జులై 31 - వరలక్ష్మీ వ్రతం
శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నోచే నోము 'వరలక్ష్మీ వ్రతం'. ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున పెళ్లయిన మహిళలు ఈ వ్రతం ఆచరిస్తే భర్త, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయుష్షు బాగుంటాయని ఓ విశ్వాసం. మరి ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంటిని, పూజగదిని, మండపాన్ని ఎలా అలంకరించాలో తెలుసుకుందాం.. రండి..
ఇంటిని ఇంపుగా..
* వీలైతే ఆ రోజు లేదంటే ముందు రోజు ఇళ్లంతా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి.
* ఇంట్లోని ద్వారాలకు మామిడాకులతో తోరణాలు, పూలదండలు కట్టాలి. ఇంటి చుట్టూ, ముఖద్వారాన్ని లైట్లతో అలంకరించాలి.
* పూజకు ముందు.. తర్వాత అమ్మవారి పాటలను పెట్టుకునేలా ముందే తగిన ఏర్పాట్లు చేసి పెట్టుకోవాలి. దీనివల్ల ఇళ్లంతా సందడిగా మారి.. పండగ వాతావరణం నెలకొంటుంది.
మండపం అలంకరణ ఇలా..
ముందుగా మండపాన్ని శుభ్రంగా కడిగి.. దానిపై వరిపిండితో మంచి ముగ్గులు వేయాలి. నాలుగు వైపులా అరటి కొమ్మలు, మామిడాకులతో అలంకరించాలి. ముందుగా మాల కట్టుకొని పెట్టుకున్న పూలదండలను మండపానికి కట్టాలి. తర్వాత మండపానికి లైటింగ్ అరేంజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన మండపాన్ని తూర్పుకు అభిముఖంగా ఉంచాలి.

పూజగది..
* పూజగది ఉన్న వారు పూజగదిలో, పూజగది లేనివారు లివింగ్ రూమ్లో తూర్పు దిశగా ముందుగా అలంకరించుకున్న మండపాన్ని ఉంచాలి.
* పూజగదిలోని కలశం, కుందులు, మంగళహారతులు.. మొదలైన పూజా పాత్రలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
* ఈ మండపంపై అరటి ఆకును ఉంచాలి. లేదంటే పళ్లెం అయినా ఉంచొచ్చు. తర్వాత ఆకులో లేదా పళ్లెంలో కొన్ని బియ్యం పోసి సమానంగా పరచాలి.
* ముందుగా పసుపు, కుంకుమతో చుట్టూ బొట్లు పెట్టి అలంకరించిన కలశంలో (బంగారం, వెండి, రాగి.. ఇలా ఏ లోహంతో చేసిన కలశమైనా కావచ్చు.) కొన్ని బియ్యం పోసి దాన్ని ఆకు లేదా పళ్లెంలో పోసిన బియ్యంలో ఉంచాలి.
* కలశంలో ఉన్న బియ్యంలో నిమ్మకాయ, తమలపాకులు, కాయిన్స్.. మొదలైనవి ఉంచాలి. తర్వాత కలశం చుట్టూ మామిడాకులు పెట్టి దానిపై శుభ్రంగా కడిగి, కాస్త పసుపు చల్లిన కొబ్బరి కాయను ఉంచాలి.
* అమ్మవారి విగ్రహాన్ని లేదా ఫొటోను నీట్గా తుడిచి నుదుటన కుంకుమ బొట్టు పెట్టాలి. విగ్రహమైతే కంటికి కాటుక కూడా పెట్టొచ్చు. తర్వాత అమ్మను ఎరుపు రంగు బ్లౌజ్ పీస్, ఆభరణాలు, పూలు.. మొదలైన వాటితో అలంకరించాలి.
* ఇలా అలంకరించిన అమ్మవారి ముఖం కలశం వైపు ఉండేలా అమర్చాలి.
* తర్వాత దీపాలు వెలిగించాలి.
* అనంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి చేసిన పిండి వంటలన్నీ మండపం ముందు ఉంచి పూజ మొదలు పెట్టాలి.
