నమస్తే మేడమ్.. మా పాప వయసు 11 సంవత్సరాలు. 6వ తరగతి చదువుతోంది. చదువులో యావరేజ్ స్టూడెంట్! దానికి కారణం తను ఎక్కువగా కష్టపడదు. కొంచెం కఠినమైన ప్రశ్నలు అడిగితే చాలు ఇబ్బంది పడుతుంది. మొదట్లోనే ఆ అంశాన్ని వదిలేస్తుంది. కనీసం దానిని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయదు. మేము ఆమెని మార్కులు, ర్యాంకులు అంటూ ఎప్పుడూ బలవంత పెట్టలేదు. జీవితంలో ముందుకు సాగాలంటే కష్టపడాలన్న విషయం తనకు ఎలా చెప్పాలి. తనను కాంపిటేటివ్గా ఎలా తీర్చిదిద్దాలి. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. మీరు చెబుతున్న సమస్యను రెండు కోణాల నుంచి ఆలోచించాలి. ఒకటి - మీ పాప ప్రాథమిక విద్యను అభ్యసిస్తుంది కాబట్టి ఆమె అవగాహన స్థాయి ఏవిధంగా ఉంది? అన్న కోణం నుంచి ఆలోచించండి. ఒకవేళ తన స్థాయికి మించి చదవాల్సి వస్తుందా? అన్న విషయాన్ని కూడా పరిశీలించండి. అలాంటి పరిస్థితుల్లో తను చదివిన పాఠాన్ని ఎంత వరకు గ్రహిస్తుందన్న విషయంపై మీరు ఒక అవగాహనకు రావాలి.
ఇక తను కఠినమైన ప్రశ్నలు ఎదుర్కోవడంలో ఎందుకు ఇబ్బంది పడుతుంది అన్నది మరో కోణం. తను ఏదైనా నేర్చుకునే విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవడం, మీరు కూడా చదువు విషయంలో ఆమెను పదే పదే విమర్శించడం వంటివి ఎప్పుడైనా జరిగాయా? గుర్తుకు తెచ్చుకోండి. మీరనుకున్నట్టు తను చదువు విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి గల కారణాలు ఏంటనేవి ముందుగా తనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ అమ్మాయిలో భయం, సంకోచం వంటివే ముఖ్య కారణాలైతే ఆమెలో ఆత్మవిశ్వాసం పెంపొందించే ప్రయత్నం చేయండి. దానికోసం ఆమెతో ప్రోత్సాహకరంగా మాట్లాడడం, తను చేస్తున్న చిన్న చిన్న పనులను ప్రశంసించడం.. వంటివి చేయండి. ఏదేమైనా మానసిక నిపుణులను సంప్రదించి ఆమె ప్రజ్ఞా స్థాయి, మానసిక స్థాయుల గురించి తెలుసుకోవడం మంచిది. అప్పుడే మీ పాపను చదువు విషయంలో ఎలా తీర్చిదిద్దాలో మీకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్