మొన్నటిదాకానేమో బయటికి వెళ్తే కరోనా సోకే ప్రమాదముంది.. ఇంట్లోనే ఉండమన్నారు.. ఆపై ఈ వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందన్న వార్తలూ వచ్చాయి. ఇక ఇప్పుడేమో ఇంట్లోనూ వైరస్ ముప్పు పొంచి ఉండచ్చని చెబుతోంది వ్యాధి నియంత్రణ నివారణ మండలి (సీడీసీ). ఒకరకంగా ఇది అందరికీ మింగుడు పడని విషయమే! ఎందుకంటే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఇల్లే మనకు సురక్షిత ప్రాంతం అనుకున్నాం.. కానీ ఇంట్లో కూడా గాలి పరిశుభ్రంగా లేకపోతే వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటోంది సీడీసీ. ఇందుకు సరైన వెంటిలేషన్ లేకపోవడమే ప్రధాన కారణమట! మరి, మనం బయటికి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే మన ప్రయత్నమంతా వృథా అయిపోతుంది. కాబట్టి ఇంట్లో గాలిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాల్సిందే! అందుకోసమే విభిన్న రకాల ఎయిర్ ప్యూరిఫయింగ్ గ్యాడ్జెట్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి తెచ్చుకొని ఇంట్లో అమర్చుకుంటే సరి!
సరైన గాలి, వెలుతురు లేకపోయినా.. గాలిలో తేమ శాతం పెరిగినా మనకు చిరాగ్గా అనిపిస్తుంటుంది.. కానీ వైరస్‌కు ఇది అత్యంత అనుకూలమైన వాతావరణం అంటున్నారు నిపుణులు. అందుకే ఇంట్లోని గాలిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవడానికి ఎయిర్ ప్యూరిఫయర్స్ ఉత్తమమైన మార్గమని చెబుతున్నారు. అలాగని వీటికి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అందుబాటు ధరల్లో దొరుకుతూ, తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ, చూడ్డానికి ఇంటి అలంకరణ వస్తువుల్లా కనిపిస్తాయివి. అలాంటి కొన్ని ఎయిర్ ప్యూరిఫయింగ్ గ్యాడ్జెట్సే ఇవి!
సాల్ట్ ల్యాంప్ బకెట్
ఈ రోజుల్లో కరోనా లక్షణాలు లేకుండానే చాలామందిలో బయటపడుతోంది. అలాంటప్పుడు ఇంట్లో ఈ వైరస్ ఎవరికి సోకిందో కూడా చెప్పలేని పరిస్థితి! ఒకవేళ వారు తుమ్మినా, దగ్గినా నోటి తుంపర్ల ద్వారా వైరస్ ఇంట్లోని గాల్లోకి ప్రవేశిస్తుంది. అదే గాలిని మనం పీల్చడం వల్ల మనకూ వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది.. కాబట్టి ఆ సమస్య లేకుండా ఉండాలంటే ఇంట్లో ఓ ‘సాల్ట్ ల్యాంప్ బకెట్’ను అమర్చుకుంటే సరి.

పేరుకు తగినట్లుగానే ఇది చూడ్డానికి అచ్చం ఓ చిన్న బకెట్లా ఉంటుంది. అందులో హిమాలయన్ సాల్ట్ ముక్కలు నింపుతారు. దీన్ని ఒక టేబుల్ లేదా మనం పని చేసుకుంటోన్న గదిలో పెట్టి.. దీనికి అనుసంధానమై ఉన్న కేబుల్‌ను సాకెట్‌కి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే సరి! ఈ ఉప్పు వాతావరణంలోని తుంపర్లను పీల్చుకొని ఎప్పటికప్పుడు గాలిని శుద్ధి చేస్తుంది. అలాగే గాల్లోని అధిక తేమను తనలో లాక్ చేసుకుంటుంది. ఇంట్లోని దుర్వాసనలు, దుమ్ము-ధూళి వంటి వాటిని కూడా ఆకర్షించి పరిశుభ్రమైన గాలిని, వాతావరణాన్ని మనకు అందించడంలో ఈ ల్యాంప్ మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులోనూ విభిన్న డిజైనర్ ల్యాంప్స్ ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరాయి. వాటి ఆకృతి, నాణ్యతను బట్టి ధర రూ. 595 నుంచి రూ. 1,499 వరకు ఉంటుంది.
చార్కోల్ ఎయిర్ ప్యూరిఫయర్
బొగ్గు కూడా గాలిని శుద్ధి చేసే యంత్రంలా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని దుర్వాసనలు, విష వాయువుల్ని ఆకర్షించి స్వచ్ఛమైన గాలిని అందించడం దీని ప్రత్యేకత. అంతేకాదు.. ఈ కరోనా సమయంలో బయటి నుంచి వచ్చిన తర్వాత మన చెప్పులు, కొన్ని వస్తువులు పదే పదే శుభ్రం చేయడం కుదరకపోవచ్చు. అలాంటి సమయంలోనూ ఈ చార్కోల్ ఎయిర్ ప్యూరిఫయర్స్ ఉపయోగపడతాయి.

