‘ప్రతి పురుషుని విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది’.. అన్నట్లు తన సతీమణి అనుష్కే తన సక్సెస్ సీక్రెట్ అని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. పెళ్లి కాక ముందు దుందుడుకు స్వభావంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ స్టార్ క్రికెటర్... అనుష్కతో జీవితం పంచుకున్నాక ఎంతో ప్రశాంతంగా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఆటగాడిగానే కాకుండా, ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న విరాట్... తాజాగా మరోసారి తన సతీమణిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘తను నా బెటర్‌హాఫ్ అయినందుకు తాను ఎంతో అదృష్టవంతుడిన’ని చెబుతున్న ఈ డ్యాషింగ్ క్రికెటర్ తన సక్సెస్ క్రెడిట్ మొత్తం అనుష్కదే అంటూ ఆకాశానికెత్తేశాడు. మరి... ఇంకా తన ముద్దుల భార్య గురించి విరాట్ ఏమన్నాడో తెలుసుకుందాం రండి...
ఆమె నా జీవితాన్ని ఎలా మార్చిందంటే!
ప్రస్తుతం ఉన్న సెలబ్రిటీ జంటల్లో విరాట్-అనుష్క జోడీకి ఉన్న క్రేజ్ వేరు. దాంపత్య బంధానికి సరైన నిర్వచనంలా కనిపించే ఈ దంపతులు సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడానికి ఏ మాత్రం వెనుకాడరు. తమ అన్యోన్య దాంపత్య జీవితంతో రిలేషన్షిప్ పాఠాలు నేర్పుతున్న ఈ క్యూట్ కపుల్ ప్రస్తుతం లాక్డౌన్ సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వెరైటీ వంటకాలు, ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీలు తయారుచేస్తూ తన అభిమానులతో పంచుకుంటోంది అనుష్క. ఇక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోన్న విరాట్ తాజాగా ఓ వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్’ పేరిట మయాంక్ అగర్వాల్ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో తన జీవిత భాగస్వామి తన జీవితాన్ని ఎలా మార్చేసిందో అందరితో షేర్ చేసుకున్నాడు విరాట్.
అనుష్క... నాకు దేవుడిచ్చిన వరం!
‘అనుష్క నా జీవితంలోకి అడుగుపెట్టాక నా మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం నేను ప్రతి అంశాన్నీ విభిన్న కోణాల్లోంచి చూడగలుగుతున్నాను. అదేవిధంగా క్రికెట్‌కు సంబంధించి జయాపజయాలను భూతద్దంలో చూడడం మానేశాను. ఈ మార్పు నా క్రికెట్ కెరీర్‌తో పాటు నా వ్యక్తిగత జీవితానికి ఎంతో మేలు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి క్రెడిట్ నా సతీమణికే దక్కుతుంది. అనుష్క నా జీవిత భాగస్వామిగా రావడం నా అదృష్టం. వ్యక్తిగతంగానే కాదు.. వృత్తిపరంగానూ మేం పరస్పరం ప్రోత్సహించుకుంటాం. ఒకరి నుంచి ఒకరం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఇక అనుష్క రాకముందు నేను ఇంత ఓపెన్‌గా ఉండేవాడిని కాదు. ప్రాక్టికల్‌గా ఆలోచించేవాడిని కాదు. అసలు కొన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకునేవాడిని కాదు. అయితే ఎప్పుడైతే అనుష్క నా జీవితంలోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచే నా ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. చాలా విషయాలను విశాల దృక్పథంతో చూడాలని నా భార్య నుంచే నేర్చుకున్నా. ఓ బాధ్యతాయుతమైన క్రికెటర్‌గా ఆదర్శంగా నిలవడం, అన్ని విషయాలను సరైన రీతిలో అర్థం చేసుకోవడం.. ఇలా ఎన్నో అంశాలు అనుష్క నుంచి నేర్చుకున్నవే. తను నా జీవితంలోకి రాకపోతే నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండేవాడిని కాదేమో.. నన్ను మంచి వ్యక్తిగా మార్చిన ఆమె నాకు దేవుడిచ్చిన వరం’ అని తన సతీమణిపై ప్రశంసల వర్షం కురిపించాడీ హ్యాండ్సమ్ హజ్బెండ్.
ఆ కేక్ నాకు చాలా ప్రత్యేకం!
లాక్డౌన్ నేపథ్యంలో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు అనుష్క-విరాట్. అయితే తన జీవిత కాలంలో ఎప్పుడూ కేక్ తయారుచేయని విరాట్... అనుష్క పుట్టిన రోజు (మే11)న మాత్రం స్వయంగా కేక్ తయారుచేసి ఇచ్చాడట. అంతేకాదు.. ఈ హోం క్వారంటైన్లో తాము బాగా ఎంజాయ్ చేసిన సందర్భమిదేనంటూ ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు విరాట్. ‘అనుష్క పుట్టిన రోజున నేనే స్వయంగా బర్త్‌డే కేక్ తయారుచేశాను. నా జీవితంలో కేక్ తయారుచేయడం ఇదే మొదటిసారి. అయితే అదృష్టవశాత్తూ కేక్ బాగానే వచ్చింది. అనుష్క కూడా నా ప్రయత్నాన్ని మెచ్చుకుంది. మొదటిసారిగా తయారుచేసిన ఈ కేక్ నాకు చాలా ప్రత్యేకమైనది’ అంటూ తన ముద్దుల భార్యపై ప్రేమ కురిపించాడు విరాట్.