గిరిజ 26ఏళ్ల గృహిణి. పొద్దున్న లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఇంటి పనులతో తెగ సతమతమైపోయేది. ఆ పనుల ఒత్తిడి తట్టుకోలేక పనిమనిషిని పెట్టుకుంది. ఇంటి పట్టునే ఉండే గృహిణి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంగతి వేరే చెప్పాలా? కానీ.. ఇంటి పనులతో కూడా ఫిట్నెస్ సాధ్యమే.. గిన్నెలు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం.. ఇంటిని క్లీన్ చేసుకోవడం.. ఇలా మనం చేసే ప్రతి పనితోనూ ఫిట్‌గా అవడానికి వీలుంటుంది. ఇది కేవలం ఆడవాళ్లకే కాదు... మగాళ్లకూ వర్తిస్తుంది.. ఈ క్రమంలో బద్ధకాన్ని దూరం పెట్టి, పనులన్నీ చకచకా చేసుకుని ఫిట్‌గా తయారు కావడమెలాగో ఓసారి చూద్దాం..
బరువు అనుకోవద్దు..
ఏ పనైనా సరే- భారంగా ఫీలయితే అసలు చేయాలనిపించదు. అందుకే రోజువారీ పనులు కాకుండా అదనంగా పనులేవైనా చేయాల్సి వచ్చినప్పుడు వాటిని బరువుగా అనుకోవద్దు. ఉదాహరణకి పండుగలకీ, శుభకార్యాలకీ ఇంట్లోని బూజు దులపడం, వస్తువులన్నీ శుభ్రం చేసుకోవడం.. మొదలైనవి చేస్తుంటాం. అయితే ఇవన్నీ చేసుకోవడం కాస్త కష్టమే అయినా వీటి వల్ల శరీరానికి అందే వ్యాయామం ఎక్కువే ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో.. ఇంటి పనులన్నీ కూడా అదే భావనతో చేసుకుంటే అలుపన్నది అంత తొందరగా దరి చేరదు. పైగా పనులకు పనులూ అయిపోతాయ్.. వ్యాయామ ఫలితం కూడా దక్కుతుంది.

ఫాస్ట్బీట్స్తో చకచకా..
మనం ఎంత డల్‌గా ఉన్నా సరే.. మంచి ఫాస్ట్‌బీట్ పాట ఒకటి విన్నామనుకోండి.. అంతే.. మనలో ఉన్న డల్‌నెస్ మాయమై.. మాంచి వూపొస్తుంది కదూ! ఈ టెక్నిక్‌ని ఇంటి పనులు చేసేటప్పుడు అప్త్లె చేస్తే విసుగనిపించకుండా ఆడుతూ పాడుతూ పని ముగించేయచ్చు. మ్యూజిక్ వింటున్నప్పుడు అలసట తెలియదు కాబట్టి సునాయసంగా పనుల్ని పూర్తి చేసేస్తాం.
వూడవడం, తుడవడం..
ఇల్లు వూడవడం, తుడవడం.. లాంటి పనులు చేయడానికి చాలామంది శ్రద్ధ చూపరు. కానీ ఈ పనుల వల్ల భుజాల్లో ఉండే కండరాల్లో కదలికలు జరిగి.. అవి మరింత దృఢమవుతాయి. అలాగే వెన్నెముక కూడా నిటారుగా ఉంటుంది.

