'అబ్బా.. ఈ మురికి బట్టలతో చచ్చిపోతున్నా.. ఉతికి, ఉతికీ చేతులు కందిపోతున్నా, మురికి మాత్రం పోవట్లేదు..' ఇలా అనుకునేవాళ్లు మనలో చాలామందే ఉంటారు కదండీ.. అవును. చాలామందికి మిగతా ఇంటి పనులన్నీ ఒకెత్త్తెతే, బట్టలుతకడం మాత్రం మరో ఎత్తు. దాన్ని వాళ్లంత కష్టంగా భావిస్తారు మరి. కష్టమైన పనిని త్వరగా ముగించేద్దామన్న భావనతో చాలామంది ఎక్కువ డిటర్జెంట్ వాడటం, మరకల్ని పోగొట్టడానికి ఎక్కువ గాఢత ఉండే సబ్బులతో శుభ్రం చేయడం.. వంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. ఇలాంటి పనుల వల్ల దుస్తుల నాణ్యత దెబ్బ తింటుంది. ఇంకా మనం బట్టలుతికేటప్పుడు చాలా పొరపాట్లే చేస్తూ ఉంటాం.. మరి అవేంటో, వాటిని చేయకుండా ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకుందామా?
* చాలామంది బట్టలుతకడానికి ఎంత ఎక్కువ డిటర్జెంట్ వాడితే అవి అంత శుభ్రంగా మారతాయని భావిస్తారు. శుభ్రమవడం సంగతి పక్కన పెడితే.. వీటిని మరీ ఎక్కువగా వాడటం వల్ల వస్త్రాల పోగులు దెబ్బతింటాయి.

* వాషింగ్ మెషీన్లో దుస్తులు వేసేటప్పుడు జేబుల్లో ఏవైనా వస్తువులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అవి విలువైనవి కాకపోయినా సరే, ఉతికేముందు తీసేయడం మంచిది. చిల్లర నాణేల వంటి వాటిని అలాగే వదిలేస్తే అవి మెషీన్ ఆన్ చేశాక దాని గ్లాస్ డోర్లకు రాసుకుపోయి గీతలు పడతాయి.
* కేవలం నాణేలే కాదు జిప్‌లు కూడా వాషింగ్ మెషీన్ పాడయ్యేలా చేస్తాయి. ఎలాగంటారా.. డ్రస్సుల జిప్పులు పూర్తిగా పెట్టకుండా వాషింగ్ మెషీన్లో వేసేస్తే అవి మెషీన్ అంచులకు తగులుతూనో, లేదా గ్లాస్ డోర్‌కి తగులుతూనో ఉంటాయి.
* దుస్తుల మీద మరకలు పడటం చాలా సాధారణమైన విషయం. వాటిని పోగొట్టాలని అదే పనిగా రుద్దితే దుస్తుల మన్నిక దెబ్బతింటుంది. దీనికి పరిష్కారం ఏంటంటే.. మరక పడిన వెంటనే వాటిని తొలగించాలి. అప్పుడు కాస్త తొందరగా పోతాయి. లేకపోతే అవి సులువుగా పోయే మార్గాల్ని అన్వేషించాలి.

* దుస్తులపై మరకలు పోవాలని బ్లీచ్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది. అయితే బ్లీచ్ ఉపయోగించడం వల్ల దుస్తులు త్వరగా పాడవుతాయి. అందుకే మరక పోవడానికి సాధ్యమైనంత వరకూ నిమ్మకాయ, సోడా వంటి సహజ పద్ధతులనే ఉపయోగించాలి.
* రంగుపోయే వస్త్రాల్ని మిగిలినవాటితో కలిపి ఉతక్కూడదు. అలా చేస్తే రంగు మిగిలిన వస్త్రాలకి అంటుకుంటుంది. రంగు పోతుందో లేదోనన్న అనుమానం ఉంటే ముందుగా వస్త్రాన్ని తీసుకొని ఒక చివర కొద్దిగా తడిపి రంగు పోతుందో లేదో చూసుకోవాలి. ఒకవేళ పోతుంటే ఎక్కువసేపు నీటిలో ఉంచకూడదు. వెంటనే ఉతికి ఆరేయాలి.
* వాషింగ్ మెషీన్ కింద ఎత్తుపల్లాలు లేకుండా చూసుకోవాలి. ఎత్తుపల్లాల వల్ల వైబ్రేషన్లు ఎక్కువగా వచ్చి ఫ్లోర్ దెబ్బతింటుంది. కాబట్టి నేల ఎగుడుదిగుడుగా లేకుండా చూసుకోవాలి.
* కొంతమంది వ్యాయామాలు చేసేటప్పుడు వేసుకునే డ్రస్సుల్ని బ్యాగ్‌లో పెట్టి కేవలం ఉతికేటప్పుడు మాత్రమే బయటకి తీస్తారు. అలాచేస్తే వాటికున్న బ్యాక్టీరియా వ్యాపించి దుర్వాసన వస్తుంది. కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే బయటకు తీసి ఎంత వీలైతే అంత తొందరగా ఉతుక్కోవాలి. అప్పుడే బట్టల్లోని క్రిములు త్వరగా చనిపోతాయి.
* వాషింగ్ మెషీన్‌తో పాటు డ్రైయర్‌ని కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి.
మరి ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇటు బట్టలు, అటు వాషింగ్ మెషీన్ రెండూ ఎక్కువకాలం మన్నుతాయి.