అమ్మాయిల బ్యూటీ కిట్‌లో ఉండే ముఖ్యమైన వస్తువుల్లో కాటన్ బాల్స్ కూడా ఒకటి. ముఖానికి రోజ్ వాటర్ రాసుకోవడానికైనా, వేసుకున్న మేకప్ తొలగించుకోవడానికైనా, నెయిల్ పాలిష్‌ని తొలగించుకునే క్రమంలో.. ఇలా అతివల సౌందర్య సంరక్షణలో ఇవి చాలా రకాలుగానే ఉపయోగపడతాయని చెప్పచ్చు. ఇలా కేవలం బ్యూటీ విషయంలోనే కాదు.. ఈ కాటన్ బాల్స్‌ని ఇంట్లో మరిన్ని అవసరాల కోసం కూడా వాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఇంటి అవసరాల కోసం..!
* ఇంట్లో చీమల బెడదను తగ్గించుకోవాలంటే.. కొన్ని వేడి నీళ్లలో కొద్దిగా చక్కెర వేసి.. అందులో టీస్పూన్ బోరాక్స్ పొడి వేసి కలపాలి. ఇందులో ముంచిన కాటన్ బాల్ని చీమలున్న చోట పెడితే.. అవి చచ్చిపోతాయి. ఇతర కీటకాల్ని తొలగించడానికీ ఈ చిట్కా ఉపయోగించచ్చు.
* ఇంట్లో సింక్, కిచెన్ ప్లాట్‌ఫామ్, బాత్రూమ్.. వంటి పలుచోట్ల మూలల్లో జిడ్డుగా, మురికి పేరుకుపోవడం మనం గమనిస్తుంటాం. అయితే ఎంత రుద్దినా ఆ జిడ్డు ఓ పట్టాన వదలదు. అలాంటప్పుడు కాటన్ బాల్‌ను బ్లీచింగ్ పౌడర్‌లో ముంచి మూలలకు అప్లై చేసి గంట పాటు అలాగే ఉంచాలి. ఆపై రుద్దుతూ వేడినీటితో కడిగేస్తే సులభంగా జిడ్డు మాయమవుతుంది.

* వంటింట్లో అప్పుడప్పుడూ దుర్వాసనలు రావడం మామూలే. ఇలాంటి సమయాల్లో కొన్ని కాటన్ బాల్స్‌ని ఏదైనా అత్యవసర నూనెలో (ఎసెన్షియల్ ఆయిల్) కాసేపు నానబెట్టి.. ఆ గిన్నెను ఓ మూలన ఉంచడం వల్ల ఫలితం ఉంటుంది.
* కొన్ని చుక్కల వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ని కాటన్ బాల్‌పై వేసి వార్డ్‌రోబ్‌లో ఓ మూల ఉంచితే దుస్తులు సువాసనలు వెదజల్లుతాయి. అలాగే రిఫ్రిజిరేటర్లో నుంచి వచ్చే దుర్వాసనలు పోగొట్టడానికీ ఈ చిట్కాను పాటించచ్చు.
* సింక్ ట్యాప్, వాష్‌బేసిన్ ట్యాప్, సింక్ టైల్స్.. ఇలా నీళ్లు పడిన చోట తెల్లటి మరకలు పడడం పరిపాటే. వాటిని స్క్రబ్బర్‌తో ఎంత రుద్దినా వదిలిపోవు. అలాంటప్పుడు వెనిగర్, నీళ్లు సమపాళ్లలో తీసుకొని.. ఆ మిశ్రమంలో కాటన్ బాల్ని ముంచి మరకలు పడిన చోట అప్లై చేయాలి. కొన్ని నిమిషాలయ్యాక ఆయా భాగాలను కడిగేయడం లేదంటే మృదువైన గుడ్డతో తుడిచేయడం చేయాలి.

* స్విచ్‌బోర్డులు, డోర్ నాబ్స్, డోర్ స్టాపర్స్.. వంటి చిన్న చిన్న వస్తువుల్ని శానిటైజ్ చేయడానికి పెద్ద పెద్ద క్లాత్స్ కంటే చిన్న కాటన్ బాల్స్ ఉపయోగిస్తే సులభంగా పని పూర్తవుతుంది.
* విత్తనాలు నాటుకోవడానికి ముందుగా అవి మొలకెత్తాలంటే ఒక జార్లో ఆయా విత్తనాలు, కొన్ని కాటన్ బాల్స్‌ని ఉంచాలి. ఆపై మూత పెట్టి ఒకసారి జార్‌ను షేక్ చేస్తే విత్తనాలు, బాల్స్ కలిసిపోతాయి. ఇప్పుడు బాల్స్ తడిచేలా నీళ్లు పోయాలి. బాల్స్ తడిని లాక్ చేసి ఉంచడం వల్ల నాలుగైదు రోజులకు విత్తనాలు మొలకలొస్తాయి. ఆపై వాటిని తీసి కుండీలో, నేలలో నాటుకుంటే సరి!
* ఎలుకలు, ఉడతలు.. వంటివి మీ గార్డెన్‌ను పాడుచేస్తుంటే.. వెనిగర్‌లో ముంచిన కొన్ని కాటన్ బాల్స్‌ని గార్డెన్లో అక్కడక్కడా వేయండి. సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది.

