శ్రీనిత కూతురు శ్రీజ ఇప్పుడు పది పరీక్షలకు సన్నద్ధమవుతోంది. కరోనా కారణంగా పరీక్షలు ఆలస్యంగా జరుగుతుండడంతో ప్రస్తుతం ప్రిపరేషన్లో నిమగ్నమైంది. అయితే తాను బ్రిలియంట్ స్టూడెంటే అయినా ఈ కరోనా సమయంలో పరీక్షలు ఎలా రాస్తానో అని భయపడుతోంది.
మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు శ్రీకర్. ఓవైపు చదువు, చదువు అంటూ పేరెంట్స్ ఒత్తిడితో తాను సతమతమవుతుంటే.. మరోవైపు ఈ కరోనా సమయంలో తన కొడుకు బయటికి వెళ్లి పరీక్షలెలా రాస్తాడోనన్న భయం శ్రీకర్ వాళ్లమ్మ సంధ్యలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇది శ్రీకర్‌లో ఆందోళనను మరింతగా పెంచుతోంది.
ఇలా బోర్డ్ ఎగ్జామ్స్ అనగానే.. అటు పిల్లల్లో, ఇటు తల్లిదండ్రుల్లో ఏదో తెలియని భయాందోళనలు కలగడం సహజం. దీనికి తోడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కరోనా భయం అలుముకుంది. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అలాగే ఇన్నాళ్లూ వాయిదా పడ్డ వివిధ ప్రవేశ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రోజులు కరుగుతున్న కొద్దీ.. పరీక్షలెలా రాస్తామో అన్న భయం అటు పిల్లల్లో, ఈ కరోనా కాలంలో తమ పిల్లలు సురక్షితంగా పరీక్షలు రాస్తారో, లేదోనన్న ఆందోళన అటు తల్లిదండ్రుల్లో నెలకొంది. అయితే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా ప్రిపేరవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయవంతంగా పరీక్షలు రాయచ్చంటున్నారు పిల్లల మానసిక నిపుణురాలు డాక్టర్ మండాది గౌరీదేవి. ఈ సమయంలో అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి ‘వసుంధర.నెట్’తో ఇలా పంచుకున్నారు.
ఆ భయాలకు కారణాలివే!
పబ్లిక్ పరీక్షలన్నా, వివిధ ప్రవేశ పరీక్షలన్నా పిల్లల్లో ఒక రకమైన భయం ఉండడం సహజమే. బయటి నుంచి ప్రశ్న పత్రం వస్తుందని; అందులో తాము చదివిన ప్రశ్నలు వస్తాయో, లేదోనని; జవాబు పత్రాలను కూడా చాలా పకడ్బందీగా దిద్దుతారు.. కాబట్టి సరిగ్గా రాయకపోతే ఫెయిలవుతామేమోనని; తమకు మంచి ర్యాంకు వస్తుందో, లేదోనని.. ఇలా ఎగ్జామ్స్ గురించి పిల్లల్లో కలిగే భయాలకు కారణాలెన్నో ఉంటాయి. వీటికి ప్రస్తుతం కరోనా భయం కూడా తోడైంది. అనుకోకుండా వచ్చిన ఈ మహమ్మారి కారణంగా నిర్ణీత సమయానికి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడడం, లాక్డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉండడం, తీరిక సమయం ఎక్కువగా దొరకడం, పరీక్ష కోసం ప్రిపేరవడానికి పిల్లలకు ఇంట్లో అనుకూలమైన వాతావరణం లేకపోవడం, మొన్నటిదాకా కచ్చితమైన పరీక్ష తేదీలు తెలియక పిల్లల్లో ఒక రకమైన అలక్ష్యం నెలకొనడం.. ఇలాంటి అడ్డంకుల వల్ల ప్రస్తుతం పిల్లలు తమ పరీక్షలు, ప్రిపరేషన్‌పై సరైన శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.

కరోనా గురించే మాట్లాడద్దు..
తల్లిదండ్రులు కూడా కొవిడ్ భయంతో ఇంట్లో శుభ్రత విషయంలో లీనమై పిల్లలపై శ్రద్ధ తగ్గించి ఉండచ్చు.. అలాగే నిరంతరం పిల్లలు ఇంట్లోనే ఉంటూ చదువుపై దృష్టి పెట్టట్లేదు.. సమయం వృథా చేస్తున్నారంటూ వారిని మాటలతో హింసించే పేరెంట్స్ కూడా ఉంటారు. ఇలా సరిగ్గా చదవకపోతే పరీక్షల్లో ఫెయిలవుతారని తల్లిదండ్రులే వారిని భయపెట్టడం, లేదంటే కొవిడ్ భయంతో తమలో నెలకొన్న భయాల్ని పిల్లలపై రుద్దడం, ఇంట్లో ఎప్పుడూ కొవిడ్ గురించే మాట్లాడుకోవడం, దానికి సంబంధించిన వార్తలే వినడం.. ఇలాంటి వాటి వల్ల అటు పేరెంట్స్‌లో, ఇటు పిల్లల్లో లేనిపోని భయాలు తలెత్తి ఇద్దరి మధ్యా సఖ్యత కూడా లోపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇద్దరూ ఇలాంటి భయాలన్నీ పక్కన పెట్టి ముందుకు సాగడం, తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పనిసరి.
