టెక్నాలజీ పెరిగిపోవడంతో స్మార్ట్ఫోన్లను వినియోగించేవారు చాలా ఎక్కువైపోయారు. కానీ మీకు తెలుసా? మన బాత్రూంలో ఎన్ని రకాల సూక్ష్మక్రిములుంటాయో.. సెల్‌ఫోన్ తెరపైన కూడా దాదాపు అన్నే ఉంటాయట. ఈ తాకే తెరలపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా కారణంగా.. మనకు వివిధ రకాల రోగాలు వచ్చే అవకాశముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే టచ్‌స్క్రీన్ ఉపయోగించడానికి చేతివేళ్లకు బదులుగా స్త్టెలస్ ఉపయోగించడం మంచిది. ప్రారంభంలో ఉపయోగించడం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. అలవాటైతే అందరిలోనూ మీరే స్త్టెలిష్‌గా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయో.. వాటికోసం ఎంత ఖర్చు చేయాలో అనుకుంటున్నారా? అదేం అవసరం లేదు. తక్కువ ఖర్చుతోనే.. అందమైన లిక్విడ్ స్త్టెలస్ని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మరి అదెలాగో తెలుసుకొందామా..
కావాల్సినవి..
* ఆరు మి.మీ. వెడల్పున్న ట్రాన్స్పరెంట్ ట్యూబ్
* హాట్ గ్లూ
* నీరు
* రంగులు
* బేబీ ఆయిల్
* చమ్కీలు
* స్పాంజ్
* ఆలూ చిప్స్ వంటి వాటిని ప్యాక్ చేసే కవర్
* ప్లాస్టర్
తయారుచేసే విధానం..
* ముందుగా ట్రాన్స్పరెంట్ ట్యూబ్‌ని 12 సెం.మీ. పొడవు ఉండేలా కత్తిరించుకోవాలి. ఆ తర్వాత ఒకవైపు రంధ్రాన్ని హాట్గ్లూ సాయంతో మూసి పూర్తిగా ఆరనివ్వాలి.

* ఇప్పుడు గిన్నెలో కొంత నీరు తీసుకొని అందులో మీకు నచ్చిన అక్రిలిక్ రంగుని కలిపాలి. మరో గిన్నెలో బేబీ ఆయిల్ పోసి అందులో చమ్కీలు కలపాలి.

* ఆ తర్వాత చిన్నసైజు గరాటు సాయంతో.. ప్లాస్టిక్ గొట్టంలోకి రంగు నీటిని, చమ్కీలు కలిపిన నూనెను ఒకదాని తర్వాత మరొకటి పోయాలి. గరాటు అందుబాటులో లేకపోతే.. కాస్త దళసరిగా ఉండే కాగితాన్ని గరాటు మాదిరిగా తయారుచేసుకొని దాన్ని ఉపయోగించవచ్చు. ఇలా ట్యూబ్‌ని పూర్తిగా కాకుండా కాస్త ఖాళీ ఉండేలా ఈ రెండు మిశ్రమాలను వేయాల్సి ఉంటుంది.
* నీరు, నూనె పోసిన తర్వాత ట్యూబ్ రెండో వైపుని కూడా హాట్గ్లూ సాయంతో మూసేయాలి.

* ఇప్పుడు స్పాంజ్‌ని ట్యూబ్‌కి సమానమైన వెడల్పులో కత్తిరించుకోవాలి. ఆపై దీన్ని కూడా గ్లూ సాయంతో ట్యూబ్‌కి ఒకవైపున అతికించుకోవాలి.

* ఆ తర్వాత చిప్స్ వంటి వాటికి వచ్చే ప్యాకేజింగ్ కవర్‌ను తీసుకొని దానిలో కొంత భాగాన్ని గుండ్రంగా కత్తిరించి జిడ్డు లేకుండా శుభ్రం చేసుకోవాలి.

* ఇప్పుడు దీన్ని స్పాంజ్‌పై వెండి రంగు బయటకు వచ్చేలా ఉంచి సిల్వర్ కలర్ టేప్ సాయంతో జాగ్రత్తగా అతికించేస్తే.. అందమైన స్త్టెలస్ సిద్ధమైపోతుంది. కావాలనుకొంటే రెండోవైపు సైతం ఈ కవర్‌ను అతికించుకోవచ్చు. అయితే స్పాంజ్ ఉన్న వైపునే స్క్రీన్‌ను టచ్ చేయడానికి ఉపయోగించాలి.

స్త్టెలస్ తయారీ మరింత బాగా అర్థం కావాలంటే ఈ వీడియోను వీక్షించండి.
Photos: Screengrab