'దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం జ్యోతి మహేశ్వర.. దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే..' అంటూ దీపారాధన చేసి సకల దేవతలను పూజించడం మనందరికీ తెలిసిన విధానమే. దీపారాధన ఎంతో శ్రేష్టమైనది. ఇది సకల శుభాలను కలిగిస్తుంది. జీవితంలో వెలుగులు నింపుతుంది. అందుకే ప్రతి ఒక్కరికీ దీపారాధన ఎలా చేయాలో తెలిసి ఉండాలి. మరి, ఈ దీపావళి సందర్భంగా దీపం ప్రాముఖ్యం గురించి, దీపారాధన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
దుర్గుణాలు దూరం..
దీపంలో ఉన్న నూనె మనలో దాగున్న అనేక దుర్గుణాలకి సంకేతం అంటారు పెద్దలు. అందులోని వత్తి మనలోని అజ్ఞానానికి ప్రతీక. ఎప్పుడైతే మనం భక్తి భావనతో మనలోని దీపాన్ని వెలిగిస్తామో.. నెమ్మదిగా మనలోని అజ్ఞానం హరించుకుపోతుంది. ఆ తర్వాత దుర్గుణాలన్నీ మాయమవుతాయి.. అని నిగూఢంగా చెబుతుంది దీపం. అందుకే వెలిగే దీపాన్ని అజ్ఞాన తిమిరాలను తరిమే శక్తికి, కాంతికి సంకేతంగా భావిస్తారు.
ఏ శుభకార్యమైనా, ముఖ్యమైన కార్యక్రమమైనా.. జ్యోతి ప్రజ్వలనతోనే మొదలవుతుంది. దీపపు వెలుగు వ్యక్తిలోని అజ్ఞానాన్ని, నిర్లక్ష్యాన్ని పోగొడుతుంది. దీనివల్ల మనం చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అంతేకాదు ఎలాగైతే దీపం వెలిగిస్తే ఇల్లంతా కాంతివంతమవుతుందో, అలాగే దీపపు వెలుగు సమస్త బాధల నుంచి మనకు విముక్తి కల్పిస్తుందని ఓ నమ్మకం.
వత్తి.. ఎన్నో రకాలు దీపం వెలిగించడంలో వత్తిది ముఖ్యమైన పాత్ర. దీపంలోని వత్తుల్లో చాలా రకాలే ఉన్నాయి. అయితే ప్రధానంగా దూది, తామరపువ్వు కాండం , అరటి కాండంతో చేసిన వత్తులు మాత్రమే ఉపయోగిస్తారు. మనం దేవుడికి ఏ రకమైన వత్తితో దీపారాధన చేస్తున్నాం.. అనే అంశం మీద మనకు అందే ఫలం ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతారు. ఏ పదార్థంతో చేసిన వత్తి ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే.. * సాధారణంగా దీపారాధనకి ఎక్కువమంది ఉపయోగించేవి దూదితో చేసిన వత్తులు. దూదిని పేని ఈ వత్తులను తయారు చేస్తారు. వీటితో దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందంటారు. * తామరపువ్వు కాండంతో చేసే వత్తిని వాడితే.. సిరి సంపదలకు, విద్యా జ్ఞానానికి రూపాలైన దేవతా మూర్తులు లక్ష్మి, సరస్వతుల కటాక్షాలు సిద్ధిస్తాయని పెద్దల నమ్మకం. * జిల్లేడు పూలు ఎండిపోయాక వాటి గింజలతో పాటు ఉండే దూది లాంటి పదార్థంతో కూడా వత్తులు చేసుకోవచ్చు. దీంతో వత్తి వెలిగిస్తే వినాయకుడి ఆశీస్సులతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందట. * పార్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే.. పసుపు వస్త్రంతో చేసిన వత్తులు మంచివి. వివాహ జీవితం సాఫీగా సాగాలని, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించేవాళ్లు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి. దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం ఆప్యాయత, అనురాగాలతో కొనసాగుతుంది అంటారు పెద్దలు. |
నూనె.. ఏది వాడాలి? దీపారాధనకు ఏ నూనె వాడాలన్నది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. అయితే మనం పూజించే దేవత, పొందాల్సిన ఫలాల పైన కూడా ఏ నూనె వాడాలన్న విషయం ఆధారపడి ఉంటుందంటారు విజ్ఞులు. * దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే.. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని ఓ నమ్మకం. అంతే కాదు.. ఆరోగ్యం, ప్రశాంతత, ఆనందం వెల్లివిరుస్తాయట. * నువ్వుల నూనెతో చేసే దీపారాధన వల్ల మనల్ని వేధించే సమస్యలు, చెడు ప్రభావాలు, మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి. అందుకే శని గ్రహ శాంతి కోసం ప్రయత్నించే వాళ్లు నువ్వుల నూనెని ఎక్కువగా ఉపయోగిస్తారు. * కీర్తి, ప్రతిష్టలు పొందాలనుకునే వాళ్లు ఇష్టదైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిది. * ఇంటిలోని చెడు ప్రభావాలు తొలగించడానికి, గృహంలో శాంతిని నెలకొల్పడానికి.. పంచదీప నూనెతో దీపారాధన చేయాలి. ఈ దీపారాధన మనలోని చెడు ఆలోచనల్ని దూరం చేయడమే కాదు.. అనారోగ్యం, పేదరికాలను కూడా దరి చేరనివ్వదని పెద్దలు చెబుతారు. ఈ నూనెను కొబ్బరి లేదా నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి కలగలిపి తయారు చేస్తారు. |
సంఖ్య కూడా ముఖ్యమే.. దీపం వెలిగించడం మాత్రమే ముఖ్యం కాదు.. ఎన్ని వత్తులతో వెలిగిస్తున్నామనే విషయాన్ని కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే వీటి ద్వారానూ మనం పొందే ఫలితం మారుతుందని చెబుతారు పండితులు. * ఒక వత్తితో దీపం వెలిగించిన వారికి విజయం సిద్ధిస్తుంది. * రెండు వత్తుల దీపం ఇంట్లో, కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందించి, శాంతి నెలకొనేలా చేస్తుంది. * సంతాన ప్రాప్తి కలగాలంటే.. మూడు ఒత్తుల దీపంతో దైవాన్ని ఆరాధించాలి. * నాలుగు వత్తులతో చేసే దీపారాధన వల్ల పేదరికం దూరమవుతుంది. * సంపద సిద్ధించాలంటే.. ఐదు వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. * ఆరు వత్తులతో చేసే దీపారాధన వల్ల విజ్ఞానం ప్రాప్తిస్తుంది. |
అయితే ఒక్కమాట.... దీపారాధన ఎలాంటిదైనా సరే.. స్వచ్ఛమైన మనసుతో, సంపూర్ణ భక్తితో దేవుడికి మిమ్మల్ని మీరు అర్పించుకొని చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది.