'గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ మాయలు చాలయ్యా..!
'మొర వినరా.. ఓ గోపీ కృష్ణ.. ఈ వన్నెలు నీవేలేరా..'
కృష్ణుడంటే అందరికీ ఇష్టమే. అందుకే ఏటా కృష్ణాష్టమి రోజున ఆ గోపాలుణ్ని ప్రార్థించడమే కాకుండా ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు కృష్ణుడి గెటప్ వేసి సంబరపడుతూ ఉంటాం. చిట్టి చిట్టి పాదాలతో వాళ్లు అలా నట్టింట్లో తిరుగుతుంటే సాక్షాత్తూ ఆ కృష్ణ భగవానుడే నడుస్తున్నట్లు భావిస్తాం.. మరి పిల్లల్ని అలా చిట్టి కన్నయ్యలుగా తయారు చేయడమెలాగో చూద్దాం..
* చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి మనం మేకప్ ఉత్పత్తులు ఎక్కువగా ఉపయోగిస్తే వారి చర్మం మీద చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా మేకప్ వేసుకోవాలి. ముందుగా సాధారణ టాల్కం పౌడర్ రాయాలి. తర్వాత చర్మం రంగుకు నప్పే కాంపాక్ట్ పౌడర్ రాయాలి. కృష్ణుడు నీలం రంగులో ఉంటాడు కాబట్టి కళ్లకు నీలం రంగు ఐ షాడో వేయాలి. తర్వాత తిలకంతో నుదుటన నామం దిద్దాలి. ఇక్కడితో ముఖానికి సంబంధించి మేకప్ పూర్త్తెంది.

* అలాగే పంచె కట్టి తర్వాత బయటకు కనిపించే భాగాల్లో కూడా టాల్కం పౌడర్, కాంపాక్ట్ పౌడర్ రాయాలి. అప్పుడు మేకప్ ఉత్పత్తుల వల్ల చర్మం అంతగా ప్రభావితం కాకుండా ఉంటుంది.
* తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టాలి. ఒకవేళ దిద్దులు పెట్టడానికి రంధ్రాలు లేకపోతే ప్రెస్సింగ్వి కూడా పెట్టుకోవచ్చు.
* సంప్రదాయబద్ధంగా పంచె కట్టొచ్చు లేదా ధోతీ మోడల్స్‌లో ఉన్న రడీమేడ్ దుస్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

* పంచె కట్టిన తర్వాత అది జారిపోకుండా వడ్డాణం పెట్టాలి. తర్వాత మెడలో వేయాలనుకున్న ఆభరణాలు, హారాలు.. అన్నీ వేయాలి. అరవంకీలు చేతులకు వూడిపోకుండా తగిలించాలి.
* ఇలా మొత్తం గెటప్ రడీ అయ్యాక చివరిగా కిరీటం పెట్టాలి. కృష్ణుడికి నెమలి పింఛం తప్పనిసరిగా పెట్టాలి కాబట్టి మర్చిపోకుండా కిరీటానికి, జుట్టుకి మధ్య దాన్ని తగిలించాలి.
* చేతిలో పిల్లనగ్రోవి ఉంచాలి. చేతులకు ముత్యాలు లేదా స్టోన్స్‌తో చేసిన ఆభరణాలు, కాళ్లకు పట్టీలు లేదా గజ్జెలు పెడితే సరి.. మీ 'చిన్ని కృష్ణుడు' రడీ..!

బ్లూ షేడ్స్‌లో ఉండే పౌడర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కావాలనుకుంటే వాటిని ఉపయోగించి పిల్లల శరీరానికి నీలం రంగు వేయచ్చు. అయితే వాటిని అప్త్లె చేసే ముందు టాల్కం పౌడర్, కాంపాక్ట్ పౌడర్స్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే ఐ షేడ్స్‌లో వాడే పౌడర్ని కూడా ఉపయోగించవచ్చు. అయితే గెటప్ తీసేసిన తర్వాత పాల మీగడ లేదా కొబ్బరి నూనెతో మేకప్‌ని రిమూవ్ చేసుకోవాలి. అప్పుడే చర్మానికి ఎలాంటి హానీ కలగదు. తర్వాత సబ్బుతో రుద్ది స్నానం చేయిస్తే సరిపోతుంది..
మరి, మీరు కూడా ఇదేవిధంగా మీ పిల్లల్ని కృష్ణుడి గెటప్‌లో అందంగా రడీ చేయండి.. కృష్ణాష్టమిని సంబరాలతో సందడిగా జరుపుకోండి.
కేతా శోభారాణి
వసుంధర కుటుంబం శిక్షకురాలు