సాధారణంగా పసి పిల్లల్లో నాలుగు నుంచి ఆరు నెలల మధ్య వయసులో పాల దంతాలు వస్తుంటాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇవి వూడిపోయి శాశ్వత దంతాలు వచ్చినప్పటికీ పాల దంతాల విషయంలో శ్రద్ధ వహించడం ముఖ్యం. ఎందుకంటే పాల దంతాలు ఎలా వస్తాయో.. అవి వూడిపోయిన తర్వాత శాశ్వత దంతాలు కూడా అదే స్థానంలో అలాగే రావడానికి అవకాశాలెక్కువ. అందుకే పిల్లలకు దంతాలు రావడం ప్రారంభమయ్యే దగ్గర్నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కొంతమంది పిల్లలు పాల దంతాలు వచ్చే క్రమంలో బొటనవేలు చప్పరించడం, గట్టి వస్తువులను కొరకడం.. వంటివి చేస్తుంటారు. ఫలితంగా దంతాలు.. ఎత్తుగా, వంకరగా, సందులుగా వచ్చే ఆస్కారం ఉంటుంది. దీనివల్ల అందవిహీనంగా కనిపించడంతో పాటు భవిష్యత్తులో దంతాల ఆరోగ్యంపైన కొన్ని దుష్ప్రభావాలు పడే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి మొదట్నుంచే పిల్లల దంతాల పట్ల తగిన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అందుకోసం ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

అదే పనిగా తాగుతున్నారా?
కొంతమంది పిల్లలు బాటిల్‌తో తామే స్వయంగా పాలు తాగడాన్ని ఇష్టపడుతుంటారు. కాసేపటి తర్వాత పొరపాటున బాటిల్ తీసేశామనుకోండి.. ఇక ఏడుపు మొదలుపెడతారు. అయితే ఇలా అదే పనిగా పాలసీసాను నోట్లోనే ఉంచుకోవడం వల్ల నోట్లో దంతక్షయాన్ని కలిగించే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది వారి దంతాల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాగే ఇలా నోట్లో బాటిల్‌ని ఎక్కువసేపు ఉంచడం వల్ల కడుపులో గ్యాస్ ఎక్కువగా చేరుతుంది. కాబట్టి వీలైనంత వరకు వారికి తల్లి పాలు అందించడమే మంచిది. ఒకవేళ డబ్బా పాలు పట్టాల్సి వస్తే మీరే కాసేపు పట్టి ఆ తర్వాత దాన్ని నోట్లోంచి తీసేయండి. అలాగే కొంతమంది పిల్లలు ఏడవకుండా వారి నోట్లో తేనె పీక పెడుతూ ఉంటారు. దీనివల్ల కూడా సమస్యలు రావచ్చు. కాబట్టి ఇలాంటివి ఇవ్వకపోవడం మంచిది.
పాలిచ్చిన తర్వాత..
చాలామంది తల్లులు పిల్లలకు పాలిచ్చిన తర్వాత పెదాలు, చిగుళ్లు శుభ్రంగా తుడవకుండా వాటిని అలాగే వదిలేస్తుంటారు. తద్వారా కొన్ని రోజులకు పెదాలు నల్లబడడం, చిగుళ్ల సమస్యలు.. వంటివి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రభావం పిల్లల దంతాలపై కూడా పడుతుంది. కాబట్టి పిల్లలకు పాలివ్వడం పూర్తయిన ప్రతిసారీ పెదాలను, చిగుళ్లను గోరువెచ్చటి నీటిలో ముంచిన శుభ్రమైన తడిగుడ్డతో నెమ్మదిగా తుడవాలి. తద్వారా చిగుళ్లు శుభ్రపడతాయి. ముందు ముందు వారిలో ఎలాంటి దంత సమస్యలు రాకుండా కూడా ఉంటాయి.
పరీక్షలు తప్పనిసరి..
'ఇప్పుడున్నవి పాల దంతాలే కదా.. ఎలాగూ పెరిగే క్రమంలో అవి వూడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి.. అప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటే సరిపోతుందిలే..' అని నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయం ప్రకారం పిల్లలకు దంత పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. పిల్లలకు ఎప్పుడెప్పుడు పరీక్షలు చేయించాలో తెలుసుకోవడం కోసం పిల్లల వైద్యుని సంప్రదించాలి.

మింగుతున్నారా??
టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయించేటప్పుడు చాలామంది పిల్లలు పేస్ట్‌ని మింగుతుంటారు. వారిలో ఈ అలవాటు మాన్పించాలంటే కాస్త సమయం పడుతుంది. కాబట్టి పిల్లలకు రెండేళ్ల వయసొచ్చే వరకూ వారికోసం ఫ్లోరైడ్ లేని టూత్‌పేస్ట్ ఉపయోగించడం ఉత్తమం. ఆ తర్వాత క్రమంగా వారిలో టూత్‌పేస్ట్ మింగే అలవాటును మాన్పించిన తర్వాత సాధారణ టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు. అయితే ఫ్లోరైడ్ లేని టూత్‌పేస్ట్ వాడడం వల్ల వారి శరీరంలో ఫ్లోరైడ్ స్థాయులు తగ్గి దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే డాక్టర్ సలహా మేరకు పిల్లలకు ఫ్లోరైడ్ సప్లిమెంట్స్ వాడడం మంచిది.

గుర్తుంచుకోండి..
* పిల్లలకు పాల దంతాలు వస్తున్న క్రమంలో గట్టి వస్తువుల్ని చిగుళ్లతో కొరకకుండా జాగ్రత్తపడాలి. వారికి చిగుళ్లు దురదపెట్టి దొరికిన వస్తువునల్లా కొరకడానికి ప్రయత్నిస్తుంటారు. దీన్ని తగ్గించడానికి మార్కెట్లో బేబీ టీతర్లు దొరుకుతున్నాయి. వీటిని చల్లబరిచి ఇవ్వడం వల్ల వారిలో దురద, కొరకాలనే కోరిక తగ్గుతుంది.
* అలాగే చక్కెర, తేనె.. వంటి తీపి పదార్థాల్ని పిల్లలకు ఎక్కువగా పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి పిల్లల చిగుళ్లకు హాని చేసే అవకాశం ఉంటుంది.
* కొంతమంది పిల్లలు బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంటారు. దీనివల్ల దంతాలు ఎత్తుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఈ అలవాటు రాకుండా ఉండేలా ముందు నుంచే జాగ్రత్తపడడం మంచిది.
* పిల్లలు ఆడుకునేటప్పుడు చిగుళ్లకు, దంతాలకు దెబ్బ తగలకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ పొరపాటున దెబ్బ తగిలించుకున్నట్లయితే.. ఇంట్లోనే సొంత వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం ఉత్తమం.
పసి పిల్లలకు పాల దంతాలు వచ్చే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు కదా! మరి మీ పిల్లల విషయంలోనూ ఇవన్నీ పాటించి వారి దంత ఆరోగ్యాన్ని కాపాడండి..