క్రికెట్-సినిమా... కొన్ని సెలబ్రిటీ జంటలను చూస్తుంటే మన దేశంలో ఈ రెండు రంగాలకు చాలా అవినాభావ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. మన్సూర్ అలీఖాన్ పటౌడీ-షర్మిలా ఠాగూర్, అజహరుద్దీన్-సంగీతా బిజ్లానీ, యువరాజ్‌సింగ్-హేజెల్ కీచ్, హర్భజన్ సింగ్-గీతా బస్రా, జహీర్‌ఖాన్-సాగరికా ఘట్గే, విరాట్-అనుష్క, మనీష్- అశ్రిత...ఇలా పెళ్లితో పెనవేసుకున్న క్రికెట్-సినిమా బంధాలు చాలానే కనిపిస్తాయి. త్వరలోనే మరో జంట ఈ జాబితాలోకి చేరనుంది. వారే టీం ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్, డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ లవ్‌బర్డ్స్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు.
యజువేంద్ర చాహల్... క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. హర్యానాకు చెందిన ఈ క్రికెటర్ ఐపీఎల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. తన మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టే ఈ బౌలర్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. ప్రత్యేకించి వన్డే, టీ20 ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తోన్న ఈ క్రికెటర్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో స్పిన్ ప్రతిభను చూపిస్తున్నాడు. ఇప్పటికే యాభైకి పైగా వన్డేలు, 40కి పైగా టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఎన్నో విజయాలు అందించాడీ యంగ్ క్రికెటర్. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమందిని బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపిన చాహల్‌ను తన అందంతో క్లీన్ బౌల్డ్ చేసింది ధనశ్రీ వర్మ. వృత్తిరీత్యా దంత వైద్యురాలైన ఈ ముంబై ముద్దుగుమ్మ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గానే ఎక్కువమందికి పరిచయం. తన పేరుతో ఓ సొంత యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న ఆమెకు సోషల్ మీడియాలోనూ అశేష అభిమానులున్నారు.
అందరూ ‘అవును’ అనేశారు!
ఆటతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు చాహల్. భారత క్రికెట్ జట్టులో అల్లరి కుర్రాడిగా పేరున్న ఈ హ్యాండ్సమ్ క్రికెటర్ అందరినీ నవ్విస్తూ...కవ్విస్తూ..సరదాగా ఆటపట్టిస్తుంటాడు. మైదానంలో తన స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించే చాహల్ సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటున్నాడు. నిత్యం ఫన్నీ పోస్టులు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ఇక అచ్చం చాహల్లానే ధనశ్రీ సైతం సామాజిక మాధ్యమాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఈక్రమంలో కొద్ది రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ తాజాగా తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టారు. ఇటీవల ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా రోకా వేడుకను జరుపుకొన్న ఈ లవ్లీ కపుల్... వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ధనశ్రీతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసిన చాహల్ ‘మా కుటుంబాలతో పాటు మేమిద్దరమూ ‘అవును’ అనేశాం’ అని రాసుకొచ్చాడు. దీంతో విరాట్-అనుష్క దంపతులు, రోహిత్-రితికా దంపతులు, భువనేశ్వర్ కుమార్, కేఎల్ రాహుల్, ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనీ వ్యాట్ తదితరులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కూడా ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంతకీ ఆమె ఎవరంటే!
చాహల్-ధనశ్రీలు చాలా రోజులుగా ప్రేమలో ఉన్నప్పటికీ ప్రైవసీని పాటించారు. తమ ప్రేమ గురించి ఎవరూ అధికారికంగా బయటపెట్టలేదు. అయితే ఘనంగా రోకా వేడుకను జరుపుకొని అందరినీ సర్ ప్రైజ్ చేశారీ క్యూట్ కపుల్. వీరి ఫొటోలను చూసిన నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ఎవరీ ధనశ్రీ వర్మ? అని తెలుసుకునేందుకు గూగుల్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి.
* ముంబయికి చెందిన ధనశ్రీ ఓ డెంటిస్ట్. 2014లోనే నవీ ముంబయిలోని డీవై పాటిల్ డెంటల్ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకుందామె.
* అయితే డ్యాన్స్, కొరియోగ్రఫీ అంటేనే ఎక్కువ మక్కువ చూపించే ఈ ముద్దుగుమ్మ ‘ధనశ్రీ వర్మ డ్యాన్స్ కంపెనీ’ పేరుతో ఓ సొంత డ్యాన్స్ అకాడమీని ఏర్పాటు చేసింది.
* ఈ అందాల తార డ్యాన్స్ అంటే పడిచచ్చే అభిమాన గణం చాలానే ఉంది. ఈ క్రమంలో ఆమె సొంత యూట్యూబ్ ఛానెల్‌కు 15 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉండడం విశేషం.
* హిప్హాప్ డ్యాన్స్‌లో సుప్రసిద్ధురాలైన ధనశ్రీ చేసిన వీడియోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ లభిస్తున్నాయి. గతంలో ఆమె ‘చో గడాతరా’ అంటూ చేసిన వీడియోకు ఏకంగా 48 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. అదేవిధంగా ‘ఓసాకీసాకీ’ అంటు చేసిన డ్యాన్స్ వీడియోకు 16 మిలియన్ల వ్యూస్ లభించాయి.
* ఈ ఏడాది ‘లవ్ ఆజ్కల్ 2’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ కార్యక్రమంలో కార్తిక్ ఆర్యన్, సారా అలీఖాన్‌లతో కలిసి స్టెప్పులేసి ఆకట్టుకుందీ అందాల తార.
* సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ధనశ్రీకి ఇన్‌స్టాలో సుమారు 5 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. చాహల్‌తో పెళ్లి ఖరారైనట్లు ఆమె షేర్ చేసిన పోస్టుకు సుమారు 4 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో ఈ అందాల తారకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏపాటిదో!
మరి, పెద్దల ఆశీర్వాదంతో త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఈ ముద్దుల జంటకు మనమూ అభినందనలు చెప్పేద్దాం.!!
కంగ్రాట్స్ క్యూట్ కపుల్!!