'బ్రేకప్..', 'విడాకులు..' పదం ఏదైనా సరే.. ఒక బంధం నుంచి తప్పుకున్నట్లు ప్రకటించే పదాలివి! జీవితంలో అమితమైన సంతోషాన్ని కలిగించాల్సిన బంధాలు ఒక్కోసారి ఎనలేని బాధకూ కారణమవుతాయి. మానసికంగా, శారీరకంగా అంతులేని వేదనను మిగులుస్తాయి. అన్నివిధాలా కుంగదీసి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. అలాంటి సందర్భాలలో ఒక్కోసారి ఆ బంధం నుంచి శాశ్వతంగా తప్పుకోవాల్సి వస్తుంది.అది ఎంత బాధాకరమైనా ఇలాంటి పరిస్థితులలో అలాంటి విషపూరిత బంధం నుంచి తప్పుకోవడమే మంచిదంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయని వారు సూచిస్తున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి.

1) 'నీకు ఏ పనీ సరిగ్గా రాదు..', 'నువ్వు ఏమీ చేయలేవు..' ఇలా నిరుత్సాహం కలిగించే మాటలు చాలామంది దంపతులు/జంటల మధ్య మనం వింటూనే ఉంటాం. కాకపోతే కొందరు ఆ క్షణానికి మాత్రమే ఆ మాటలు అని, తర్వాత తమ తప్పు తెలుసుకొని సర్దుకుపోతే, ఇంకొందరు మాత్రం అదేపనిగా భాగస్వామిని విమర్శిస్తూనే ఉంటారు. ఒక్కోసారి ఈ విమర్శలు మనపై మనకు ఉండే నమ్మకాన్ని ప్రభావితం చేసి మనం అసలు ఏమీ చేయలేమా? మనకేమీ చేతకాదా? అనే సందేహంలో పడేస్తాయి. కాబట్టి అలాంటి వ్యక్తుల నుంచి దూరం జరిగినప్పుడు ఈ తరహా విమర్శల నుంచి బయటపడడమే కాదు.. మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ప్రోది చేసుకొనే వీలు కూడా ఉంటుంది. గతంలో లాగా మిమ్మల్ని నియంత్రించాలనుకోవడం, చీటికి మాటికి అనవసరంగా మిమ్మల్ని తిట్టడం లాంటి సమస్యలుండవు.

2) గతంలో మీరు ఉన్నత స్థానానికి ఎదుగుతున్నప్పుడు మీ భాగస్వామి భయాందోళనకు గురై ఉండచ్చు. తనను వదిలి వెళ్తారేమో అని అతను ప్రతిక్షణం అభద్రతకు గురై మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండచ్చు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు మీకు ఉండవు. మీకు ఇష్టం వచ్చిన విధంగా మీ ఉన్నతికి బాటలు వేసుకోవచ్చు.
3) మీపై అనుమానపు నీడల సమస్య ఉండదు. అతని పరోక్షంలో మీరు ఏం చేస్తున్నారో అని ప్రతిక్షణం అతని అనుమానానికి లోనయ్యే ఇబ్బంది ఇప్పుడు ఉండదు. మీ ఆత్మాభిమానాన్ని చంపుకోనవసరం లేదు. అనుక్షణం మానసిక వేదన చెందాల్సిన పని లేదు.

4) ఒకరికొకరు పరస్పరం నియంత్రించుకోవడానికి ఉపయోగించిన సమయాన్ని మీ కెరీర్ అభ్యున్నతికి, శిక్షణ కార్యక్రమాలకు వాడండి. ఇప్పుడు మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు మీరు తీర్చిదిద్దుకోవచ్చు. అవసరమనిపిస్తే ఈ క్రమంలో నిపుణుల సహాయం కూడా తీసుకోవచ్చు.
5) ఒకరికొకరు తప్పులు వెతుక్కునే సమస్య ఇక ఉండదు. తద్వారా తప్పులు గుర్తుంచుకొని లెక్క పెట్టాల్సిన అవసరం ఇక మెదడుకు ఉండదు. అంటే మెదడుకు విశ్రాంతి లభిస్తుందన్న మాట.
6) మిమ్మల్ని మీరు ప్రేమించుకునే సౌలభ్యం దొరుకుతుంది. మిమ్మల్ని మీరు కొత్తగా అన్వేషించుకుంటారు. మీ గురించి మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు. మీకంటూ కొన్ని ఇష్టాలను ఏర్పర్చుకోవడానికీ అవకాశం ఏర్పడుతుంది.

