పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి..
అందమైన పూల అలంకరణ మధ్య ఉంచి..
ఆటపాటలతో అమ్మని పూజించడం దగ్గర్నుంచి తిరిగి సాగనంపడం వరకు ప్రతి ఘట్టాన్నీ ఓ వేడుకలా జరుపుకొనే పండగే- బతుకమ్మ. అందమైన ప్రకృతికి అద్దంపట్టే ఈ పండుగలో గౌరీదేవిని చూడచక్కని బతుకమ్మలుగా అలంకరించడం తెలిసిందే. బతుకమ్మలే కాదు.. వాటిని తయారుచేసే పద్ధతి కూడా అందంగానే ఉంటుంది.

అందమైన బతుకమ్మని తయారుచేసుకోవడానికి కావాల్సిన తంగేడు, గునుగు, గోరింట, పోకబంతి.. మొదలైన విభిన్న రకాల పూలు, గుమ్మడి లేదా సొరకాయ వంటి పెద్ద ఆకులు తెచ్చుకోవాలి. ఒక పళ్లెంలో ముందుగా గుమ్మడి ఆకుని పరిచి దాని మీద గునుగు పూలను ఒక క్రమపద్ధతిలో గుండ్రంగా అమర్చుకోవాలి.

తర్వాత గునుగు పూల మీద తంగేడు పూలు అమర్చుకుని వాటి మీద గులాబీరంగులో అద్ది ఆరబెట్టుకున్న ముత్యాల పువ్వుల్ని పేర్చాలి.

రెండు విభిన్నమైన రంగుల్లో లభ్యమయ్యే బంతిపూలల్లో ఒక రంగు పూలను ముత్యాల పూల వరుస మీద అందంగా అమర్చుకోవాలి.

బంతి పూల మీద నీలం రంగులో ముంచిన ముత్యాల పూలను మళ్లీ పేర్చాలి.

ఇప్పుడు ఇంతకుముందు పేర్చుకున్న రంగు బంతులు కాకుండా వేరే రంగు బంతిపూలను పెట్టుకోవాలి.

వాటి మీద అందమైన గులాబీలను పొందికగా సర్దుకోవాలి.

ఇలా తయారుచేసుకున్న బతుకమ్మ మధ్యలో ఉన్న ప్రదేశంలో గౌరీదేవిని పెట్టి పైన పూలు లేదా బంగారు లేస్తో అందంగా అలంకరించుకోవచ్చు.

తల్లి బతుకమ్మకు తోడు పిల్ల బతుకమ్మని కూడా చూడచక్కగా సిద్ధం చేసుకుని బతుకమ్మ సంబరాలని ఆనందంగా మొదలుపెట్టడమే తరువాయి..! ఆటకు తీసుకెళ్లే ముందు బతుకమ్మ మీద పత్తివత్తి వేసి, అగరబత్తీలు గుచ్చి తీసుకెళ్లాలన్నది చాలామందికి తెలిసిన విషయమే.
పూలతో బతుకమ్మని అలంకరించుకునే క్రమంలో తంగేడు, గునుగు, ముత్యాల పువ్వులతో పాటు మనకు అందుబాటులో ఉన్న పూలను కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే గునుగు, ముత్యాల పూలను వివిధ రకాల రంగుల్లో ముంచి ఆరబెట్టి కూడా బతుకమ్మ అలంకరణకు వినియోగించవచ్చు. పూలతో బతుకమ్మని పేర్చే క్రమంలో కింది భాగంలో వెడల్పుగా ఉంటూ పైభాగానికి వచ్చేసరికి గోపురంలా కనిపించేలా చూసుకోవాలి. వాటి మధ్యభాగంలో మిగతా పూలరెక్కలు, ఆకులు ఉపయోగిస్తూ నింపడం వల్ల చుట్టూ అమర్చిన పూలు అటూఇటూ కదలకుండా ఉంటాయి.