చరణ్ వయసు ఏడు సంవత్సరాలు.. కానీ కొత్తవారితో ఎలా మాట్లాడాలో తెలియదు.. పన్నెండేళ్ల రియాకు తన బట్టలు మడతపెట్టుకోవడం కూడా రాదు.. వీళ్లే కాదు.. చాలామంది పిల్లలకు తమకు సంబంధించిన చిన్న చిన్న పనులు కూడా చేసుకోవడం రాదు. ఇందుకు ఆయా పనులపై వారు శ్రద్ధ చూపకపోవడం ఓ కారణమైతే, చిన్నతనం నుంచే వారికి తమ తల్లిదండ్రులు ఈ పనులన్నీ నేర్పించకపోవడం మరో కారణం. అయితే పదిహేనేళ్ల వయసు వచ్చే లోపే తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని పనులు తప్పకుండా నేర్పించాలంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. ఇంతకీ ఆ పనులు ఏంటో మీరూ తెలుసుకోవాలనుకొంటున్నారా?? అయితే ఇది చదివేయండి మరి..
వంట చేయడం..
పిల్లలకు చిన్నతనం నుంచే వంట నేర్పించడం మంచి పద్ధతే. ఇది తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు మాత్రమే కాదు.. పెద్దయ్యాక కూడా వారికి ఉపయోగపడుతుంది. ఎవరిపై ఆధారపడకుండా వారికి నచ్చిన స్నాక్స్, టిఫిన్స్, సలాడ్స్.. వంటి ఆహార పదార్థాలు సులభంగా తయారుచేసుకోగలుగుతారు. కాబట్టి వంట విషయంలో పిల్లల్ని చిన్నతనం నుంచే ప్రోత్సహించాలి. అలాగే వంట గదిలో ఏ వస్తువులను ఏయే పనులకు ఉపయోగిస్తారు, వాటి వాడకం, గదంతా నీట్‌గా సర్దుకోవడమెలా.. వంటి విషయాలు, చిన్న చిన్న చిట్కాలు కూడా వారికి వివరించాలి. ఫలితంగా వారికి వంట చేయడం సులభతరమవుతుంది. అలాగే పిల్లలకు కూడా ఇంటి పనులపై ఒక అవగాహన ఏర్పడుతుంది.

వారంతట వారే..
రాత్రి పడుకునే ముందు కథలు చెప్పడం, పాటలు పాడితే గానీ కొందరు చిన్నారులు నిద్రకు ఉపక్రమించరు. ఇది పెద్దయ్యే కొద్దీ ఓ అలవాటుగా మారుతుంది. మరి, ఇలాంటివేవీ లేకుండా వారంతట వారే రాత్రుళ్లు త్వరగా నిద్రపోయేలా, ఉదయాన్నే నిద్రలేచేలా వారికి అలవాటు చేయాలి. హోమ్ వర్క్, బుక్స్ సర్దుకోవడం.. వంటి పనులు కూడా త్వరగా ముగించుకునేలా చూడాలి. అలాగే స్నానం చేయడం, స్కూలుకి తయారవడం, వీలుంటే వారి లంచ్ బాక్స్, స్నాక్స్ వారే సర్దుకునేలా ప్రోత్సహించడం.. ఇలా వారికి సంబంధించిన చిన్న చిన్న పనులన్నీ వారే చేసుకునే దిశగా పిల్లలకు దిశానిర్దేశం చేయాలి. అప్పుడే పిల్లలు వారి పనుల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానికి అలవాటు పడతారు.
బట్టలు మడతపెట్టడం..
ఆడపిల్లలు యుక్తవయసుకి వచ్చాక తల్లిదండ్రులు ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పడం ప్రారంభిస్తారు. పిల్లలు ప్రాథమికంగా కొన్ని పనులు నేర్చుకోవడానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. ఈక్రమంలోనే బట్టలు ఉతకడం, ఉతికిన బట్టలు ఆరేయడం, మడత పెట్టడం, వాటిని పొందికగా వార్డ్‌రోబ్‌లో సర్దుకోవడం, గిన్నెలు తోమడం.. వంటి పనులు కూడా వారికి అలవాటు చేయాలి. ఇందుకోసం మీరు ఆ పనులు చేస్తున్నప్పుడు వారి సాయం కోరడం, పిల్లలను కూడా భాగస్వాములను చేయడం.. వంటివి తప్పనిసరి.

షాపింగ్..
సాధారణంగా షాపింగ్ అంటే ఏ పండగో, ప్రత్యేక సందర్భాల్లో చేసే దుస్తుల షాపింగే గుర్తొస్తుంటుంది. అలాంటి సమయాల్లో పిల్లల్ని కూడా తీసుకెళ్తుంటాం. అయితే చిన్నారుల్ని కేవలం దుస్తుల షాపింగ్‌కే కాదు.. ఇంటికి అవసరమైన సరుకులు, నిత్యావసరాలు, కూరగాయలు కొనుక్కురావడం.. వంటి వాటికి కూడా తీసుకెళ్లాలి. ఇలా కొన్ని రోజులు అలవాటు చేసి, ఆ తర్వాత వారినే స్వయంగా సంతకెళ్లి ఇవన్నీ తీసుకురమ్మని ప్రోత్సహించాలి. తద్వారా సరుకులు కొనుగోళ్లు, షాపింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశీలించాల్సిన అంశాలు.. వంటివన్నీ వారికి అవగతమవుతాయి. అంతేకాదు.. భవిష్యత్తులో వారే స్వయంగా షాపుకెళ్లి నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసే సామర్థ్యం వారికి అలవడుతుంది.

ఇవి కూడా..
వీటితో పాటు నలుగురితో వ్యవహరించే తీరు, ఆపదలో ఉన్న వారికి సహాయపడడం, మొక్కలు నాటడం, గార్డెనింగ్.. మొదలైన అంశాలన్నీ పిల్లలు యుక్తవయసుకు చేరుకునేలోగా తల్లిదండ్రులు వారికి నేర్పించాలి. అప్పుడే పిల్లలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంగా వారి పనులు చేసుకోగలుగుతారు. అలాగే మంచి, చెడులను విశ్లేషించే స్థాయికి ఎదుగుతారు. భవిష్యత్తులో వారు సన్మార్గంలో నడవడానికి కూడా ఇవి ఎంతగానో దోహదపడతాయి.