@teamvasundhara
నోరూరించే ఈ సంక్రాంతి వంటకాలు రుచి చూసేద్దామా..!
‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. సరదాలు తెచ్చిందే తుమ్మెదా..’ అంటూ తెలుగు ప్రజలంతా సరదాగా ఆడుతూ పాడుతూ చేసుకునే అతి ముఖ్యమైన పండగే మకర సంక్రాంతి.
భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగలో భాగంగా రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడిపందాలు.. వంటి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. అంతేనా.. పండగొచ్చిందంటే చాలు.. ప్రత్యేకమైన పిండి వంటలతో తెలుగు లోగిళ్లన్నీ ఘుమఘుమలాడతాయి. కొత్త పంట చేతికొచ్చే ఈ ఆనందంలో వివిధ రకాల ప్రత్యేక వంటకాల్ని చేసుకొని ఇంటిల్లిపాదీ ఆస్వాదిస్తుంటారు. మరి, ఈ సంక్రాంతి సందర్భంగా పండగ ఆనందాన్ని రెట్టించే, అతిథులకు నోరూరించే అలాంటి కొన్ని స్పెషల్ రెసిపీస్ మీకోసం..
నువ్వుల పులిహోర

కావాల్సినవి
* బియ్యం - కప్పు (కడిగి, నానబెట్టుకోవాలి)
* నువ్వులు - మూడు టేబుల్‌స్పూన్లు
* నువ్వుల నూనె - తగినంత
* పోపు దినుసులు (ఆవాలు, మినపప్పు, శెనగపప్పు) - టేబుల్‌స్పూన్
* పల్లీలు - రెండు టేబుల్‌స్పూన్లు
* ఎండు మిరపకాయలు - 8
* కరివేపాకు - ఒక రెమ్మ
* పసుపు - టీస్పూన్
* ఉప్పు - రుచికి తగినంత
* చింతపండు గుజ్జు - నాలుగు టేబుల్‌స్పూన్లు
* బెల్లం - పావు టీస్పూన్
* పచ్చిమిర్చి - 4 (సగానికి కట్ చేసుకోవాలి)
తయారీ
ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అన్నం వండుకోవాలి. అన్నం ఉడికాక, ఒక పెద్ద పళ్లెంలోకి తీసుకొని పరచాలి. ఇది చల్లారాక ఒక టేబుల్‌స్పూన్ నువ్వుల నూనె వేసి అన్నాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వుల పొడి తయారు చేసుకోవాలి. దీనికోసం నువ్వులు, రెండు ఎండు మిరపకాయలను ప్యాన్‌పై వేయించుకొని.. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టౌపై మరో ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్స్పూన్ల నువ్వుల నూనెను వేడిచేసి పోపు దినుసులు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త చిటపటలాడాక, చింతపండు గుజ్జు, బెల్లం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నని సెగపై 5-10 నిమిషాల పాటు (చింతపండు గుజ్జు పచ్చి వాసన పోయి చిక్కబడేదాకా) కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి.. ఈ చింతపండు మిశ్రమాన్ని అన్నంలో వేసుకొని బాగా కలుపుకొని, చివరగా నువ్వుల పొడి కూడా వేసి మరోసారి కలుపుకుంటే నోరూరించే నువ్వుల పులిహోర రడీ! ఈ పులిహోర తయారు చేసుకున్న అరగంట తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది.
|
నువ్వుల జొన్న రొట్టెలు

కావాల్సినవి
* జొన్న పిండి - ఒకటింపావు కప్పు
* వేడి నీళ్లు - పిండి కలుపుకోవడానికి సరిపడా
* నువ్వులు - 2-3 టేబుల్‌స్పూన్లు
* ఉప్పు - చిటికెడు
తయారీ
ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో కప్పు జొన్న పిండి, నువ్వులు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆపై వేడి నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ జొన్న పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని కాసేపు నాననివ్వాలి. ఆపై వీటిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పొడి జొన్నపిండిని చపాతీ పీటపై చల్లుకొని జొన్న పిండి ముద్దను చపాతీలా ఒత్తుకోవాలి. ఈ రోటీల్ని చేత్తో లేదంటే చపాతీ కర్రతో చేసుకోవచ్చు. ఇప్పుడు స్టౌ మీద పెనం పెట్టి.. అది కాస్త వేడయ్యాక జొన్న రొట్టెను దానిపై వేసి నీళ్లలో ముంచిన కాటన్ క్లాత్‌తో రొట్టెపై అద్దుతూ ఇరువైపులా కాల్చుకోవాలి. ఇలా ఒక్కో రొట్టెను ఎప్పటికప్పుడు చేస్తూ కాల్చుకోవాలి. తద్వారా ఆ రొట్టెలు గట్టిపడకుండా రుచిగా వస్తాయి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో భోగి రోజున ఎక్కువగా చేసుకునే ఈ రొట్టెల్ని ఏ కూరతో తిన్నా వాటి రుచికి ఫిదా అవ్వాల్సిందే!
|
మొక్కజొన్న గారెలు

