‘ఐ యామ్ సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ ’...అని ‘భీష్మ...ది బ్యాచిలర్’ సినిమాలో పాట పాడుకున్నట్లుగానే టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లిపీటలెక్కేశాడు. వేదమంత్రాల సాక్షిగా తన ప్రియురాలు షాలిని మెడలో మూడు ముళ్ళూ వేసి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్ వేదికగా వీరి వివాహం జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితర సెలబ్రిటీలు ఈ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎంగేజ్మెంట్తో సెలబ్రేషన్స్ షురూ!
నాలుగేళ్లు ప్రేమలో ఉన్న నితిన్- షాలిని తాజాగా ఏడడుగులు నడిచి కొత్త ప్రయాణం ప్రారంభించారు. ఫిబ్రవరిలో ‘పసుపు కుంకుమ వేడుక’ జరుపుకున్న ఈ అందాల జంట ఏప్రిల్‌లోనే దుబాయి వేదికగా ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కరోనా ప్రభావంతో ఈ శుభకార్యం వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు కరోనా తగ్గే సూచనలు లేకపోవడంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే సింపుల్‌గా పెళ్లి పీటలెక్కారీ స్వీట్ కపుల్. ఈ క్రమంలో ఈనెల 2న ఎంగేజ్మెంట్తో వీరి ప్రి వెడ్డింగ్ సందడి షురూ అయింది. నిశ్చితార్థం వేడుకలో భాగంగా కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారీ క్యూట్ కపుల్. ఆ తర్వాత ప్రఖ్యాత హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలస్‌లో మెహందీ, సంగీత్ నైట్, కాక్టెయిల్ పార్టీ వేడుకలు జరిగాయి.
మీ దీవెనలు కావాలి!
ఇక ఆదివారం జరిగిన పెళ్లి వేడుక కోసం సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యారు నితిన్- షాలిని. ఈ సందర్భంగా ఆఫ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ ప్యాటీ శారీ, సంప్రదాయ ఆభరణాలు ధరించి షాలిని మెరిసిపోగా, రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ షేర్వాణీ లో సూపర్బ్ అనిపించాడు నితిన్. అనంతరం కొవిడ్ నిబంధనలు అనుసరించి ఫేస్ మాస్కులు ధరించి పెళ్లి మండపంలోకి అడుగు పెట్టారు ఈ క్యూట్ కపుల్. ఇక వేదమంత్రాల సాక్షిగా సరిగ్గా రాత్రి 8.30 గంటలకు షాలిని మెడలో మూడు ముళ్లు వేశాడు నితిన్. అనంతరం అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పరిమిత సంఖ్యలో ఈ వేడుకకు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో తన వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశాడు నితిన్. షాలిని మెడలో తాళి కడుతున్న ఫొటోలను పంచుకుంటూ ‘మొత్తానికి ఒక ఇంటివాడినయ్యాను. మీ అందరి ప్రేమాభిమానాలు, దీవెనలు కావాలి’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా ఈ కొత్త దంపతులకు అభినందనలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
‘పెళ్లి’ కానుక అదిరిపోయింది!
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. ఈ నేపథ్యంలో ఈ హ్యాండ్సమ్ హీరో వివాహాన్ని పురస్కరించుకుని ‘ఏ క్యూట్ మ్యారే జ్ గిఫ్ట్ టు అవర్ హీరో’ అంటూ ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ని విడుదల చేసిందీ చిత్ర బృందం. ‘పెళ్లి కొడుకెక్కడ...’ అనే డైలాగ్‌తో మొదలయ్యే ఈ టీజర్లో పలు సంభాషణలు అభిమానులను అలరిస్తున్నాయి. ఇక చివరిలో పెళ్లి కూతురి గెటప్‌లో ఉన్న కీర్తి సురేష్ ను చూసి ‘నాన్నా... ఇది నవ్వుతోంది, నేను తాళి కట్టలేను నాన్నా’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్ కడుపుబ్బా నవ్విస్తోంది.
మరి ఏడడుగుల ప్రయాణంతో కొత్త జీవితం ప్రారంభించిన నితిన్- షాలిని దంపతులకు మనమూ శుభాకాంక్షలు చెబుదాం.
‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు స్వీట్ కపుల్!
Photo: Instagram