ఇంట్లో మనం ఎక్కువగా సమయం గడిపే ప్రదేశం ఏంటి.. అంటే కిచెన్ అనే సమాధానమొస్తుంది. అవును.. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఆఫీసుకు వెళ్లే వరకు.. అలాగే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం కిచెన్లోనే గడిచిపోతుంటుంది. ఈ క్రమంలో వంట చేయడం, గిన్నెలు కడగడం, కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రం చేసుకోవడం.. వంటివన్నీ రోజూ తప్పకుండా చేయాల్సిన పనులు. ఇలా క్లీన్‌గా ఉంచినప్పుడే వంటగది పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే కిచెన్ ప్లాట్‌ఫామ్, సింక్.. వంటివి శుభ్రం చేయడానికి చాలామంది నానా తంటాలూ పడుతుంటారు. కారణం.. వంట చేసే క్రమంలో ప్లాట్‌ఫామ్‌పై నూనె మరకలు పడి జిడ్డుగా తయారవడం, సింక్‌లో పదార్థాల వ్యర్థాలు ఇరుక్కొని జామ్ కావడం.. వంటి సమస్యలు తలెత్తడమే! మరి, అలా జరగకుండా కిచెన్ సింక్‌ని, ప్లాట్‌ఫామ్‌ని సులభంగా శుభ్రం చేసుకోవాలంటే.. అందుకు బోలెడన్ని గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకొని వాటినీ మన కిచెన్‌లో భాగం చేసుకుందాం రండి..

ఫ్లెక్సిబుల్ ఫాసెట్ స్ప్రేయర్
కిచెన్ సింక్‌లో నిండిన గిన్నెలు శుభ్రం చేశాక సింక్‌ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మనకు అలవాటే. అయితే ఈ క్రమంలో సింక్ గోడలు, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్ని శుభ్రం చేయాలంటే చేత్తో నీటిని పోస్తూ క్లీన్ చేస్తుంటాం. తద్వారా ఆ గోడలకు అంటుకున్న నూనె జిడ్డు, ఇతర పదార్థాల అవశేషాలు అంత సులభంగా వదలవు. అలాకాకుండా ఈ పని మరింత సులభంగా పూర్తవ్వాలంటే మీ సింక్ ట్యాప్‌కి ఓ 'ఫ్లెక్సిబుల్ ఫాసెట్ స్ప్రేయర్'ని అమర్చుకోవాల్సిందే! ఫొటోలో చూపించినట్లుగా పై భాగంలో ట్యాప్‌కి ఫిక్స్ చేసుకునేలా ఉండి, కింది భాగంలో నీళ్లు స్ప్రే మాదిరిగా ఒత్తిడితో బయటికి వచ్చేలా ఉంటుందీ సింక్ యాక్సెసరీ. ఇక, మధ్య భాగంలో ఉండే స్ప్రింగ్ అటాచ్మెంట్ పైప్ దీన్ని ఎటు పడితే అటు సులభంగా వంచడానికి వీలుగా ఉంటుంది. సో.. ట్యాప్ ఆన్ చేసుకొని ఈ స్ప్రేయర్ సహాయంతో సింక్ గోడలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని క్షణాల్లో శుభ్రం చేసుకోవచ్చు. ఇలా కిచెన్ సింక్ క్లీన్ చేసే పనిని మరింత సులభతరం చేసే ఈ స్ప్రేయర్ నాణ్యత, డిజైన్, పొడవును బట్టి దీని ధర రూ. 199 నుంచి రూ. 1,139 వరకు ఉంటుంది.

డ్రెయిన్ బేసిన్ బాస్కెట్
మనం గిన్నెలు కడిగే క్రమంలో లేదంటే ఆకుకూరలు, గింజలు.. వంటివి శుభ్రం చేసేటప్పుడు అందులోని వ్యర్థాలు, చిన్న చిన్న పదార్థాలు సింక్‌లో పడిపోయి నీటితో పాటే పైప్‌లోకి వెళ్లిపోతాయి. రోజూ ఇలా జరగడం వల్ల కొన్ని రోజులకు సింక్ పైప్ వ్యర్థాలతో నిండిపోతుంది. ఇక ఎన్ని నీళ్లు పోసినా ఆ పైప్ బ్లాకేజ్‌ని తొలగించలేం. మరి, ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే సింక్ స్ట్రెయినర్పై ఓ 'డ్రెయిన్ బేసిన్ బాస్కెట్'ను అమర్చితే సరి. ఫొటోలో చూపించినట్లుగా చిన్న చిన్న రంధ్రాలతో కూడిన ఈ బేసిన్‌ను స్ట్రెయినర్పై ఉంచితే.. వ్యర్థాలన్నీ పైప్‌లోకి వెళ్లకుండా ఇది అడ్డుపడుతుంది. సో.. మన పనులన్నీ పూర్తయ్యాక ఆ బేసిన్ని తీసి, అందులో చిక్కుకున్న వ్యర్థాల్ని తొలగించి, మళ్లీ స్ట్రెయినర్పై అమర్చితే సరిపోతుంది. ఇలా సింక్‌ని పరిశుభ్రంగా ఉంచేందుకు తోడ్పడే ఈ బేసిన్ నాణ్యత, డిజైన్‌ను బట్టి దీని ధర రూ. 169 నుంచి రూ. 349 వరకు ఉంది.