ఆ ‘ధీమా’ కావాలి!

అలాగే వాయిదా పడిన పరీక్షలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లల్లో తమ ప్రిపరేషన్ గురించిన భయం పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులూ వారికి మద్దతుగా నిలవాలి. * పరీక్షలంటే పిల్లలు అలక్ష్యం వహించకుండా, అలాగని మరీ భయపడిపోకుండా శాంతంగా ఉండాలి. ఈ క్రమంలో తమకు బాగా వచ్చిన సమాధానాలను చక్కగా ప్రజెంట్ చేస్తాం అన్న ధీమాను ముందుగా తమ మనసులో నింపుకోవాలి. * సాధారణంగా పబ్లిక్ పరీక్షలకు ప్రిపేరయ్యే పిల్లలకు కొన్ని నెలల ముందే సిలబస్ బోధించడం అంతా పూర్తవుతుంది. అలాగే మిగిలిన సమయంలో పునశ్చరణ కూడా పూర్తి చేసుకొని ఉంటారు. అయితే అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారి వల్ల పరీక్షలు వాయిదా పడడంతో చదివినవి మర్చిపోయానేమో, దాంతో పరీక్షలు సరిగ్గా రాయలేనేమో అన్న ఆందోళనలను మనసులోకి రానివ్వకూడదు. * మరో మూడునాలుగు రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. కాబట్టి ఇప్పుడు సిలబస్ అంతా మరోసారి చదవడం అంటే కుదరదు. అందుకే టీచర్లు ముందుగా చెప్పినట్లు ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు-సమాధానాలు సంక్షిప్తంగా చూసుకోవాలి. ఆయా ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలో ఒక కచ్చితమైన అవగాహన తెచ్చుకుంటే పరీక్ష హాల్లో ఎలాంటి భయం లేకుండా సమాధానాలు రాయగలుగుతారు. * ఎలాగో ఒక్కో పరీక్షకు రెండు రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి అంతకుముందే టీచర్లు చెప్పిన ముఖ్యమైన ప్రశ్నల లిస్టును పునశ్చరణ చేసుకుంటే అందులో నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాసేయచ్చు.
|
ఒత్తిడి తేవద్దు!

* తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించే క్రమంలో ఇంకా చదవాలని వారిపై ఒత్తిడి తేవడం, ఏదైనా ప్రశ్నకు సమాధానం తప్పుగా చెప్తే కోప్పడడం.. వంటివి చేయకుండా, వారికి ఓపిగ్గా చెబుతూ విషయం నేర్పించాలి. అలాకాకుండా మీ ప్రమేయం లేకుండా తమంతట తామే చదువుకుంటామంటే అందుకూ పేరెంట్స్ ప్రోత్సహించాలి. ఈ క్రమంలో వారికేవైనా సందేహాలుంటే నివృత్తి చేస్తే.. వారు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చదువుపై పూర్తి దృష్టి పెట్టగలుగుతారు. * పరీక్షకు సమయం దగ్గర పడుతుందన్న ఉద్దేశంతో ఎకాఎకిన గంటల తరబడి చదవడం కాకుండా.. ఓ గంట సేపు చదివాక ఒక పది నిమిషాలు గ్యాప్ తీసుకోవడం వల్ల కూడా వారిలో ఒత్తిడి తగ్గి.. ఏకాగ్రత పెరుగుతుంది. * పరీక్షకు ముందే ప్రశ్న పత్రం గురించి భయపడడం, రాశాక పాసవుతామో లేదోనన్న ఆందోళన, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలా రాస్తారోనన్న బెంగతో పిల్లలపై ఒత్తిడి తేవడం.. వంటివి చేయడం వల్ల మొదటికే మోసమొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి నెగెటివ్ ఆలోచనలను పిల్లలు తమ మనసులోకి రానీయకుండా.. పరీక్ష బాగా రాయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానన్న ధీమాతో, సానుకూల దృక్పథంతో ఉండాలి. * చాలామంది పిల్లలు ఇప్పటిదాకా సమయం వృథా చేసి.. తీరా పరీక్ష సమయం దగ్గరపడే కొద్దీ ఆందోళన చెందుతుంటారు. అలాంటి అనవసర ఆందోళనను దూరం చేసుకొని ఈ ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది.
