మూలమూలల్లోనూ శుభ్రం చేయాల్సిందే!
* కాయగూరలు కట్ చేసుకోవడానికి ఉపయోగించే చాపింగ్ బోర్డును, కత్తుల్ని వాడిన ప్రతిసారీ శుభ్రంగా కడిగేయాలి. అలాగే కాయగూరలకు, మాంసాహారానికి వేర్వేరు కటింగ్ బోర్డులు, కత్తులు వాడడం ఉత్తమం.
 * ఎక్కడైతే కాయగూరలు కట్ చేశామో పని పూర్తయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. లేదంటే అక్కడున్న తేమ, కాయగూరల అవశేషాలు వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల్ని త్వరగా ఆకర్షిస్తాయి. * స్టౌ మీద పడిన నూనె మరకలను తొలగించడానికి, కిచెన్ ప్లాట్‌ఫామ్ శుభ్రం చేయడానికి యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్‌ని ఉపయోగించచ్చు. తరచూ వాడే రిఫ్రిజిరేటర్, ఒవెన్.. వంటి వస్తువులను వారానికోసారైనా క్రిమి సంహారక ద్రావణాలతో శుభ్రం చేయాలి.
 * కిచెన్ అంటే డైనింగ్ టేబుల్ కూడా అదే కోవలోకి వస్తుంది. డైనింగ్ టేబుల్ని ఉపయోగించిన ప్రతిసారీ క్రిమి సంహారక ద్రావణాలతో శుభ్రం చేయాలి. లేదంటే ఆహారపు అవశేషాలు దానిపైనే ఉండిపోయి వాతావరణంలోని క్రిముల్ని త్వరగా ఆకర్షించే అవకాశం ఉంటుంది. * వంట పనుల్లో భాగంగా ఫ్రిజ్‌ని మనం రోజూ ఉపయోగించుకుంటుంటాం. అయితే అందులో కొందరు వేడివేడి పదార్థాలనే పెట్టేస్తుంటారు. దీనివల్ల ఆ ఆహారం విషపూరితమయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా ఫ్రిజ్ లోపలి వాతావరణం అపరిశుభ్రం అవుతుంది. కాబట్టి గది ఉష్ణోగ్రత వద్ద చల్లారాక మాత్రమే ఏదైనా ఫ్రిజ్‌లో పెట్టడం ఉత్తమం.
 * మాంసాహారమేదైనా సరే వండుకునే ముందు అప్పటికప్పుడు తాజాగా కొని తెచ్చుకోవడం మంచిది. అలాకాకుండా ముందే తెచ్చుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోకుండా ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరం. * ఇక మాంసాహారం కడిగిన తర్వాత సింక్ లేదా ఆ ప్రదేశాన్ని సోప్ వాటర్‌తో ఒకసారి, ఆపై క్రిమి సంహారక ద్రావణంతో మరోసారి శుభ్రం చేసుకుంటే అటు దుర్వాసన రాకుండా ఉంటుంది.. ఇటు ఆ ప్రదేశంలో వైరస్, బ్యాక్టీరియాలు వృద్ధి చెందకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే పని పూర్తయ్యాక చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఇతర వస్తువుల్ని తాకాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.
 * వంట కోసం మనం ఉపయోగించిన పాత్రలు, గిన్నెలు.. వంటివి సింక్‌లో పడేసి ఏ సాయంత్రమో లేదంటే మరునాడు ఉదయమో కడిగేసుకుంటాం. కానీ అలాంటి పాత్రల్లో ఉండే వ్యర్థాలు, జిడ్డుదనం, తేమ.. కారణంగా వాటి వాడకం పూర్తయిన రెండు గంటల తర్వాత బ్యాక్టీరియా, వైరస్లు వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. కాబట్టి రెండు గంటల్లోపే వాటిని కడిగేసుకోవడం ఉత్తమం. ఆరేంత వరకు ఇలా ఎప్పటికప్పుడు పాత్రల్ని శుభ్రం చేసుకోవడం వల్ల శ్రమా తగ్గుతుంది.. ఆరోగ్యంగానూ ఉండచ్చు. అలాగే ఈ పాత్రల్ని పూర్తిగా ఆరబెట్టడమూ ముఖ్యమే!
 * కిచెన్‌ని శుభ్రం చేయడానికి ఉపయోగించిన వైప్స్ అయితే ఎప్పటికప్పుడు పడేయచ్చు. అదే క్లాత్, స్పాంజి.. వంటివి ఉపయోగించినప్పుడు వాడిన ప్రతిసారీ వాటిని శుభ్రం చేయాల్సిందే! ఇందుకోసం క్లోరిన్ బ్లీచ్ కలిపిన వేడి నీళ్లలో వీటిని కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటిలో పిండేసి ఎండలో ఆరబెట్టాలి. తద్వారా దానికి అంటుకున్న బ్యాక్టీరియా నశించడంతో పాటు దుర్వాసన రాకుండా జాగ్రత్తపడచ్చు. * రోజూ ఇంట్లోని టైల్స్ తుడిచే సమయం అందరికీ ఉండకపోవచ్చు. అయితే మిగతా గదుల మాట ఎలా ఉన్నా కిచెన్ ఫ్లోర్ మాత్రం రోజూ శుభ్రం చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. బేకింగ్ సోడా, వెనిగర్, వేడి నీళ్లు.. వంటివి కలిపిన మిశ్రమాన్ని ఇందుకు ఉపయోగించచ్చు.
 * కాయగూరల వ్యర్థాలు, పాడైపోయిన పదార్థాలు.. వంటివన్నీ చెత్తబుట్టలో పడేస్తుంటాం. దాన్ని రోజులకు రోజులు ఇంట్లోనే ఉంచడం కాకుండా రోజూ రాత్రి పూట ఆరుబయట ఏర్పాటుచేసిన చెత్తడబ్బాలో పడేయాలి.. లేదంటే మీ ఇంటికి దగ్గర్లో మున్సిపాలిటీ వాళ్లు ఏర్పాటుచేసిన చెత్తకుండీ ఉంటే అందులో వేసేయాలి. తద్వారా బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా జాగ్రత్తపడచ్చు. * ఇలా కిచెన్‌ను శుభ్రం చేసే క్రమంలో ప్రతిసారీ గ్లౌజులు ధరించడం మంచిది. అలాగే పని పూర్తయిన తర్వాత వాడిన గ్లౌజుల్ని పిండి, ఎండలో ఆరేయాలి.. ఆపై చేతుల్ని ఇరవై సెకన్ల పాటు రుద్దుతూ కడిగేసుకుంటే సరిపోతుంది.
|