సాధారణంగా మనింట్లో ఎక్స్పైరీ అయిపోయిన, లేదంటే పాడైపోయిన పదార్థాలుంటే ఏం చేస్తాం? నేరుగా తీసుకెళ్లి చెత్తడబ్బాలో పడేస్తాం..! కానీ అలా చేయకుండా వాటినీ మన ఇంటి అవసరాల కోసం వినియోగించుకోవచ్చని చెబుతోంది అక్కినేని వారి కోడలు పిల్ల సమంత. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో జీవితం గురించి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, ఈ నేపథ్యంలోనే గార్డెనింగ్‌ని ప్రారంభించానంటూ ఇటీవలే వెల్లడించిన ఈ భామ.. తాను పెంచుతోన్న మొక్కల్ని పసిపాపల్లా చూసుకుంటూ మురిసిపోతోంది. వాటికి స్నానం కూడా చేయిస్తోంది.. అది కూడా పాడైపోయిన పాలతో!
గార్డెనింగ్ తన జీవితాన్నే మార్చేసిందంటోన్న సామ్.. తనకు ఆరోగ్యాన్నందించే ఆ మొక్కల్ని పసిపాపల్లా చూసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ మొక్కల ఆకుల్ని మెరిపించడానికి ఓ చక్కటి చిట్కాను కూడా పాటిస్తున్నానంటోందీ ముద్దుగుమ్మ.
పాలతోనే ఆ మెరుపు!
తన గార్డెనింగ్ గురించి ఇప్పటికే ఎన్నో విషయాలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతోన్న సామ్.. తాజాగా మరో చిట్కాను షేర్ చేసింది. ఇంట్లో పాడైపోయిన పాలతో మొక్కల ఆకుల్ని మెరిపించచ్చంటూ తాజాగా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టిందీ సుందరి.

ఓ మొక్క ఆకుల్ని పాలతో శుభ్రం చేసిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న సామ్.. ‘పాడైపోయిన, లేదంటే ఎక్స్పైరీ తేదీ అయిపోయిన పాలను వృథాగా పడేయకండి. మొక్కల్ని శుభ్రం చేయడానికి ఉపయోగించండి. నేను కూడా అదే పని చేశాను. పాడైపోయిన పాలతో నేను నా మొక్కల ఆకులకు స్పాంజ్ బాత్ చేయించాను. చూడండి.. అవి ఎంత షైనీగా మెరిసిపోతున్నాయో!’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిందీ టాలీవుడ్ బ్యూటీ. ఇలా వృథా అంటూ పడేసే వాటితో బోలెడన్ని ప్రయోజనాలున్నాయని చెప్పకనే చెప్పిందీ చక్కనమ్మ.

ఎలా ఉపయోగించాలంటే..!
పాడైపోయిన పాలను మొక్కలకు ఉపయోగిస్తే వాటికి హాని జరగదా? అన్న అనుమానం మీకు రావచ్చు.. కానీ పాలు మొక్కలకు సహజసిద్ధమైన ఎరువుగా ఉపయోగపడతాయంటున్నారు గార్డెనింగ్ నిపుణులు. ఇందులో ఉండే క్యాల్షియం, విటమిన్ ‘బి’, ప్రొటీన్లు మొక్క ఆరోగ్యానికి చాలా అవసరమంటున్నారు. కాబట్టి మీరు ఉపయోగించే పాలలో కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి స్ప్రే బాటిల్లో నింపుకోండి. ఆ మిశ్రమాన్ని మొక్కల ఆకులపై స్ప్రే చేయాలి. అరగంటయ్యాక ఒక పొడిగుడ్డతో తుడిచేయాలి. అలాగని మరీ ఎక్కువ పాలను స్ప్రే చేయకూడదన్న విషయం గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకించి ఇంటి లోపల పెంచుకునే మొక్కల ఆకులను శుభ్రపరచడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది.
ఇవీ వృథా కావు!

