అందుబాటులోని స్థలం తక్కువే అయినా అందులో రకరకాల కూరగాయలు, రంగురంగుల పూలమొక్కలు పెంచుతూ ఉంటారు పర్యావరణ ప్రేమికులు. అయితే అవి గుబురుగా పెరగాలనే ఉద్దేశంతో రసాయన ఎరువులు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటిని ఉపయోగించడం వల్ల నేల కలుషితమై దానిలోని సారం పూర్తిగా తగ్గిపోతుంది. వీటికి బదులుగా మనం సాధారణంగా చెత్త అని పడేసే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే అవి సహజమైన ఎరువులుగా పనిచేసి.. నేలను సారవంతం చేయడంతో పాటు.. మొక్కలు ఏపుగా పెరిగేలా చేస్తాయి. మరి, అలా మొక్కలకు సహజసిద్ధమైన ఎరువుగా ఉపయోగించదగిన పదార్థాలేంటో తెలుసుకుందామా?

అక్వేరియం నీరు..
అక్వేరియంలో చేపలు ఎక్కువ కాలం బతకడానికి కనీసం వారం పది రోజులకొకసారైనా నీటిని మారుస్తూ ఉంటారు. అలా మార్చేటప్పుడు అందులోని నీరు వాసన వస్తుంది కాబట్టి దూరంగా పారబోస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ నీటిని మొక్కలకు పోయండి. దానిలో ఉండే చేపల విసర్జకాలు మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తాయి. అయితే అక్వేరియంలో ఉప్పునీటి చేపలను పెంచితే మాత్రం ఆ నీటిని మొక్కలకు వేయకూడదు.
గ్రీన్ టీ
గ్రీన్ టీ మిశ్రమం కూడా ఎరువుగా పనిచేసి మొక్కలు బలంగా అయ్యేలా చేస్తుంది. దీనికోసం వాడేసిన గ్రీన్ టీ పొడిని మొక్కల మొదళ్లలో వేస్తే చాలు. అవి బలంగా తయారవుతాయి. అలాగే ఏడున్నర లీటర్ల నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి పూర్తిగా నాననివ్వాలి. ఆ తర్వాత టీబ్యాగుని కూడా బాగా పిండి ఆ నీటిని మొక్కలకు పోయాలి. ఇలా చేసినా మొక్కలకు సత్తువ లభిస్తుంది.

కాఫీ పొడి
టమాటా, గులాబీ మొక్కలకు వాడేసిన కాఫీ పొడిని ఎరువుగా వేస్తే.. అవి ఏపుగా పెరగడంతో పాటు మంచి దిగుబడిని కూడా ఇస్తాయి. పది లీటర్ల నీటిలో రెండున్నర కప్పుల కాఫీ పొడిని కలిపి రెండు నుంచి మూడు రోజుల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కుండీల్లోని మట్టిలో వేస్తే సరిపోతుంది.
అరటితొక్క
అరటి పండు తిన్నాక తొక్క తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో పడేస్తాం. కానీ అలా పడేయడం కంటే వాటిని కుండీల్లో వేసి, దానిపైన కాస్త మట్టి వేసేయండి. అది మట్టిలో కలిసిపోయి మంచి ఎరువుగా మారుతుంది. ముఖ్యంగా వాటిని పూలమొక్కలకు వేసినట్త్లెతే పూలు పెద్దవిగా పూస్తాయి.
గుడ్డు పెంకులు
కోడిగుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి వాటిని బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ పొడిని టమాటా, మిర్చి, పూలమొక్కలకు వేసుకోవచ్చు. గుడ్డు పెంకుల్లో అధికమొత్తంలో క్యాల్షియం ఉంటుంది. ఇది మొక్కలు ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.

ఎప్సం సాల్ట్
ఒక టేబుల్‌స్పూన్ ఎప్సం సాల్ట్ తీసుకొని దాదాపుగా మూడున్నర లీటర్ల నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో వేసి మొక్కల మొదళ్లకు తగిలేలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల కూడా మొక్కలు బాగా పెరుగుతాయి.
ఉల్లిపొట్టు
ఉల్లిపొట్టు మట్టిలో త్వరగా కలసిపోయి ఎరువుగా మారుతుంది. అలాగే ఇవి మొక్కలకు చీడపీడలు రాకుండా కాపాడుతుంది. ఈ ఫలితాన్ని పొందడానికి ఉల్లిపొట్టుని నేరుగా కుండీల్లో వేస్తే సరిపోతుంది. లేదా వీటితో ప్రత్యేక ద్రావణాన్ని కూడా తయారుచేయచ్చు. పది నుంచి ఇరవై గ్రాముల ఉల్లిపొట్టుని ఐదు లీటర్ల గోరువెచ్చని నీటిలో వేసి నాలుగు రోజుల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత దాన్ని మొక్కలపై స్ప్రే చేస్తే పురుగుమందుగా పనిచేస్తుంది. మొదళ్ల భాగంలో వేస్తే ఎరువుగానూ ఉపయోగపడుతుంది.