టైం అయిపోతోందనే కంగారు వల్లో లేక మతిమరుపు వల్లో కొందరు కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తూ ఉంటారు. ఎప్పుడో ఎవరో అతిథులు వచ్చినప్పుడే కాదు.. సాధారణ రోజుల్లో కూడా సమయంతో రన్నింగ్ రేస్ చేసే తొందరలోనూ ఇలా ఒక్కోసారి జరుగుతుంటుంది. కూరలో ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. కానీ ఎక్కువైన ఉప్పుని తగ్గించడం ఎలాగో మీకు తెలుసా? అదెలాగో మీకు మేం చెప్తాం రండి..
వంట చేసేటప్పుడు అప్పుడప్పుడూ అనుకోకుండానే కూరలో ఉప్పు ఎక్కువగా వేసేస్తూ ఉంటాం. అయితే అలా ఎక్కువైన ఉప్పుని వెనక్కి తీయలేకపోయినా దాని వల్ల కూర రుచి చెడిపోకుండా మాత్రం జాగ్రత్త పడచ్చు.
* కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు దానికి కొద్దిగా కొబ్బరిపాలు జత చేయాలి. ఇలా చేయడం వల్ల కూరలో ఉప్పదనం తగ్గి రుచిగా ఉంటుంది.
* ఒక బంగాళదుంప తీసుకుని ఒవెన్‌లో 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. తర్వాత తొక్క తీసేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. 4 నుంచి 5 నిమిషాల పాటు వాటిని అందులో ఉంచడం వల్ల ఎక్కువైన ఉప్పుని ఇవి గ్రహించేస్తాయి.

* ఒకవేళ ఒవెన్ లేకపోతే పచ్చిబంగాళదుంపనే తొక్క చెక్కేసి, నాలుగు ముక్కలుగా కోసి కూరలో వేయాలి. వీటిని దాదాపు 10 నిమిషాల పాటు అందులో ఉడకనిస్తే సరి. అయితే వడ్డించే ముందు మాత్రం వీటిని కూరలోంచి బయటకు తీసేయడం మరచిపోవద్దు సుమా!
* 2 లేదా 3 చెంచాల పెరుగు కూరలో కలపడం వల్ల ఉప్పు తగ్గడమే కాదు.. రుచి కూడా పెరుగుతుంది.
* పెరుగు వేయడం ఇష్టం లేనివారు దానికి బదులుగా కొద్దిగా మీగడని కూడా ఉపయోగించవచ్చు.
* మీరు వండుతున్న కూరలో ఉల్లిపాయ, టమాటా ముద్ద ఉంటే కనుక మరికొంచెం ముద్ద తయారుచేసి కూరకు జత చేయచ్చు. ఇలా చేయడం వల్ల కూరలో ఉన్న ఉప్పు తగ్గడమే కాకుండా రుచికరంగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది.

* ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నూనెలో వేయించి కూరకు జత చేసుకుంటే రుచికి రుచి, ఉప్పదనం కూడా తగ్గుతుంది.
* గోధుమ పిండికి కొద్దిగా నీటిని జత చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని కూరలో వేసి 3 నుంచి 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవి కూరలో ఎక్కువగా ఉప్పుని గ్రహించేస్తాయి. తర్వాత వీటిని బయటకు తీసేయచ్చు.
* మీరు చేసే వంటకాన్ని బట్టి టమాటా ముక్కలు లేదా టమాటా పేస్ట్‌ని కూడా జత చేయచ్చు.
* ఒకవేళ కూరలో తక్కువ నీళ్లు ఉంటే కనుక మరికొద్దిగా నీరు వేసి కూరని బాగా ఉడికించాలి.
* కూరలో ఉప్పు తగ్గడంతో పాటు రుచికరంగా కూడా మారాలనుకుంటే మాత్రం అందులో పాలు పోస్తే సరి.
ఇవి కొన్ని చిట్కాలు మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరూ గుర్తుంచుకుని, సందర్భం ఎదురైనప్పుడు ఉపయోగించడానికి ప్రయత్నించండి.