ఇలా చేస్తే అమ్మ సంతోషిస్తుంది!

పూజ ముగిసిన తర్వాత వచ్చిన ముత్త్తెదువులందరికీ వాయనాలు ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారం. వరలక్ష్మీ వత్రం పూర్తయిన తర్వాత 'శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వాయన దానం సమర్పయామి' అనుకుని నానబెట్టిన శెనగలు, మూడు ఆకులు, వక్క, అరటిపండు, పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, ఎరుపు రంగు జాకెట్ పీస్, తయారు చేసిన పిండి వంటలు.. వీటన్నింటినీ ఒక పళ్లెంలో తీసుకొని.. దానిపై మరో పళ్లెంను ఉంచాలి. దానిపై కొంగు కప్పి.. ముత్త్తెదువుకు బొట్టు పెట్టి.. ఆమెను వరలక్ష్మీ దేవిగా భావించి ఈ వాయనాన్ని అందిస్తారు. ఇలా వాయనాన్ని ఇచ్చేటప్పుడు 'ఇస్తినమ్మ వాయనం..' అని ఇచ్చేవారు, 'పుచ్చుకుంటినమ్మ వాయనం..' అని తీసుకునే వారు అనాలి. ఇలా మూడుసార్లు ఒకరికొకరు చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి ఆశీర్వాదం అందుకోవాలి. ఇలా వాయనాన్ని ముత్త్తెదువుకు సమర్పించడం వల్ల ఇరువురికీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుంటాయని నమ్మకం. అలాగే సామాజిక సంబంధాలు కూడా వృద్ధి చెందుతాయని భావిస్తారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో - ముత్తైదువులను ఇంటికి పిలిచి ఎప్పటిలాగానే వాయనాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. బర్త్ డే లు, పెళ్లిళ్లు, వేడుకలు అంటూ నిబంధనలను అతిక్రమించి మరీ నలుగురినీ పిలిచి పార్టీలు చేసుకునే వాళ్ళు ఎందరో కరోనా బారిన పడడం చూస్తూనే ఉన్నాం.. అందుకే ఈసారి ఎవరిళ్ళల్లో వారుండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం.. ఇక వాయనాలు అంటారా..? ఆ అమ్మవారికి ప్రస్తుత పరిస్థితి అంతా తెలుసు కాబట్టి మంచి మనసుతో అర్ధం చేసుకుంటుంది. అందుకే ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనాలు ఇచ్చే బదులు ఆ సొమ్ముతో కరోనా నివారణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇస్తే ఆ తల్లి కూడా ఎంతగానో సంతోషించి మీ ఇంటిల్లిపాదికీ తన దీవెనలు అందిస్తుంది.
|
శానిటైజ్ చేయడం మరిచిపోకండి!
అలాగే.. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి... అమ్మ వారి పూజ కోసం వాడే ప్రతి వస్తువుని, ప్రతి పదార్ధాన్నీ శుభ్రంగా శానిటైజ్ చేయడం మాత్రం మర్చిపోకండి... అలాగే బయట నుంచి అన్ని వస్తువులను తెప్పించడం కాకుండా, సాధ్యమైనంతవరకు ఇంట్లో ఉన్న వాటితోనే పూజ పూర్తి చేయడానికి ప్రయత్నించండి. తద్వారా బయటకు వెళ్లడం తగ్గించి కరోనా నివారణలో మీ వంతు పాత్ర పోషించండి. హంగులు, ఆర్భాటాల కంటే మనలో ఉండే నిజమైన భక్తి శ్రద్ధలనే ఆ అమ్మ కోరుకుంటుంది.. అవి ఉన్నప్పుడే మనల్ని అన్ని రకాలుగా అనుగ్రహిస్తుంది.. కాబట్టి ఈ విషయం గమనించి, హృదయపూర్వకమైన భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజించి ఆ తల్లి కరుణా కటాక్షాలు అందుకోండి!
|