ఈరోజుల్లో కళ్లజోడు లేని పిల్లలను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. పదిమందిలో కచ్చితంగా ఏడుగురైనా కళ్లజోడు పెట్టుకోకుండా ఏ పనీ చేయలేని పరిస్థితి నేటి చిన్నారులది. కొంతమంది పిల్లలకైతే స్కూల్లో చేరక ముందే కళ్లజోడు వచ్చేస్తోంది. మరి, ఈ తరం పిల్లల పరిస్థితే ఇలా ఉంటే.. రాబోయే తరాల సంగతేంటి? ఎప్పటికీ వారు ప్రపంచాన్ని కళ్లజోడుతోనే చూడాలా? అంటే లేదు.. కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తే మనమిచ్చిన కళ్లజోడుతో కాకుండా దేవుడిచ్చిన కళ్లతోనే వారికి ప్రపంచాన్ని పరిచయం చేయచ్చంటున్నారు పిల్లల వైద్యులు. మరి, ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ (వరల్డ్ సైట్ డే) సందర్భంగా అవేంటో ఒకసారి చూద్దాం పదండి.

గర్భంతో ఉన్నప్పుడే..
ప్రెగ్నెన్సీలో తల్లి తినే ఆహారాన్ని బట్టే పుట్టబోయే పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే పుట్టబోయే చిన్నారుల కంటి ఆరోగ్యానికి కాబోయే తల్లులు.. తాము తీసుకునే ఆహారంలో.. 'సి', 'ఇ' విటమిన్లు, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ల్యూటిన్.. వంటివి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే గర్భం ధరించిన మహిళలు తమ నెలవారీ చెకప్స్ కోసం గైనకాలజిస్ట్‌ని సంప్రదించినట్లే.. కంటి వైద్యులను కూడా సంప్రదించి పుట్టబోయే బిడ్డ కంటి ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాల్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఐ సైట్ ఉన్న గర్భిణులు ఇలా చేయడం తప్పనిసరి.

మీతోనే మార్పు!
పిల్లలు అనుకరించేది పెద్దలనే. వారు ఎదిగే క్రమంలో మీరు వారికి మార్గదర్శకత్వం చేయాలి. అలా కాకుండా మీరే టీవీ, మొబైల్‌తో కాలక్షేపం చేస్తే వారు కూడా అలానే చేస్తారు. ఈ ఆధునిక కాలంలో పిల్లల కంటి సమస్యలకు ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లే అతి పెద్ద కారణాలుగా మారుతున్నాయి. అందుకే పిల్లలకు పసి వయసు నుంచే ఈ కింది అలవాట్లను నేర్పించే బాధ్యత తల్లిదండ్రులదే..
* పసికందుగా ఉన్నప్పుడు ఉయ్యాలకు రంగురంగుల బొమ్మలు వేలాడదీయడం మనకు తెలిసిందే. అయితే వాటిని మరీ పిల్లలకు దగ్గరగా కాకుండా పిల్లలకు, బొమ్మలకు మధ్య 8 నుంచి 12 ఇంచుల దూరం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆ చిన్ని కళ్లపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుంది.
* పిల్లలు పాకే వయసు నుంచే బొమ్మలను దూరంగా ఉంచి ఆడించడం వల్ల చేతికి, కంటికి మధ్య చక్కటి సమన్వయం (హ్యాండ్ ఐ కో-ఆర్డినేషన్) కుదురుతుంది.
* పిల్లలు ఎదిగే సమయంలో బిల్డింగ్ బ్లాక్స్ (క్యూబ్ బాక్సులను జత చేసే ఆట), పజిల్స్, డ్రాయింగ్, ఫింగర్ పెయింటింగ్, మట్టితో బొమ్మల తయారీ (క్లే మోడలింగ్).. వంటి ఆటలు వారితో ఆడిస్తే వారికి చక్కటి వినోదం అందడంతో పాటు కంటి చూపు కూడా బాగుంటుందని చెబుతున్నారు నిపుణులు. చిన్ని కళ్లపై ప్రతికూల ప్రభావం చూపే వీడియో గేమ్స్ కన్నా ఇవి బెటర్! ఏమంటారు?

ఇవే వార్నింగ్ బెల్స్!
ఒక్కసారి కళ్లజోడు వచ్చిందంటే దాన్ని వదిలించుకోవడం అంత తేలిక కాదు. అందుకే సమస్య రాక ముందే జాగ్రత్త పడటం మంచిది. ఒకవేళ మీ పిల్లల్లో ఈ కింది లక్షణాలు కనబడితే వారు ఏదో కంటి సమస్యతో బాధపడుతున్నట్లే..! అలాంటప్పుడు తక్షణమే స్పందించి వారిని కంటి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడం మంచిది.
* పుస్తకాలను సాధారణ దూరంలో కాకుండా కంటికి దగ్గరగా పెట్టుకొని చదవడం.
* చదువుతున్నప్పుడు ఏకాగ్రత లోపించి పుస్తకంలోని లైన్లను వేలితో చూపెడుతూ చదవడం.
* ఎన్నిసార్లు చెప్పినా వినకుండా టీవిని మరీ దగ్గరగా కూర్చుని చూడటం.
* తరచూ కనురెప్పలు కొడుతూ, కళ్లు నలపడం.
* తక్కువ వెలుతురుని కూడా తట్టుకోలేకపోవడం, ఇలాంటి సమయంలో కళ్లల్లో నీళ్లు రావడం.
* తరచూ తలనొప్పి వస్తోందని కంప్త్లెంట్ చేయడం.
లెక్క ప్రకారమే!
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆఫ్తమాలజీ (ఏఏవో) ప్రకారం చిన్నారుల కంటి ఆరోగ్యం కోసం రోజూ ఇలా లెక్క ప్రకారం పోషకాల్ని ఆహారం ద్వారా అందించడం ఉత్తమం. తద్వారా కంటి సమస్యలు దరిచేరవు. * విటమిన్ సి - 500 మి.గ్రా. * విటమిన్ ఇ - 400 ఐ.యు. (ఇంటర్నేషనల్ యూనిట్స్) * ల్యూటిన్ - 10 మి.గ్రా. * జియాక్సాంథిన్ - 2 మి.గ్రా. * జింక్ - 80 మి.గ్రా. * కాపర్ - 2 మి.గ్రా.
|
ఈ ఆహారంతో సమస్యలన్నీ దూరం!