ఫొటోలో చూపించినట్లుగా చిన్న చిన్న జ్యూట్ పౌచ్ల్లా ఉండే వీటిలో బరకగా ఉన్న చార్కోల్ను నింపుతారు. దీనికి పైభాగంలో గోడకు తగిలించుకునేలా చిన్న రంధ్రం కూడా ఉంటుంది. దాని సహాయంతో ప్రతి గదిలోని గోడలపై అక్కడక్కడా వీటిని తగిలిస్తే ఇంట్లోని గాలి శుద్ధవుతుంది. అలాగే మనం బయటి నుంచి తెచ్చిన కొన్ని వస్తువుల్ని శానిటైజ్ చేయడం వీలుకాకపోతే ఈ చార్కోల్ పౌచుల్ని వాటిపై ఉంచినా.. దానికి అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా, వైరస్.. వంటి వాటిని ఇది లాగేసుకుంటుంది. ఇలా అటు ఇంట్లోని గాలిని శుద్ధి చేయడంతో పాటు ఇటు వస్తువుల్నీ శానిటైజ్ చేయడానికి ఈ చార్కోల్ ఎయిర్ ప్యూరిఫయర్స్ని ఉపయోగించచ్చు. వీటి ఆకృతి, నాణ్యతను బట్టి రెండు ప్యాకెట్స్ ధర రూ. 272 నుంచి రూ. 629 వరకు ఉంటుంది.
అరోమా డిఫ్యూజర్ హ్యుమిడిఫయర్
‘అటు ఇంట్లోని గాలి శుద్ధి కావాలి.. ఇటు చక్కటి సువాసనలు కూడా వెదజల్లాలి.. మాకు అలాంటి ఎయిర్ ప్యూరిఫయర్ కావాలి..’ అంటారా? అయితే ‘అరోమా డిఫ్యూజర్ హ్యుమిడిఫయర్’ అందుకు చక్కటి ఎంపిక.

ఫొటోలో చూపించినట్లుగా బంతి లాంటి ఆకృతిలో ఉండే దీనిలో రెండు భాగాలుంటాయి. ముందుగా కింది భాగంలో నీళ్లు నింపి.. అందులో కొన్ని చుక్కల అత్యవసర నూనె వేసి పై భాగాన్ని బిగించాలి. ఇప్పుడు దీన్ని కేబుల్ సహాయంతో ప్లగ్‌కి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. ఆపై ఈ గ్యాడ్జెట్‌కు ముందు భాగంలో ఉన్న బటన్ని నొక్కడం వల్ల గాల్లోని క్రిములు, బ్యాక్టీరియా, అధికంగా ఉండే తేమ, ఇతర విష వాయువులేమైనా ఉంటే అది ఆకర్షించుకుంటుంది. అదే సమయంలో పరిమళాలు కూడా వెదజల్లుతుంది. ఇలా రెండు రకాలుగా ఉపయోగపడే ఈ పరికరంలోనూ ప్రస్తుతం విభిన్న డిజైన్లు, మోడల్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటి నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 498 నుంచి రూ. 2,899 వరకు ఉంది.
ఎయిర్ ప్యూరిఫయర్ ఫ్రెష్నర్
పేరుకు తగ్గట్లే గాల్లో అత్యధికంగా ఉండే తేమ శాతాన్ని తగ్గించి.. గాలిని శుద్ధి చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది ‘ఎయిర్ ప్యూరిఫయర్ ఫ్రెష్నర్’.