నిల్చుని చేయడమూ..
ఇంటిల్లిపాదికీ వంట చేసి పెట్టాలి.. భోజనాలు పెట్టాలి.. ఆ గిన్నెలన్నీ శుభ్రం చేసుకోవాలి.. ఈ పనులు అందరి లిస్ట్‌లోనూ తప్పనిసరిగా ఉంటాయి. అయితే ప్రస్తుతం గిన్నెలు శుభ్రం చేయడానికి వంటగదుల్లోనే సింక్స్ అందుబాటులో ఉంటున్నాయి. 'ఏం లాభం.. ఎన్ని ఎక్కువ గిన్నెలు ఉంటే అంత ఎక్కువ సమయం నిలబడి ఉండాల్సి వస్తుంది. కాళ్లు లాగేస్తున్నాయ్..' అనుకుంటున్నారా?? నిలబడి పనులు చేయడం కూడా వ్యాయామంలో భాగమే. ఇలా చేయడం వల్ల కూడా ఫిట్‌గా మారడానికి అవకాశం ఉంటుంది.
బరువులెత్తడమూ..
ఇంట్లో చేసే పనుల్లో భాగంగా బరువులెత్తడం, వస్తువులను ఒకచోట నుంచి మరోచోటుకి మార్చడం.. వంటివి చేయడం సహజం. వీటి వల్ల కూడా శరీరానికి మంచి ఎక్సర్సైజ్ అందుతుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల వెన్నెముక దృఢంగా అవడంతో పాటు.. భవిష్యత్తులో మోకాళ్ల సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే నడవడం, వంగడం.. లాంటి పనుల వల్ల కూడా శరీరానికి మంచి వ్యాయామ ఫలితం అందుతుంది.

భుజాలకు మంచి ఎక్సర్సైజ్..
ఇంట్లో ఉండే షెల్ఫ్‌లు, వస్తువులు శుభ్రం చేసేటప్పుడు మన భుజాలను పైకి, కిందికి కదపాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల భుజాల్లోని కండరాల్లో కదలికలు జరిగి, వాటికి ఎక్సర్సైజ్ అవుతుంది. దీంతో అవి మరింత దృఢంగా తయారవుతాయి. కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా ఇంటిని శుభ్రం చేసుకోవడం ద్వారా కూడా మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు.
బట్టలుతకడం వల్ల..
ఈ జనరేషన్లో బట్టలు ఉతకడానికి చాలామంది ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు వాడుతున్నారు. ఇందులో అయితే బట్టలు దాదాపు డ్రై అయి బయటికి వస్తాయి. మరికొందరు సెమీఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు వాడుతున్నారు. ఇందులో ఉతికిన తర్వాత బట్టలు డ్రై కావాలంటే డ్రయర్లో వేయాల్సి ఉంటుంది. వీటికి బదులు మీ చేతులతో మీరే బట్టలు ఉతికి, ఆరేస్తే పొట్టలోని కండరాలకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే శరీరంలోని అనవసర క్యాలరీలు కూడా ఖర్చవుతాయి. అలాగే అధిక బరువు నుంచి విముక్తి పొందచ్చు. ఫలితంగా ఫిట్నెస్ మన సొంతమవుతుంది.

ఇస్త్రీ చేసుకోవడం వల్ల..
చాలామంది బట్టలు ఐరన్ చేసుకోవడానికి బద్ధకించి బయటకు ఇచ్చేస్తారు. కానీ ఎవరి బట్టలు వారే సొంతంగా ఇస్త్రీ చేసుకోవడం వల్ల శరీరంలోని భుజాలకు, కాళ్ల పిక్కల్లోని కండరాలకు వ్యాయామం అందుతుంది. ఫలితంగా అవి ఫిట్‌గా ఉండటానికి అవకాశం ఉంటుంది.
చూశారుగా.. ఇంట్లో రోజువారీ పనులు చేయడం వల్ల శరీర భాగాల్లోని కండరాలు దృఢమై.. ఫిట్‌గా తయారయ్యే అవకాశం ఉందని.. మరి, మీరు కూడా ఇవన్నీ గుర్తుంచుకుని వీలైనంత వరకు ఇంటి పనులు చేస్తూనే ఫిట్‌గా మారడానికి ప్రయత్నించండి.
అలాగే ఈ విషయాన్ని ఇంట్లో మగాళ్లకు కూడా చెప్పండి... రోజూ జిమ్ముకు వెళ్లకపోయినా ఇంటి పనుల్లో సాయం చేస్తే శరీరమంతటికీ చక్కటి వ్యాయామం లభిస్తుందని వారికి తెలియచేయండి.. వారినీ ఇంటి పనుల్లో భాగస్వాముల్ని చేయండి..