* ఇన్స్టంట్ కాఫీ పొడి ఎక్కువ రోజులు వాడకపోయినా, తేమ తగిలినా గట్టి పడిపోతుంది. అలాంటప్పుడు దాన్ని పడేయకుండా మేని మెరుపు కోసం ఉపయోగించచ్చు. ఈ క్రమంలో గట్టి పడిపోయిన కాఫీ పొడిని మిక్సీ వేసి మెత్తగా చేయాలి. అందులోనే కొన్ని పాలు పోసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని కాసేపు మర్దన చేసుకోవాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఈ చిట్కా వల్ల ముఖంపై మృతకణాలు, దుమ్ము-ధూళి తొలగిపోయి ప్రకాశవంతంగా మారుతుంది. * మిగిలిపోయిన మయొనైజ్తో స్టీలు పాత్రల్ని మెరిపించచ్చు. కాస్త మయొనైజ్ ను క్లాత్‌పై వేసి.. దాంతో పాత్రల్ని శుభ్రం చేస్తే అవి తళతళా మెరిసిపోతాయి. * పండ్లు బాగా మగ్గాయని, కాయగూరలు పాడైపోయాయని పడేస్తుంటాం. కానీ వాటితో దుస్తుల రంగుల్ని (ఫ్యాబ్రిక్ డైస్) తయారుచేసుకోవచ్చు. ఈ క్రమంలో బీట్రూట్తో ఎరుపు రంగు, కమలాఫలం-నిమ్మకాయలతో పసుపు షేడ్స్, ఆకుకూరలతో ఆకుపచ్చ, రెడ్ క్యాబేజీతో బ్లూ కలర్ డైస్ తయారుచేసుకోవచ్చు. * ఎక్స్పైరీ అయిపోయిన గ్రీన్ టీ లేదా గ్రీన్‌టీ బ్యాగ్‌లతో షూస్ నుంచి వచ్చే దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం గ్రీన్ టీని క్లాత్‌లో కట్టి షూస్‌లో పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. లేదంటే నేరుగా టీ బ్యాగ్‌ను కూడా పెట్టచ్చు. తద్వారా అది షూస్లోని తేమను, దుర్వాసనను పీల్చేసుకుంటుంది.
 * పెరుగు పుల్లగా మారితే తినలేం. అలాంటప్పుడు దాంతో మజ్జిగ చారు, పెరుగు పచ్చడి చేసుకోవడం, ఏదైనా బ్యాటర్లోకి ఉపయోగించడం.. వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరిస్తుంటాం. అలాంటి పుల్లటి పెరుగును అందానికి కూడా ఉపయోగించచ్చు. ఇందుకోసం రెండు టేబుల్స్పూన్ల పెరుగులో ఒక టేబుల్‌స్పూన్ తేనెను కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి పావుగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. * బ్రౌన్ షుగర్ కూడా ఎక్కువ రోజులు వాడకుండా అలాగే ఉంచితే గట్టిపడిపోతుంది. అలాంటప్పుడు దాన్ని బ్లెండర్ లేదా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ గట్టిపడిపోతే ఇందులో కొన్ని చుక్కల నీళ్లు వేసి పొడి చేసుకోవచ్చు. ఈ పొడిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. * బాగా మగ్గిన అవకాడోతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం అవకాడోను పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకుంటే సరిపోతుంది. అవకాడో కేశాలకు తేమను అందించడంతో పాటు సిల్కీగా, మృదువుగా మారుస్తుంది.
 * నిమ్మకాయలు ఎక్కువ రోజులుంటే దాని తొక్క నల్లగా మారడం, అక్కడక్కడా ఫంగస్ రావడం.. వంటివి మనం గమనిస్తూనే ఉంటాం. అలాంటప్పుడు వాటిని వృథాగా పడేయకుండా కిచెన్ సింక్ శుభ్రం చేయడానికి ఉపయోగించచ్చు. నిమ్మరసం సింక్‌లోని దుర్వాసనను దూరం చేస్తుంది. * కొత్తిమీర, పుదీనా, మెంతి.. వంటి ఆకులు సరిగ్గా నిల్వ చేయకపోతే తేమను కోల్పోయి పొడిబారిపోతాయి. అలాంటప్పుడు వాటిని పడేయకుండా ఎండబెట్టాలి. ఆపై వాటిని క్రష్ చేసి అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫుడ్ ఫ్లేవర్/సీజనింగ్గా ఉపయోగించచ్చు.
|