ఇంట్లో మనం ఎక్కువ సమయం గడిపే కిచెన్‌లో కాస్త శ్రమతో కూడుకున్న పనులు చాలానే ఉంటాయి. వాటిలో గిన్నెలు తోమడం, వాటిని శుభ్రం చేయడం ఒకటి. వంట చేసే క్రమంలో వాటికి అంటుకున్న ఆహార పదార్థాల అవశేషాలను తొలగించాలంటే కాస్త బలం ఉపయోగించాల్సిందే! ఈ శ్రమంతా ఎందుకని కొందరు డిష్ వాషర్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే వీటిని కొనే స్థోమత అందరికీ ఉండకపోవచ్చు.. అందుకే సామాన్యులకు అందుబాటులో ఉండే డిష్ వాషింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని కొలువుదీరాయి. వాటితో గిన్నెలకు అంటుకున్న ఎంతటి కఠినమైన జిడ్డునైనా ఇట్టే వదలగొట్టేయచ్చు. మరి, ఆ గ్యాడ్జెట్లేంటి? వాటితో గిన్నెల్ని సులభంగా ఎలా శుభ్రం చేయచ్చు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

క్లీనింగ్ బ్రష్ స్క్రబ్బర్
సాధారణంగా మనం గిన్నెలు తోమాలంటే ఏం చేస్తాం. ముందుగా క్లీనింగ్ లిక్విడ్‌ని సిద్ధం చేసుకుంటాం. ఆ తర్వాత స్క్రబ్బర్ సహాయంతో ఆ లిక్విడ్‌ని కొద్దికొద్దిగా తీసుకొని గిన్నెలపై అప్త్లె చేసుకుంటూ శుభ్రం చేస్తుంటాం. అయితే ఇకపై ఆ శ్రమ కూడా అక్కర్లేదంటూ మన ముందుకొచ్చేసింది 'క్లీనింగ్ బ్రష్ స్క్రబ్బర్'. ఫొటోలో చూపించినట్లుగా.. ముందు భాగంలో గరుకైన బ్రిజిల్స్ ఉండే బ్రష్ ఉంటుంది. దానికి ఒక ట్యూబ్ లాంటి హ్యాండిల్ జతచేసి ఉంటుంది. ఆ ట్యూబ్ హ్యాండిల్ చివర్లో ఉన్న క్యాప్‌ను ఓపెన్ చేసి అందులో డిష్‌వాష్ లిక్విడ్‌ని నింపాలి. ఇప్పుడు ట్యూబ్‌కు ముందు భాగంలో, బ్రష్‌కి పైభాగంలో ఉన్న బటన్ని నొక్కితే కొద్దికొద్దిగా లిక్విడ్ బ్రష్ బ్రిజిల్స్లోకి వచ్చి చేరుతుంది. దాంతో సులభంగా గిన్నెలు తోమేయచ్చు.. అంతేకాదు.. సమయం కూడా ఆదా అవుతుంది. ఇలా వంటపాత్రలు శుభ్రం చేసే పనిని మరింత ఈజీ చేసేసిన ఈ క్లీనింగ్ బ్రష్ నాణ్యత, డిజైన్‌ను బట్టి ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర రూ. 299 నుంచి రూ. 499 వరకు ఉంది.

పామ్ స్క్రబ్ డిష్ బ్రష్
చాలామందికి పెద్ద పెద్ద స్క్రబ్బర్స్ ఉపయోగించడం అస్సలు ఇష్టముండదు.. పైగా అవి వాడడం వల్ల చేతులు నొప్పులు పుడుతున్నాయంటూ చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. అందుకే అరచేతుల్లో ఇమిడిపోయే స్క్రబ్బర్స్నే ఎంచుకుంటుంటారు. అలాంటి వారికి ఈ 'పామ్ స్క్రబ్ డిష్ బ్రష్' చక్కగా ఉపయోగపడుతుంది. ఫొటోలో చూపించినట్లుగా పైవైపున చిన్న బాటిల్లా ఉండి.. కింది వైపున గరుకైన బ్రిజిల్స్ ఉండే బ్రష్ ఉంటుంది. ముందుగా పైభాగంలో ఉండే క్యాప్‌ను ఓపెన్ చేసి అందులో లిక్విడ్ సోప్‌ను నింపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి దానిపై ఉండే బటన్ని నొక్కడం వల్ల కొద్దికొద్దిగా లిక్విడ్ బ్రిజిల్స్లోకి చేరుతుంది. ఇలా అరచేతుల్లో ఇమిడిపోయే ఈ స్క్రబ్బింగ్ బ్రష్ సహాయంతో గిన్నెలు సులభంగా తోమేయచ్చు. అంతేకాదు.. ఈ బ్రష్‌తో పని పూర్తయ్యాక దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అమర్చుకోవడానికి ఓ చిన్ని స్టాండ్ కూడా ఉంటుంది. భలే బాగుంది కదూ ఈ బ్రష్! స్టాండ్‌తో కలిపి ఈ బ్రష్ నాణ్యతను బట్టి దీని ధర రూ. 159 నుంచి రూ. 449 వరకు ఉంది.