సరైన ఆహారం తీసుకుంటే శతాధిక వ్యాధులనైనా దరిచేరకుండా కాపాడుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆఫ్తమాలజీకి చెందిన నిపుణులు.. ఏఆర్ఈడీఎస్ అధ్యయనం (ఏజ్ రిలేటెడ్ ఐ డిసీజ్ స్టడీ) ద్వారా ఈ పది ఆహారాలతో కంటి సమస్యలను చాలా వరకు అరికట్టవచ్చంటున్నారు. * చేపలో కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయిలీ ఫిష్‌లో వీటి శాతం ఎక్కువ. * పల్లీలు, బాదం, జీడిపప్పు, వాల్నట్స్ రోజూ తీసుకుంటే అధిక మోతాదులో విటమిన్ 'ఇ' శరీరానికి అందుతుంది. * ఒమేగా - 3తో పాటు విటమిన్ 'ఇ' గుణాలు ఎక్కువగా కలిగినవి చియా గింజలు, అవిసె గింజలు, జ్యూట్ సీడ్స్. వీటిని ఏ రకంగా తీసుకున్నా మంచిదే. * ఇక విటమిన్ 'సి' కోసం నిమ్మ, నారింజ, ద్రాక్ష.. వంటి పండ్లను తీసుకోవాలి. ప్రస్తుతం ఈ పండ్లు ఏ కాలంలోనైనా లభిస్తున్నాయి కాబట్టి వీటిని తరచూ పిల్లలకు అందించడం మంచిది. * విటమిన్ 'సి'తో పాటు జియాక్సాంథిన్, ల్యూటిన్ లభించేవి ఆకు కూరల్లోనే. అందుకే ఒక కప్పు పాలకూర లేదా తోటకూర రోజూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
 * కంటి చూపుకి అతి ముఖ్యమైనది 'ఎ' విటమిన్. కాంతి రెటీనాకి చేరాలంటే ఈ పోషకం ఎంతో అవసరం. వీటి గుణాలు క్యారట్లలో అధికంగా ఉంటాయి. * కంటి ఆరోగ్యానికి దోహదం చేసే మరో పదార్థం చిలగడ దుంప. దీనిలో కూడా క్యారట్‌లోని గుణాలే ఉంటాయి. అలాగే విటమిన్ 'ఇ' కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది. * దీర్ఘకాలం పాటు ఎలాంటి కంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మాంసం తప్పనిసరిగా తినమంటున్నారు వైద్యులు. అది కూడా మటన్ అయితే మంచిదట. ఎందుకంటే ఇందులో ఎక్కువ శాతం జింక్ ఉంటుంది. వృద్ధాప్యంలో కంటి సమస్యలు రాకుండా ఈ ఖనిజం తోడ్పడుతుంది. * విటమిన్ 'సి', 'ఇ', జింక్, జియాక్సాంథిన్, ల్యూటిన్.. వంటివన్నీ ఏకకాలంలో అందాలంటే గుడ్డు తినాల్సిందే! * సరైన మొత్తంలో నీరు తాగడం వల్ల కూడా ఎలాంటి కంటి సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తద్వారా కళ్లు ఎప్పుడూ తేమగా, ఆరోగ్యంగా ఉంటాయి. * జింక్ కోసం పాలు, గుడ్లు, మటన్, నట్స్, డార్క్ చాక్లెట్.. వంటివి రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. * ఆకుకూరలు, మష్రూమ్స్, నట్స్-సీడ్స్, లివర్, డార్క్ చాక్లెట్.. వంటి వాటి నుంచి కాపర్ అధికంగా లభిస్తుంది. కాబట్టి వీటిని కూడా చిన్నారులకు క్రమం తప్పకుండా అందించాల్సి ఉంటుంది.
|
చిన్నారుల కంటి ఆరోగ్యానికి పాటించాల్సిన చిట్కాలేంటి? ముందు జాగ్రత్తలేంటి? తదితర విషయాల గురించి తెలుసుకున్నారుగా! మరి, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ బుజ్జాయిలను కళ్లజోడుతో కాకుండా దేవుడిచ్చిన కళ్లతోనే నేరుగా చూసేలా వారి కంటిని సంరక్షించండి..