బయటికి వెళ్లేటప్పుడు ఇలా!
* మీరు బయటికి వెళ్లేటప్పుడు మీ వద్ద పాకెట్ పెర్ఫ్యూమ్ లేదనుకోండి.. ఏం చేస్తారు? ఇంట్లో ఉండే పెద్ద పెర్ఫ్యూమ్ బాటిల్‌ని బ్యాగ్‌లో వేసుకొని తీసుకెళ్తాం అంటారా? దానికి ప్రత్యామ్నాయంగా ఈ సింపుల్ టిప్‌ని పాటిస్తే సరి! ఇందుకోసం కొన్ని కాటన్ బాల్స్‌పై పెర్ఫ్యూమ్ని స్ప్రే చేసుకొని లేదంటే కొన్ని చుక్కల సెంట్ వేసి జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టేసుకోవాలి. ఇక మీకు అవసరమైనప్పుడు ఆ బాల్స్‌తో మెడలు, డ్రస్.. ఇలా మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ టచప్ ఇస్తే సరిపోతుంది.
* మీరు బయటికి వెళ్లినప్పుడల్లా మేకప్ కిట్ మోసుకెళ్లడం ఇబ్బందిగా ఉందా? అయితే ఆ సమయంలో మధ్యమధ్యలో టచప్ ఇవ్వాలనుకున్న బ్రాంజర్, బ్లష్.. వంటి వాటిలో వేర్వేరుగా కాటన్ బాల్‌ను అద్ది.. జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకెళ్లాలి. వాటితో మీకు కావాల్సినప్పుడు మీ అందానికి మెరుగులద్దుకోవచ్చు.

* ప్రయాణాల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే కాటన్‌బాల్స్ నింపిన చిన్న కుషన్స్ మధ్యలో వీటిని అమర్చడం, లేదంటే వాటికి సపోర్ట్‌గా ఉంచడం ఉత్తమం.
ఇలా కూడా!
* కొత్త చెప్పులు లేదా షూస్ వేసుకున్నప్పుడు వాటి రాపిడికి అక్కడక్కడా పాదాలపై దద్దుర్లు రావడం, ఎరుపెక్కడం మనకు అనుభవమే. అలా జరగకూడదంటే ఆయా భాగాలపై కాటన్ బాల్స్ ఉంచి.. చెప్పులు లేదా షూస్ వేసుకోవడం మంచిది.

* పిల్లలు డ్రాయింగ్ వేసే క్రమంలో వారి చేతులపై మార్కర్ మరకలు పడుతుంటాయి. అవి మామూలుగా కడిగితే ఓ పట్టాన వదలవు. అలాంటప్పుడు పాలల్లో ముంచిన కాటన్ బాల్‌తో మరకలు పడిన చోట రుద్దితే ఇట్టే వదిలిపోతాయి.
* దుస్తులపై పడిన సిరా మరకల్ని తొలగించడానికీ కాటన్ బాల్ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఆల్కహాల్ ద్రావణంలో ముంచిన కాటన్ బాల్‌తో మరక పడిన చోట నెమ్మదిగా రుద్ది.. ఆపై ఉతికేస్తే సరిపోతుంది.
* చేతులకు ధరించిన గ్లౌజులు కొన్ని రోజులకు డ్యామేజ్ అయి మునివేళ్ల భాగంలో చిరిగిపోవడం మనం గమనిస్తుంటాం. అలా జరగకూడదంటే మునివేళ్ల దగ్గర కాటన్ బాల్స్‌ని ఉంచి.. ఆపై గ్లౌజులు వేసుకోవాలి.

* ఎండ వేడికి చర్మం కందిపోయి మంట పుడుతుంది. అలాంటప్పుడు యాపిల్ సిడార్ వెనిగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో సమస్య ఉన్న చోట రాస్తే మంట తగ్గి చల్లబడుతుంది.
* పంటి నొప్పి వేధిస్తున్నట్లయితే లవంగం నూనెలో ముంచిన కాటన్ బాల్‌ను నొప్పి ఉన్న చోట కాసేపు ఉంచితే ఫలితం ఉంటుంది.