స్పాంజి డిష్‌వాషింగ్ స్క్రబ్బర్
మనం వంట చేసే క్రమంలో గిన్నెలు జిడ్డుగా మారడం, కొన్ని పదార్థాలు ప్యాన్‌కు అంటుకొని ఎంతకీ వదలకపోవడం.. వంటివి కామన్‌గా జరిగేవే. అలాంటప్పుడు ప్రత్యేకంగా స్టీల్ స్క్రబ్బర్‌ని ఉపయోగించడం తెలిసిందే. అయితే మాటిమాటికీ స్క్రబ్బర్‌ని మార్చడం వల్ల సమయం వృథా అవడమే కాదు.. కాసేపటికి విసుగొచ్చేస్తుంటుంది కూడా! అలా జరగకుండా వంట పాత్రలకు అంటుకున్న జిడ్డును సులువుగా వదిలించాలంటే 'స్పాంజి డిష్‌వాషింగ్ స్క్రబ్బర్'ని ఉపయోగిస్తే సరి. ఫొటోలో చూపించినట్లుగా ఒక పొడవాటి, సన్నటి బాటిల్లా ఉండే ఈ స్క్రబ్బర్‌కి రెండువైపులా గరుకైన బ్రిజిల్స్ ఉంటాయి. అలాగే పైవైపున పదునుగా ఉండే అమరికతో పాటు కింది వైపున లిక్విడ్ నింపుకోవడానికి వీలుగా చిన్న రంధ్రం ఉంటుంది. ముందుగా ఇందులో లిక్విడ్ నింపుకొని.. దాన్ని కొద్దికొద్దిగా పాత్రపై వేసుకుంటే తోమితే సరి.. కాస్త కటువుగా ఉన్న మరకలనైతే ముందు భాగంలో ఉండే పదునైన బ్లేడ్ సహాయంతో సులభంగా వదలగొట్టేయచ్చు. పైగా ఈ స్పాంజికి పట్టుకోవడానికి వీలుగా రెండువైపులా కాస్త కర్వీగా ఉంటుంది. తద్వారా ఈజీగా గిన్నెలు తోమేయచ్చు. అంతేకాదు.. కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై ఏదైనా జిడ్డు మరకలైనా ఈ స్పాంజి స్క్రబ్బర్ సహాయంతో ఇట్టే తొలగించుకోవచ్చు. ప్రస్తుతం వీటిలోనూ వివిధ రకాలైన మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి డిజైన్, నాణ్యతను బట్టి ధర రూ. 249 నుంచి రూ. 859 వరకు ఉంది.

క్లీనింగ్ స్క్రబ్బర్ గ్లౌజ్
కొంతమందికి ఎక్కువ సేపు నీళ్లల్లో ఉండడం, సబ్బులోని రసాయనాల కారణంగా చర్మంపై అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారు సాధారణ స్క్రబ్బర్స్ని ఉపయోగించడం కంటే చేతులు పూర్తిగా కవరయ్యేలా ఉండే 'క్లీనింగ్ స్క్రబ్బర్ గ్లౌజ్'లను వాడడం శ్రేయస్కరం. ఫొటోలో చూపించినట్లుగా మోచేతుల వరకు కవరయ్యేలా ఉండే ఈ గ్లౌజులకు ముందు భాగంలో చేతి ఆకృతిలో స్క్రబ్బర్ లేదా గరుకైన బ్రిజిల్స్ ఉంటాయి. గిన్నెలకు లిక్విడ్ సోప్ లేదా సోప్ బార్ అప్త్లె చేసుకొని ఈ గ్లౌజుల సహాయంతో ఈజీగా గిన్నెలు కడిగేయచ్చు. ఇలా పొడవాటి గ్లౌజుల మాదిరిగానే కాకుండా కేవలం వేళ్లు, అరచేతుల వరకు కవరయ్యేలా వివిధ ఆకృతుల్లో రూపొందించిన స్క్రబ్బర్ గ్లౌజులు ప్రస్తుతం మార్కెట్లో కోకొల్లలు. మీకు అనువుగా ఉండే వాటిని ఎంచుకుంటే పని మరింత సులువవుతుంది.. శ్రమ కూడా తగ్గుతుంది.. సమయం ఆదా అవుతుంది. ఒక జత స్క్రబ్బర్ గ్లౌజుల ఆకృతి, నాణ్యతను బట్టి వీటి ధర రూ. 198 నుంచి రూ. 499 వరకు ఉంది.

ఫ్లెక్సిబుల్ క్లీనింగ్ బ్రష్
గిన్నెలు తోమే క్రమంలో లేదంటే కిచెన్ సింక్‌లో ఇతర పదార్థాలను శుభ్రం చేసే క్రమంలో సింక్ ట్యాప్ నుంచి నీటిని పదే పదే ఉపయోగించడం మనకు తెలిసిందే. తద్వారా నీటి మరకలు, అందులోని ఉప్పు ట్యాప్‌పై, సింక్‌లో పేరుకునే అవకాశముంటుంది. దాన్ని వదిలించడమంటే చేతికి కాస్త పని చెప్పాల్సిందే! అందులోనూ ఆ మరకలు అంత సులువుగా తొలగిపోవు. కాబట్టి ఆ పనిని మరింత సులభతరం చేసేందుకు ఇప్పుడు మార్కెట్లో బోలెడన్ని 'ఫ్లెక్సిబుల్ క్లీనింగ్ బ్రష్'లు అందుబాటులో ఉన్నాయి. ఫొటోలో చూపించినట్లుగా గరుకైన బ్రిజిల్స్ ఉండి.. ఎటు పడితే అటు సులభంగా వంగేలా (ఫ్లెక్సిబుల్‌గా) ఉండే ఈ బ్రష్‌తో నీరు-ఉప్పు మరకలు పడిన సింక్, ట్యాప్‌లను ఇట్టే శుభ్రం చేసేయచ్చు. ఈ బ్రష్ వల్ల సగానికి సగం శ్రమ కూడా తగ్గుతుంది. పని పూర్తయ్యాక వీటిని కడిగేసుకొని ఆరబెట్టుకుంటే నీట్‌గా ఉంటాయి. ఈ ఫ్లెక్సిబుల్ బ్రష్ ఆకృతి, నాణ్యతను బట్టి దీని ధర రూ. 99 నుంచి రూ. 229 వరకు ఉంది.