 * ఈ విషయంలో తల్లిదండ్రులు కోప్పడినా.. వాళ్లు మన గురించే చెప్పారు కదా.. కాబట్టి ఆ విషయాల గురించి బాధపడొద్దు, నెగెటివ్‌గా తీసుకోవద్దు.. అని తమను తాము సముదాయించుకుంటూ చదువుపై దృష్టి పెట్టాలి. * పరీక్షలకు హాజరయ్యే పిల్లల తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించేలా ఉండాలే కానీ.. వారిని నిరుత్సాహపరిచేలా ఉండకూడదు. ఈ క్రమంలో వారిపై ఒత్తిడి పెట్టకుండా చదివించడంతో పాటు సమయానికి పోషకాహారం అందించాలి. అలాగే వారు సమయానికి నిద్ర పోతున్నారా? లేదంటే ఇతరత్రా కారణాల వల్ల ఒత్తిడికి గురవుతున్నారా? వంటివన్నీ దగ్గర్నుంచి గమనించాలి. ఈ క్రమంలో వారిలో టెన్షన్ తగ్గించడానికి వారికి అనుక్షణం అండగా నిలవాలి. * కొందరు తల్లిదండ్రులు పిల్లలు పరీక్ష రాసి ఇంటికొచ్చాక.. ‘ఎలా రాశావ్?’ అంటూ గుచ్చి గుచ్చి అడుగుతుంటారు. తద్వారా వారిలో ఆందోళన మరింత పెరుగుతుంది. అలాకాకుండా వారు బాగా రాసినా, బాగా రాయలేదన్నా పేరెంట్స్ సానుకూలంగానే స్పందించాలి. అయిపోయిన పరీక్ష గురించి ఆలోచించకుండా తదుపరి పరీక్షపై దృష్టి పెట్టమంటూ వారిని ప్రోత్సహించాలి. * పిల్లల విషయంలో తల్లిదండ్రులిద్దరూ ఒకే ప్రవర్తనతో ఉండాలి. అలాకాకుండా ఒకరు మరీ అతి క్రమశిక్షణ చూపడం, ఒకరేమో లైట్‌గా వదిలేయడం చేయకూడదు. తల్లిదండ్రులిద్దరిలో పిల్లలు ఎవరితో బాగా క్లోజ్‌గా ఉంటారో.. ప్రతి విషయాన్నీ వారితోనే సున్నితంగా, పిల్లలకు అర్థమయ్యేలా చెప్పిస్తే వారు తప్పకుండా వింటారు.
|
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

* పరీక్షలకు హాజరయ్యే పిల్లలు కొవిడ్ గురించి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే జాగ్రత్తగా ఉంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కరోనా మన దరిచేరదన్న విషయం పదే పదే నిపుణులు చెబుతూనే ఉన్నారు. * అందుకే గతంలో మీరు పరీక్షలకు ఎలాగైతే నిర్భయంగా హాజరయ్యే వారో ఇప్పుడూ అలాగే వెళ్లాలి. ఈ క్రమంలో ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్‌నర్, ఎరేజర్.. వంటివన్నీ మీ వెంటే ఓ చిన్న పౌచ్‌లో తీసుకెళ్లాలి. అయితే తిరిగి ఇంటికి రాగానే మీరు శుభ్రంగా స్నానం చేయడంతో పాటు మీ వెంట తీసుకెళ్లిన వస్తువుల్నీ శానిటైజ్ చేసి ఒక దగ్గర అమర్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
 * ఇంట్లో అమ్మానాన్నలు జాగ్రత్తలు చెప్పడం, టీవీల్లో-పేపర్లలో వార్తలు చూడడం.. వంటి వాటి వల్ల కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం, ఇతర విద్యార్థులకు దూరంగా ఉండడం, ఓ శానిటైజర్ మీ వెంటే ఉంచుకోవడం.. వంటివి చేయాలి. * ఎలాగూ పరీక్షా హాల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూనే కూర్చోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో విద్యార్థులు భయపడాల్సిన పనిలేదు. * కొంతమంది విద్యార్థులు పరీక్ష ముగిసిన తర్వాత దాని గురించి తమ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ పరీక్షా కేంద్రం దగ్గరే గడిపేస్తుంటారు. ఈ కొవిడ్ సమయంలో అది అస్సలు మంచిది కాదు.. కాబట్టి ఇలాంటి చర్చలేమీ పెట్టుకోకుండా పరీక్ష రాసేసి, తిన్నగా ఇంటికి చేరుకోవాలి. అలాగే ఇలాంటి అనవసర చర్చల ద్వారా పూర్తయిన పరీక్షలో అనుకోకుండా ఏదైనా తప్పుగా రాశామని తెలిస్తే.. ఆ తర్వాతి పరీక్షపై దృష్టి పెట్టలేరు. * ఇక తదుపరి పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ మొదలుపెట్టడానికి ముందు ఒక గంట పాటు ఎలాంటి ఆలోచనలు లేకుండా, హాయిగా విశ్రాంతి తీసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆపై చదువు మొదలుపెట్టడం వల్ల విషయం చక్కగా బుర్రకెక్కుతుంది. కొవిడ్ ఆలోచనలు కూడా దరిచేరవు. * కరోనా ప్రభావం కొన్ని రోజులో, నెలలో ఉంటుంది.. టీకా వచ్చాక మళ్లీ అంతా మామూలైపోతుంది.. కాబట్టి అప్పటిదాకా దీని బారిన పడకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలన్న సానుకూల దృక్పథంతో ఉంటే ఎవరైనా సరే.. కొవిడ్ భయాన్ని అధిగమించచ్చు.
|