డ్రెయిన్ క్లీనింగ్ బ్రష్
సింక్‌లో వ్యర్థాలేవీ పడకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. ఒక్కోసారి పైప్‌లో బ్లాకేజీ ఏర్పడుతుంది. మనం గిన్నెలు కడిగే క్రమంలో వాటి నుంచి వేరైన నూనె సింక్ పైప్‌లోకి వెళ్లిపోతుంది. తద్వారా సింక్ పైప్ గోడలు కొన్ని రోజులకు జిడ్డుగా మారిపోతాయి. ఫలితంగా సింక్‌లో నీళ్లు సరిగ్గా పోకుండా తరచూ జామ్ అవుతూ ఉంటుంది. మరి, అలాంటి బ్లాకేజ్‌ని తొలగించుకోవడానికి 'డ్రెయిన్ క్లీనింగ్ బ్రష్' చక్కటి ఎంపిక. ఫొటోలో చూపించినట్లుగా పైవైపున హ్యాండిల్.. కింది వైపున పొడవాటి సన్నటి పైప్ మాదిరిగా ఉంటుందిది. ఈ పైప్‌కు చుట్టూ గరుకైన బ్రిజిల్స్ ఉంటాయి.. అంతేకాదు.. ఇది ఎటు పడితే అటు సులభంగా వంగేలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది కూడా! ఇప్పుడు దీన్ని సింక్ స్ట్రెయినర్ రంధ్రాల్లో పెట్టి కిందికి, పైకి.. గుండ్రంగా తిప్పుతూ.. ఇలా పైప్ గోడల్ని శుభ్రం చేయచ్చు. ఇలా సింక్ పైప్ క్లీనింగ్ని సులభతరం చేసే ఈ బ్రష్ నాణ్యత, డిజైన్‌ను బట్టి దీని ధర రూ. 185 నుంచి రూ. 349 వరకు ఉంది.

సింక్ ప్లంజర్
గిన్నెలు కడిగే క్రమంలో వ్యర్థాలన్నీ పైప్‌లోకి చేరిపోయి బ్లాకేజ్ ఏర్పడడం సహజమే. అయితే ఒక్కోసారి ఎలాంటి వ్యర్థాలు సింక్ పైప్‌లోకి వెళ్లకపోయినా పైప్ బ్లాక్ అవుతుంటుంది. అందుకు ఆ పైప్‌లో నిండుకున్న గాలే కారణం. మరి, ఆ గాలిని క్లియర్ చేయాలంటే 'సింక్ ప్లంజర్'ని ఉపయోగించాల్సిందే! ఫొటోలో చూపించినట్లుగా పైవైపు హ్యాండిల్.. కింది వైపు స్పైరల్లా ఉండే అమరిక ఉంటుంది. ఇప్పుడు దీన్ని సింక్ స్ట్రెయినర్పై ఉంచి.. గట్టిగా కిందికి వత్తాలి. ఆ ఒత్తిడి వల్ల పైప్‌లోని గాలి లోపలికి వెళ్లిపోయి.. తద్వారా సింక్‌లో నిలిచిన నీళ్లు పైప్‌లోకి వెళ్లిపోతాయి. ఇలా పైప్ బ్లాకేజ్‌ని సులభంగా తొలగించే ఈ ప్లంజర్ ఆకృతి, డిజైన్, నాణ్యతను బట్టి దీని ధర రూ. 71 నుంచి రూ. 549 వరకు ఉంది.

అల్యూమినియం ఫాయిల్ స్టికర్
మనం వంట చేసే క్రమంలో ప్లాట్‌ఫామ్‌పై, స్టౌ వెనక భాగంలో ఉన్న టైల్స్‌పై నూనె మరకలు పడడం, తద్వారా ఆ ప్రదేశంలో జిడ్డుగా మారడం మనకు తెలిసిందే. ఇక, వాటిని క్లీన్ చేయాలంటే ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. అలా జరకుండా ఉండాలంటే అందుకు 'అల్యూమినియం ఫాయిల్ స్టికర్' సరైన మార్గం. ఫొటోలో చూపించినట్లుగా అల్యూమినియం ఫాయిల్ స్టికర్ని ప్లాట్‌ఫామ్, స్టౌ వెనక భాగంలో ఉండే టైల్స్‌కు అతికించేస్తే సరి. ఈ ఫాయిల్ స్టికర్ ఆయిల్ ప్రూఫ్ది కావడం వల్ల దానిపై నూనె పడినా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇది నీటిని కూడా పీల్చుకోదు. కాబట్టి ఈ ఫాయిల్ స్టికర్ అతికించిన తర్వాత కూడా ప్లాట్‌ఫామ్‌ను నీటితో శుభ్రం చేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత దీన్ని తొలగించి, కొత్తది అతికిస్తే సరి. ఇందులోనూ వివిధ ప్యాటర్న్స్, డిజైన్లతో కూడిన స్టికర్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలా కిచెన్ ప్లాట్‌ఫామ్‌ను నీట్‌గా ఉంచి, ఆకర్షణీయంగా కనిపించేలా చేసే ఈ ఫాయిల్ స్టికర్ (2 మీటర్లు) నాణ్యతను బట్టి దీని ధర రూ. 199 నుంచి రూ. 450 వరకు ఉంది.