కావాల్సినవి
* మొక్కజొన్న గింజలు - ఒకటింపావు కప్పు
* శెనగపప్పు - అరకప్పు (గంట పాటు నీళ్లలో నానబెట్టాలి)
* ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
* పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగినవి)
* అల్లం - చిన్నముక్క
* జీలకర్ర - అరటీస్పూన్
* తరిగిన కొత్తిమీర - కొద్దిగా
* ఉప్పు - రుచికి తగినంత
* నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ
ముందుగా మిక్సీ జార్లో కప్పు మొక్కజొన్న గింజలు, నానబెట్టిన శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం.. వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, మిగిలిన పావు కప్పు మొక్కజొన్న గింజలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అరచేతులకు కాస్త నూనె రాసుకొని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని మునివేళ్లతో గారెల మాదిరిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడిచేసుకొని ఈ గారెల్ని అందులో వేసి బంగారు వర్ణంలో మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు అతిథుల కోసం రడీ అయినట్లే!
|
చెరకు మురుకులు

కావాల్సినవి
* చెరకు రసం - అర కప్పు
* బియ్యప్పిండి - కప్పు
* వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు (కరిగించినది)
* నువ్వులు - టీస్పూన్
* ఉప్పు - టీస్పూన్
* నూనె - డీప్ ఫ్రైకు సరిపడా
తయారీ
ఒక గిన్నెలో బియ్యప్పిండి, వెన్న, నువ్వులు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆపై ఇందులో చెరుకు రసాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ, చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌ పై బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడిచేసుకోవాలి. ఇందాక తయారుచేసుకున్న పిండి మిశ్రమాన్ని మురుకుల ప్రెస్సర్లో కూర్చొకొని నూనెలో ఒత్తుకోవాలి. వీటిని ఇరువైపులా దొర్లిస్తూ బంగారు వర్ణంలోకి మారేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెరకు మురుకులు తినడానికి రడీ అయినట్లే!
|
చిరు ధాన్యాల లడ్డు

కావాల్సినవి
* కొర్రలు - మూడు టేబుల్‌స్పూన్లు
* రాగులు - మూడు టేబుల్‌స్పూన్లు
* సజ్జలు - మూడు టేబుల్‌స్పూన్లు
* అరికలు - మూడు టేబుల్‌స్పూన్లు
* సామలు - మూడు టేబుల్‌స్పూన్లు
* పెసరపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు
* బార్లీ - టేబుల్‌స్పూన్
* తురిమిన బెల్లం - ముప్పావు కప్పు
* యాలకుల పొడి - టేబుల్‌స్పూన్
* నెయ్యి - 6 టేబుల్‌స్పూన్లు
* జీడిపప్పు - 10
తయారీ
ముందుగా స్టౌపై ఒక ప్యాన్ పెట్టి.. అందులో నెయ్యి వేడిచేసి జీడిపప్పును దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్‌లో కొర్రలు, రాగులు, సజ్జలు, అరికలు, సామలు, పెసరపప్పు, బార్లీలను ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయించుకొని చల్లార్చుకోవాలి. ఆపై వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఆపై దీనిలో తురిమిన బెల్లం కూడా వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని.. ఇందులో వేయించిన జీడిపప్పు, కరిగించిన నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అరచేతులకు నెయ్యి రాసుకుంటూ ఈ మిశ్రమాన్ని లడ్డూల మాదిరిగా చేసుకోవాలి. ఇలా తయారైన లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 2-3 వారాల పాటు పాడవకుండా ఉంటాయి.
|
ఎంతో సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఈ సంక్రాంతి స్పెషల్స్‌ని మీరూ ట్రై చేసి మీ ఇంటికొచ్చే అతిథులకు విందు చేయండి.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
|