ఏ వంటకాల్లోనైనా సరే.. ఉప్పు, కారం సరిగ్గా ఉంటేనే దాని రుచి పెరుగుతుంది.. మన జిహ్వకూ రుచిస్తుంది. అయితే కొంతమంది వీటి డోసు పెంచి వాడుతుంటారు. మరికొంతమందైతే వారు తినే ప్రతి పదార్థంలో ఉప్పును మోతాదుకు మించి వాడుతుంటారు. ఇలా తినడం రుచిగానే ఉంటుంది కానీ ఉప్పు మితిమీరితే మాత్రం బీపీ, హైపర్‌టెన్షన్, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు.. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. ఇలా అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ముప్పు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఉప్పును తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను, ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. ఈ క్రమంలోనే ఉప్పు తగ్గించుకునే మార్గాల గురించి తెలియజేస్తూ ట్విట్టర్లో వరుస పోస్టులు పెట్టింది.
ఇలా తగ్గించుకోండి!
కరోనా వచ్చిన దగ్గర్నుంచి దాని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శానిటైజేషన్, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం, విటమిన్లు - అవి నిండిన ఆహార పదార్థాలు.. తదితర విషయాల గురించి వరుస ట్వీట్లు చేస్తూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతోంది FSSAI. ఈ క్రమంలోనే ఆహారంలో భాగంగా ఉప్పును తగ్గించుకునే చిట్కాల గురించి బొమ్మల రూపంలో వరుస ట్వీట్లు చేసిందీ సంస్థ.
* జామ పండు, పచ్చి మామిడి కాయ, మొక్కజొన్న.. వంటి వాటిపై ఉప్పు చల్లుకొని తినడం చాలామందికి అలవాటు. అయితే ఇలాగే తినాలని ఇష్టపడే వారు ఉప్పుకు బదులుగా నిమ్మ పొడి (నిమ్మతొక్కలను ఎండబెట్టి చేసే పొడి), ఆమ్చూర్ పొడి (మామిడి కాయల్ని ఎండబెట్టి చేసే పొడి), వాము, మిరియాల పొడి, ఒరెగానో.. వంటివి ఉపయోగించుకోవచ్చు.. తద్వారా ఉప్పును తగ్గించుకోవచ్చు.
* కూరలు వండుకునేటప్పుడు చాలామంది ముందే కారంతో పాటు ఉప్పు కూడా వేసేస్తుంటారు. కానీ కూర పూర్తిగా ఉడికిన తర్వాత.. దానిపై నుంచి కాస్త ఉప్పు చల్లినా రుచికి సరిగ్గా సరిపోతుందంటోందీ ఆహార భద్రతా సంస్థ.

* నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, రోటీ పచ్చళ్లు, సాస్‌లు.. వంటి వాటిలో ఉప్పు మోతాదుకు మించి ఉంటుంది. ఇలాంటివి అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఇలాంటి పదార్థాలు తీసుకోవడం బాగా తగ్గించాలంటోంది FSSAI.
* కొంతమంది అన్నంలో ఉప్పు వేసుకొని వండుకుంటే, మరికొందరు దోసె పిండి, చపాతీ పిండి కలిపేటప్పుడు.. కూడా ఉప్పు వేస్తుంటారు. తద్వారా కూడా మన శరీరంలో చేరే ఉప్పు స్థాయులు పెరుగుతాయి. కాబట్టి అన్నం, చపాతీ, పూరీ, దోసె.. వంటి వాటిలో ఉప్పు వాడకూడదని, ఇలా వాడడం వల్ల వాటిలోని సహజసిద్ధమైన తియ్యదనం తొలగిపోతుందట!
* పెరుగు, సలాడ్స్, పండ్లు.. వంటి వాటిలో కూడా ఉప్పు చల్లుకొని తినడం కంటే నేరుగా తినడమే మంచిది. తద్వారా వాటిలోని అసలు రుచి జిహ్వకు అందుతుంది.. అలాగే ఉప్పునూ తగ్గించుకున్నవాళ్లమవుతాం.
* ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా ముఖం, పొట్ట, ఇతర శరీర భాగాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అందుకే ఉప్పు మోతాదు క్రమంగా తగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల నాలుకకు రుచించే సామర్థ్యం కూడా పెరుగుతుంది.
* చాలామందికి డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా ఉంచడం అలవాటు.. అలాగే కొంతమంది తినేటప్పుడు ఉప్పు డబ్బాను తమ వెంటే ఉంచుకుంటారు. ఇలా కూడా ఎక్కువ ఉప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానుకోమని సూచిస్తోందీ ఆహార భద్రతా సంస్థ.

రోజుకు ఎంత తీసుకోవాలి?
పదార్థాలు రుచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఇష్టమొచ్చినట్లుగా ఉప్పును ఆహారంలో భాగం చేసుకుంటే రక్తపోటు, గుండె సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, హైపర్‌టెన్షన్.. వంటి అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇది మరింత ప్రమాదకరం. కాబట్టి ఉప్పును మోతాదుకు మించి తీసుకోకూడదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పెద్ద వాళ్లు రోజుకు టీస్పూన్, చిన్న పిల్లలు సుమారు పావు టీస్పూన్ ఉప్పు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.
సో.. ఇదండీ ఉప్పు తగ్గించుకునే మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాలు. కాబట్టి వీటిని పాటిస్తూ మన ఆహారంలో ఉప్పు తగ్గించుకుందాం.. దీర్ఘకాలిక సమస్యలు రాకుండా జాగ్రత్తపడదాం.. మన ఇమ్యూనిటీని కాపాడుకుందాం.. అలాగే ఇప్పటికే మీకు బీపీ, గుండె సంబంధిత సమస్యలు, హైపర్‌టెన్షన్.. వంటి అనారోగ్యాలున్నట్లయితే రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలో వైద్యులను అడిగి తెలుసుకోండి. వారు మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఎంత మోతాదులో తీసుకోవచ్చో సూచిస్తారు.