యాణ్ రామ్ కత్తి’, ‘గగనం’, ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే బిగ్‌బాస్ లాంటి రియాలిటీ టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో బుల్లితెరపై కూడా సత్తా చాటింది. చివరిగా ‘Special OPS’ అనే వెబ్‌సిరీస్‌లో కనిపించిన ఆమె తాను ఇక సినిమాల్లో నటించనంటూ అక్టోబర్ 8న ప్రకటించింది. ఈ నిర్ణయాని కంటే ముందే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తన సినిమాలకు సంబంధించిన గ్లామర్ ఫొటోలన్నింటినీ తొలగించింది.
వివాహ బంధంలోకి అడుగుపెట్టింది!
గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండాలనుకుని నిర్ణయించుకున్న సనాఖాన్ ‘నేను ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ గ్లామర్ ప్రపంచం నాకు అమితమైన సంపద, కీర్తి ప్రతిష్ఠలతో పాటు ఎందరో అభిమానులను ఇచ్చింది. ఈ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాలిని. కానీ డబ్బు, కీర్తి ప్రతిష్ఠల కోసమే నేను ఈ భూమ్మీదకి రాలేదని నాకు అర్థమైంది. అందుకే ఈ ఎంటర్టైన్మెంట్ లైఫ్‌స్టైల్‌కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. దేవుని ఆదేశానుసారం నిస్సహాయులకు నా వంతు సహాయ సహకారాలు అందిద్దామని నిర్ణయించుకున్నాను. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో నాకు సహకరించిన వారందరికీ మరోసారి ధన్యవాదాలు. అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను’ అని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆమె తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సూరత్ వేదికగా గుజరాత్‌కు చెందిన ముఫ్తి అనాస్‌ను మనువాడిందీ ముద్దుగుమ్మ.
ప్రేమించుకున్నాం! పెళ్లి చేసుకున్నాం!
తాజాగా తన వివాహానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సనాఖాన్. ‘దేవుని దయతో ఒకరినొకరు ప్రేమించుకున్నాం. వివాహ బంధంలోకి అడుగుపెట్టాం. ఆ దేవుడు మమ్మల్ని ఎప్పటికీ ఐక్యంగా ఉంచుతాడని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చిందామె. ఈ సందర్భంగా రెడ్ అండ్ గోల్డెన్ కలర్ బ్రైడల్ లెహంగాలో పెళ్లి కూతురుగా దర్శనమిచ్చి సూపర్బ్ అనిపించింది సన. ఒంటి నిండా కుందన్ ఆభరణాలు, గాజులు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఇక పెళ్లి వేడుకల్లో భాగంగా ‘నిఖా ముబారక్’ అని రాసి ఉన్న కేక్‌ను కలిసి కట్ చేశారీ క్యూట్ కపుల్.
ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. అంకితా లోఖండే, అర్మాన్ మాలిక్, దివ్యా అగర్వాల్, మహివిజ్, యువికా చౌదరి, కరణ్థాకర్ తదితర సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు అభిమానులు, నెటిజన్లు ఆమె దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరి కొత్త జీవితం ప్రారంభిస్తున్న ఈ కొత్త దంపతులకు మనమూ శుభాకాంక్షలు తెలుపుదాం!
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ క్యూట్ కపుల్!