''నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే||''
అష్త్టెశ్వర్యాలు, సకల సంపదలు మనకు కలగాలని, కొంగుబంగారమై కోరిందల్లా ప్రసాదించాలని వరలక్ష్మీ దేవిని పూజిస్తాం. అందుకే శ్రావణమాసం శుక్లపక్షంలో, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం 'వరలక్ష్మీ వ్రతం' ఆచరిస్తాం. మరి, సిరి సంపదలనొసగే ఆ తల్లిని ఆవాహనం చేసే కలశం కూడా అంతే చక్కగా అలంకరించుకోవాలి కదా. అదెలా అంటారా? ఇది చదవండి..
ముందు ఒక ఇత్తడి చెంబును తీసుకోవాలి. దాన్ని శుభ్రం చేసుకుని తుడిచి పక్కన పెట్టుకోవాలి.

ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని ఆ చెంబు చుట్టూ మొత్తం కవర్ అయ్యేలా చుట్టి, ఒక శాటిన్ రిబ్బన్‌తో కట్టేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పసుపుని నీటితో కలిపి ముద్దగా చేసి కొబ్బరి కాయకు గుండ్రంగా అతికించాలి.
తడిగా ఉండటం వల్ల అది చక్కగా అంటుకుంటుంది. అయితే అలా గుండ్రంగా అంటించేటప్పుడే ముక్కు, పెదవులు వంటి భాగాలు కాస్త ఎత్తుగా పెట్టుకోవాలి.
ఇప్పుడు కాస్త మందంగా ఉన్న ఒక తెల్లటి పేపర్ని డైమండ్ షేప్‌లో కట్ చేసి ఈ పసుపు ముద్ద మీద అతికించాలి. ఇవి కళ్లు. వాటి మీద బ్లాక్ స్టిక్కర్ పెట్టాలి. తర్వాత ఐ లైనర్‌తో కళ్ల మీద ఐబ్రోస్‌ను దిద్దాలి.
అలాగే తిలకం లేదా నెయిల్ పాలిష్‌తో పెదాల ఆకృతి వచ్చేలా గీసుకోవాలి.అదేవిధంగా రెండు చిన్న చిన్న ఉండలను తీసుకుని కొబ్బరికాయకు రెండువైపులా రెండు చెవుల ఆకృతిలో అతికించుకోవాలి. వాటికి రింగులు పెట్టాలి. కానీ బాగా బరువుగా ఉన్నవి పెట్టకూడదని గుర్తుంచుకోండి. తర్వాత బొట్టు పెట్టాలి. ఇదంతా చేసేటప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి వెంటనే అతుక్కుంటాయి.

మనం ఇంతకు ముందు బ్లౌజ్ పీస్ చుట్టి సిద్ధం చేసుకున్న చెంబుకి ఆ క్లాత్ పైన కావాలనుకుంటే మిర్రర్స్ లేదా ప్యాచెస్ అతికించి డెకరేట్ చేసుకోవచ్చు. తర్వాత కలశంలో మామిడాకులు, పసుపు నీళ్లు వేసి; అలంకరించుకున్న కొబ్బరికాయని ఆ చెంబు మీద పెట్టాలి.

తర్వాత మరొక ఎరుపు రంగు బ్లౌజ్ పీస్‌ను కోన్ ఆకారంలో చుట్టి పిన్నులు పెట్టాలి. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా కిరీటం మాదిరిగా అమర్చాలి. ఆపై మీ దగ్గరున్న ఆభరణాలు అలంకరించాలి. కావాలనుకుంటే చిల్లర లేదా నోట్లతో కూడా అలంకరించుకోవచ్చు.

ఇలా పూర్తిగా అలంకరణ చేసుకున్న తర్వాత ధూప, దీప, నైవేద్యాలతో, భక్తి ప్రపత్తులతో అమ్మవారికి ఆవాహన పలికి పూజ చేసుకోవాలి.

- కేతా శోభారాణి, వసుంధర కుటుంబం నిపుణురాలు