తీసుకునే ఆహారం విషయంలో మనమే మన కోరికల్ని కంట్రోల్ చేసుకోలేం. అలాంటిది పిల్లలెలా వింటారు. చలికాలమైనా ఐస్‌క్రీమ్ కావాలని, అనారోగ్యమని తెలిసినా పిజ్జా, బర్గర్లు తింటామని మారాం చేస్తుంటారు. ఇక ఈ క్రమంలో పిల్లల్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాల్లను పిల్లలకు అలవాటు చేయడం తల్లులకు కత్తి మీద సామే! అయితే చిన్నారులకు ఒక్కో ఆహార పదార్థం అలవాటు చేసే క్రమంలోనే హెల్దీ ఆప్షన్స్ ఎంచుకోవాలని, ఈ క్రమంలో మన పూర్వీకులు పాటించిన ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను వారికి అలవర్చాలని చెబుతోంది బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్‌పుత్. ఇలా పిల్లలకు పసి వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే.. పెద్దయ్యాక కూడా వారు అవే అలవాట్లను కొనసాగించే అవకాశం ఉందని, తద్వారా తల్లులకు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి దిగులూ ఉండదని అంటోంది. తానూ తన ఇద్దరు చిన్నారుల విషయంలో ఇవే చిట్కాలు పాటిస్తున్నానంటూ.. పిల్లలకు అందించే ఆహారం గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో బోలెడన్ని విషయాలు పంచుకుందీ లవ్లీ మామ్.
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ముద్దుల భార్యగానే కాకుండా.. తనదైన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది మీరా రాజ్‌పుత్. మరోవైపు ఆరోగ్యం, అందం, ఫిట్నెస్, పిల్లల పెంపకం.. వంటి విషయాల్లో ఈ తరం మహిళలకు పలు చిట్కాల్ని సైతం అందిస్తుంటుంది. అంతేకాదు.. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తన కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను సైతం అందరితో పంచుకుంటూ మురిసిపోతుంటుందీ క్యూట్ బ్యూటీ.
పసితనం నుంచే..!
2015లో షాహిద్‌తో పెళ్లిపీటలెక్కిన మీరా.. 2016లో మిషా అనే పాప, 2018లో జైన్ అనే బాబుకు జన్మనిచ్చింది. ఇక అప్పట్నుంచి తన ఇద్దరు పిల్లల ఆలన పాలనలోనే గడుపుతూ అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోందీ అందాల అమ్మ. అయితే పిల్లల అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్ల గురించి చాలామంది తల్లులు దిగులు పడుతుంటారని, కానీ వారికి పసితనం నుంచే చక్కటి పోషకారాన్ని అలవాటు చేస్తే పెద్దయ్యాక కూడా అవే అలవాట్లను కొనసాగించే అవకాశం ఉందని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది మీరా.
‘ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ సక్రమంగా జరుగుతాయి. అయితే పిల్లలు మాత్రం ఇవేవీ వినిపించుకోరు. అవి ఆరోగ్యానికి మంచివి కావు.. అని చెప్పినా అవే కావాలని పట్టుబడతారు. పెద్దయ్యాక పిల్లలు ఇలా తయారుకాకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే వారికి ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవాటు చేయాలి. ఈ క్రమంలో మన తల్లులు, అమ్మమ్మలు-నాయనమ్మలు తమ పిల్లల విషయంలో పాటించిన చిట్కాలను, ఆరోగ్యకరమైన వంటకాలను మనమూ మన పిల్లలకు అలవాటు చేయించాలి. నేనైతే నా పిల్లలు మిషా, జైన్ విషయంలో ఇదే ఫాలో అవుతున్నా. వారికి ఒక్కో పదార్థం తినిపించడం అలవాటు చేసేటప్పుడే హెల్దీ ఆప్షన్స్ ఎంచుకుంటూ వచ్చా. ఈ క్రమంలో రోజూ ఉసిరి రసం, పసుపు కలిపిన పాలు.. వంటివి ఇవ్వడం మొదలుపెట్టా.
కాలంతో పాటు ఆహారాన్నీ మార్చాలి!
సీజన్ మారుతున్న కొద్దీ మనం ఎలాగైతే మన ఆహారపుటలవాట్లలో మార్పులు-చేర్పులు చేసుకుంటామో.. పిల్లల విషయంలోనూ ఇది పాటించాలి. ఈ క్రమంలో తాజాగా, చక్కటి పోషకాహారంతో కూడిన పదార్థాలు అందిస్తే.. అవి వారిని ఆయా కాలాల్లో ఎదురయ్యే ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. ఇక ఈ చలికాలంలో సాధారణంగానే పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. పైగా ఇది పండగల సీజన్ కూడా! ఇలాంటి సమయాల్లో స్వీట్స్, డెజర్ట్స్.. వంటివి చేసుకోవడం మనకు అలవాటే! అయితే నేను ఈ ప్రత్యేక సందర్భాల్లో పిల్లల ఆహారపు కోరికల్ని తీర్చడానికి హల్వా, హాట్ చాక్లెట్, కేక్.. వంటివి ఇంట్లోనే చేస్తుంటాను. అంతేకాదు.. ఈ క్రమంలో చక్కెరకు బదులు బెల్లం, దాల్చినచెక్క పొడి.. వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటా. అలాగని పిల్లలకు ఆహారం విషయంలో పరిమితులు విధించను. ఒకవేళ వాళ్లు ఐస్‌క్రీమ్ కావాలని అడిగితే తప్పకుండా అందిస్తా. అది కూడా ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే! ఇలా పిల్లలకు అటు ఆరోగ్యకరమైన ఆహారం, ఇటు అప్పుడప్పుడూ వారికి నచ్చిన ఆహారం అందిస్తూ వారి ఆహారపు కోరికల్ని అదుపు చేస్తే వాళ్లు మనం చెప్పిన మాట వింటారు.. ఆరోగ్యంగా ఉంటారు..’ అంటోంది మీరా. అంతేకాదు.. తాను కూడా ఎప్పుడైనా జలుబు, దగ్గు అనిపిస్తే ఆవిరి పట్టడంతో పాటు రోజూ రాత్రి పడుకునే ముందు గ్లాసు పసుపు పాలు తాగడం.. వంటి ఇంటి చిట్కాల్నే పాటిస్తానని చెబుతోందీ క్యూట్ బ్యూటీ.
నిజమే మరి.. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలో తెలియక సతమతమవుతోన్న తల్లులకు, అటు పిల్లల ఆహారపు కోరికల్ని తీర్చుతూనే.. ఇటు వారి ఆరోగ్యానికి ఎలాంటి లోటూ రాకూడదనుకునే తల్లులందరికీ మీరా చెప్పిన ఈ చిట్కాలన్నీ చక్కగా ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. మరి, మీరూ మీ పిల్లలకు అందించే ఆహారం విషయంలో ఇలాగే ప్రత్యేక చిట్కాలు పాటిస్తున్నారా? వారి ఆరోగ్యం విషయంలో ఇంకా ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కింది కామెంట్ బాక్స్ ద్వారా అందరితో పంచుకోండి.. నేటి తల్లుల్లో స్ఫూర్తి నింపండి!