7) ఒక బంధంలో ఉన్నంతవరకు మనసుకు నచ్చిన పని చేయాలన్నా, నచ్చిన దుస్తులు వేసుకోవాలన్నా, మేకప్ చేసుకోవాలన్నా..చాలా నిబంధనలు ఉంటూనే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ బంధం నుంచి తప్పుకున్న తర్వాత ఇలాంటి అడ్డంకులు, నియమాలు ఏవీ మీపై ఉండవు. కాబట్టి మీకు నచ్చినట్లు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు. ఈ క్రమంలో చక్కని కెరీర్‌కు బాటలు పరుచుకోవడం మాత్రమే కాదు. మీ ఆహార్యాన్ని సైతం అందుకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీ స్వేచ్ఛాస్వాతంత్య్రాలపై ఎవ్వరూ ఎలాంటి కట్టుబాట్లు విధించలేరని గుర్తుంచుకోండి. కాబట్టి వ్యక్తిగతంగానూ మీరు ఎలా ఉంటే మీకు ఇష్టమో అలానే మిమ్మల్ని తీర్చిదిద్దుకోండి. అవసరమనిపిస్తే ఈ క్రమంలో నిపుణుల సహాయం కూడా తీసుకోవచ్చు.

8) అలాగే ఇన్నాళ్ళూ ఒకరితో మీ సంబంధ బాంధవ్యాల వల్ల ఒకవేళ మీరు మీ స్నేహితులకు దూరమైనా, జీవితంలో కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసినా- ఇప్పుడు వాటిపైన మళ్ళీ దృష్టి పెట్టండి. ఇన్నాళ్ళూ పట్టించుకోని అంశాల పట్ల దృష్టి సారించి, జీవితంలో కొత్త మార్పులకి శ్రీకారం చుట్టండి.
9) మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో మీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి?? ఒక బంధం నుంచి బయటపడిన తర్వాత అందులో మీకు ఎదురైన చెడు అనుభవవాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కూర్చోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దానికి బదులుగా ఆ బాధ నుంచి వీలైనంత త్వరగా తెరుకునేందుకు ప్రయత్నించండి. ఇందులో భాగంగానే మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో ఒక్కసారి గమనించి ఆయా పనులు చేసి చూడండి. ఫలితంగా బాధ నుంచి బయటపడడమే కాదు.. మానసికంగా కూడా తిరిగి కాస్త కుదురుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మీ భవిత గురించి ఆలోచించి, ఆ దిశగా అడుగులు వేయచ్చు.

10) ఒక విషపూరిత బంధం నుంచి బయటపడ్డాక ఇప్పుడు మీరు మీకు తగ్గ వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకాశం, స్వేచ్ఛ ఉంటుంది. మీ అభిరుచులను గౌరవించే, ఆసక్తులను ప్రోత్సహించే వ్యక్తిని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మీరు భవిష్యత్ సంబంధాల గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలుంటాయి. భవిష్యత్తులో మరో భాగస్వామిని ఎంపిక చేసుకోవాలనుకుంటే వారిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? వారు మీతో ఎలా వ్యవహరించాలి? మీకు ఎలాంటి స్వతంత్రం ఇవ్వాలి? అలాగే మీ కెరీర్ ఏ విధంగా సాగాలి? దానికి మీ భాగస్వామి నుంచి ఎలాంటి సహకారం ఉండాలి? వంటి విషయాలపై మీరు ముందే ఓ అవగాహనకు రావచ్చు.
సో...వేదన కలిగించే కొన్ని బంధాల నుంచి బయటపడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలిసిందిగా..! అందుకే అలాంటి బంధాల నుంచి దూరమైనందుకు చింతించకుండా హ్యాపీగా ఫీలవ్వండి!