ఫొటోలో చూపించినట్లుగా గుండ్రంగా, బంతి ఆకృతిలో ఉండే దీనిలో రెండు భాగాలుంటాయి. కింది భాగంలో నీళ్లు నింపి, ఏదైనా అత్యవసర నూనె వేసి పై భాగాన్ని బిగించేయాలి. ఆపై కేబుల్‌ని ప్లగ్‌కి అనుసంధానించి స్విచ్ ఆన్ చేయాలి. ఇప్పుడు దీనికి ముందు భాగంలో ఉండే ఒక బటన్ని నొక్కితే పై భాగంలో ఉండే రంధ్రాల్లో నుంచి అరోమా బయటికి వస్తుంది.. అదే సమయంలో గాల్లోని తేమ, దుమ్ము-ధూళి, ఇతర బ్యాక్టీరియాలను కూడా ఇది ఆకర్షిస్తుంది. ఇక దీనికి వెనక భాగంలో ఓ మినీ ఫ్యాన్‌ను కూడా అమర్చుకోవచ్చు. ఇది కూడా ఈ గ్యాడ్జెట్‌తో పాటే అందిస్తున్నారు డిజైనర్లు. ఒక గదిలో పని చేసుకునేటప్పుడు ఆ టేబుల్‌పై ఈ ప్యూరిఫయర్ ఏర్పాటు చేసుకుంటే అటు గాలిని శుద్ధి చేసే యంత్రంలా, ఇటు మినీ ఫ్యాన్‌లా రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు.. పైగా ఇది చూడ్డానికి డెకరేటివ్ పీస్‌లా కూడా కనిపిస్తుంది. దీని ఆకృతి, నాణ్యతను బట్టి ధర రూ. 899 నుంచి రూ. 1,699 వరకు ఉంటుంది.
ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫయర్
ఇంట్లోని గాలిని శుద్ధి చేసుకోవడానికి చాలామంది ఇండోర్ ప్లాంట్స్ అమర్చుకుంటుంటారు. ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫయర్ కూడా అలాంటిదే! అయితే ఇంట్లోని పొగ, కంటికి కనిపించని దుమ్ముని కూడా ఆకర్షించే శక్తి దీని సొంతం.

చూడ్డానికి కుండీలో ఉన్న మొక్కలాగా ఆకర్షణీయంగా కనిపిస్తోన్న ఈ ప్యూరిఫయర్‌కు వెనక భాగంలో కేబుల్ అనుసంధానించే అమరిక ఉంటుంది. దాంతో ప్లగ్‌కి కనెక్ట్ చేసుకొని స్విచ్ ఆన్ చేస్తే ముందు భాగంలో లైట్ వెలుగుతుంది. అదే విధంగా దీన్నుంచి నెగెటివ్ అయాన్స్ వెలువడతాయి. ఇవి ఇంట్లో కమ్ముకున్న పొగ, కంటికి కనిపించని దుమ్ము కణాలు, అలర్జీ కారకాలు, బ్యాక్టీరియా.. మొదలైన వాటన్నిటినీ ఆకర్షిస్తాయి. తద్వారా గాలి శుద్ధవుతుంది. దీన్ని మీరు ఏ గదిలో కావాలంటే ఆ గదిలో అమర్చుకొని సులభంగా ఉపయోగించుకోవచ్చు. దీని ఆకృతి, నాణ్యతను బట్టి ధర రూ. 1,390 నుంచి రూ. 2,799 వరకు ఉంటుంది.
ఇలాంటి గ్యాడ్జెట్స్‌ని ఇంట్లో అమర్చుకోవడంతో పాటు ఇంటి గదుల్లో గాలి బాగా ప్రసరించేలా కిటికీలు, తలుపులు ఎక్కువ సమయం పాటు తీసే ఉంచడం వల్ల ఇంట్లో వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.. అలాగే పదే పదే తాకే ప్రదేశాల్ని, బయటి నుంచి ఇంటికి తెచ్చిన వస్తువుల్ని సైతం ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం వల్ల ఇంట్లో వైరస్ బెడద లేకుండా జాగ్రత్తపడచ్చు.. తద్వారా కరోనా బారిన పడకుండా ఉండచ్చు.
Photos: Amazon.in