Photos: Screengrab
సాధారణంగా ఐదేళ్ల వయసున్న పిల్లలు ఎలా ఉంటారు? ఇల్లంతా తిరుగుతూ.. తోటి పిల్లలతో ఆడుకుంటూ.. అల్లరికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. లేకపోతే స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, టీవీ.. ఇవే వారి ప్రపంచం. అంతేగానీ చుట్టూ ఉన్న మనుషులు, ఆపదల్లో ఉన్న వారికి సాయం చేయడం లాంటి పెద్ద విషయాలు ఆ పిల్లలకు ఏ మాత్రం తెలియవు. కానీ ఓ ఐదేళ్ల చిన్నారి మాత్రం కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సంతోషం కోరుకుంది. అందుకోసం అనుకున్నదే తడవుగా వందలాది గ్రీటింగ్ కార్డులను తయారుచేసి నగరంలోని నర్సింగ్ హోంలకు పంపించింది. తద్వారా వారిలో ఆత్మస్థైర్యం, సానుకూల దృక్పథం నింపేందుకు ప్రయత్నించింది. న్యూ ఇయర్ సందర్భంగా ఇలా తన వయసును మించిన మంచి పని చేసి అందరి చేతా శెభాష్ అనిపించుకున్న ఆ చిన్నారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..!

వారిలో సానుకూల దృక్పథం నింపేందుకు!
ఒంటరితనం.. కరోనా వచ్చాకే చాలామందికి దీని అసలైన అర్థమేంటో తెలిసింది. ప్రత్యేకించి కరోనా ప్రభావం అధికంగా ఉన్న అమెరికాలో ఉంటోన్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కరోనా బారిన పడి స్వీయ నిర్బంధంలో కొందరు, ఆస్పత్రుల్లో మరికొందరు ఒంటరిగానే కాలం వెల్లదీస్తున్నారు. ఇక వైరస్‌కు భయపడి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇళ్లు, నర్సింగ్ హోంలకే పరిమితమవుతున్నారు. కనీసం మనసారా కుటుంబ సభ్యులతో మాట్లాడలేని దీనస్థితి వారిది. ఇలా ఒంటరితనంతో సతమతమవుతూ మానసిక ఆందోళన చెందుతున్న కరోనా బాధితుల ముఖాల్లో సంతోషం నింపేందుకు తనదైన ప్రయత్నంతో ముందుకు వచ్చింది ఐదేళ్ల అరణ్య. ఈ క్రమంలో న్యూయార్క్‌లోని వెస్టల్లో ఉంటోన్న ఈ భారతీయ సంతతి చిన్నారి.. న్యూ ఇయర్ సందర్భంగా అందమైన గ్రీటింగ్ కార్డులు తయారుచేసి కరోనా రోగులకు పంపించింది. తద్వారా వారిలో ఒంటరితనాన్ని పోగొట్టే ప్రయత్నం చేసింది.
అందుకే ఈ గ్రీటింగ్ కార్డులు!
ఐదేళ్ల అరణ్య ప్రస్తుతం కిండర్ గార్టన్ చదువుతోంది. వింటర్ వెకేషన్ కావడంతో చాలా రోజుల నుంచి ఇంటి దగ్గరే ఉన్న ఈ చిన్నారి కరోనా రోగుల్లో ఉత్సాహాన్ని నింపాలనుకుంది. అందుకోసం సుమారు 200కు పైగా అందమైన గ్రీటింగ్ కార్డులు తయారుచేసింది. కరోనా బాధితుల్లో సానుకూల దృక్పథం నింపేలా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందమైన బొమ్మలతో ఈ కార్డులను తయారుచేసింది. అనంతరం తన తల్లిదండ్రుల సహాయంతో వాటిని స్థానిక నర్సింగ్ హోంలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు పంచిపెట్టింది. ‘సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోచినంత సాయం చేయాలి’ అని మా టీచర్లు చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఎంతోమంది ఆస్పత్రులు, నర్సింగ్ హోంలలో ఒంటరిగా ఉంటున్నారని నాకు తెలిసింది. ఈ క్రమంలో కనీసం కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడే అవకాశం లేదు వాళ్లకి. అందుకే వారిలో ఒంటరితనాన్ని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ గ్రీటింగ్ కార్డులను ఎంచుకున్నాను’ అని తన ముద్దుముద్దు మాటలతో చెప్పుకొచ్చిందీ సూపర్ కిడ్.

తనని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది!
ఇంత పిన్న వయసులోనే ఎంతో పెద్ద మనసుతో ఆలోచించిన అరణ్యను చూసి తెగ సంబరపడిపోతోంది ఆ చిన్నారి తల్లి షాచి చోప్రా. ‘నా కుమార్తె ఒక రోజు బిజీబిజీగా గ్రీటింగ్ కార్డులు తయారుచేస్తోంది. ఇవన్నీ ఎవరి కోసం అని నేను ఆరా తీశాను. ఆస్పత్రులు, నర్సింగ్ హోంలలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల కోసం వీటిని తయారుచేస్తున్నట్లు అరణ్య చెప్పింది. దీంతో నేను, మావారు సమీపంలోని ఓ నర్సింగ్ హోంను సంప్రదించాం. అందులో 200 మంది రోగులు కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరంగా ఉన్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అరణ్య తాను చిన్నప్పటి నుంచి దాచుకున్న కిడ్డీ బ్యాంక్‌లోని డబ్బులను ఖర్చు పెట్టి 200 అందమైన గ్రీటింగ్ కార్డులు తయారుచేసింది. కార్డుతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపే ఓ కేక్‌ను సైతం వారికి బహుమతి ఇవ్వాలని కోరింది. దీంతో తను కోరుకున్నట్లుగానే నేను, మావారు స్వయంగా నర్సింగ్ హోంకు వెళ్లి వాటిని అందజేశాం. మా అమ్మాయి చేస్తున్నది చిన్న సహాయమే కావచ్చు. కానీ ఈ వయసులోనే తను ఎంతో విశాల హృదయంతో ఆలోచించింది. తనను చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది’ అని తెగ సంతోషపడిపోతోంది షాచి.
త్వరలోనే నర్సింగ్ హోంకు వెళతాను!
ఈ సందర్భంగా త్వరలోనే నర్సింగ్ హోంకు వెళ్లి ప్రత్యక్షంగా అక్కడి కరోనా రోగులతో మాట్లాడతానంటోంది అరణ్య. ‘నేను త్వరలోనే స్థానిక నర్సింగ్ హోంకు వెళతాను. నా గ్రీటింగ్ కార్డులపై అక్కడి రోగుల అభిప్రాయాలు, అనుభవాలను తెలుసుకుంటాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావాలి. ఈ మహమ్మారి ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చిందీ లిటిల్ ఏంజెల్. ఈక్రమంలో అతి పిన్న వయసులో తన వయసుకు మించి ఎంతో మంచి పని చేసిన అరణ్యపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘వాట్ ఏ స్వీట్ గర్ల్’, ‘లిటిల్ ఏంజెల్’, ‘గాడ్ బ్లెస్ యూ’ అంటూ ఆ చిన్నారిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.