బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఓ సందేశాన్నిస్తూ ఈ కరోనా సమయంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను అభిమానులతో పంచుకుంది. ‘ఈ ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా మనందరం కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయం తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రామిస్ చేద్దాం. ఈ కరోనా కాలం అందరికీ కష్టకాలమే. ప్రస్తుతం మనందరం మహమ్మారితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. లాక్డౌన్ సమయంలో నేను పాటించిన కొన్ని జాగ్రత్తలు నాకు ఎంతో సహకరించాయి. అవేంటంటే..
1. రోజువారీ దినచర్యను ఏర్పరచుకొని సక్రమంగా పాటించడం (సమయానికి ఆహారం తీసుకోవడం, సరిపడ నిద్ర... వంటివి)
2. ప్రతిరోజు ధ్యానం, వ్యాయామం చేయడం.
3. నాకు సంతోషం కలిగించే ఏదో ఒక పనిని రోజూ చేయడం.
4. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సామాజిక బుడగను ఏర్పరచుకొని వారితో మాట్లాడడం (ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ)
5. ప్రకృతితో మమేకమవడం (చెప్పులు లేకుండా గార్డెన్లో నడవడం, సీతాకోక చిలుకలు, పక్షులు, మొక్కలను చూడడం)
6. విషాన్ని వెదజల్లే, మనసును కలుషితం చేసే వార్తా ఛానళ్లకు దూరంగా ఉండడం; ఇబ్బందులు సృష్టించే పనులను ప్రోత్సహించకుండా ఉండడం
7. సమస్యల్లో ఉన్నవాళ్లకు నా వంతు సహకారం అందించడం.
మన శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటామో మానసిక ఆరోగ్యాన్ని కూడా అదే విధంగా కాపాడుకోవాలి. అందుకే అందరం కలిసి ఆరోగ్యకరమైన బంధాలను ఏర్పరచుకోవడానికి కృషి చేద్దాం. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకుందాం.. మనం నమ్మే వ్యక్తులతో మన ఫీలింగ్స్‌ని పంచుకుందాం.. అని రాసుకొచ్చింది.
తెలుగు తార సమీరా రెడ్డి తన పిల్లలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటోన్న వీడియోని అభిమానులతో పంచుకుంది.
అందాల తార తాప్సీ మాల్దీవుల్లో స్విమింగ్ పూల్ దగ్గర ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార చేతులకు ఉంగరం ధరించిన ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘దీపావళి బహుమతి ఈసారి ముందుగానే లభించింది. ఇది సాయిబాబా ఉంగరం. అమ్మ ఈ ఉంగరాన్ని నాకు ఇస్తూ ఎప్పుడూ పెట్టుకునే ఉండమని చెప్పింది. వాళ్ల అమ్మ ఇలాంటి ఉంగరాన్నే 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇచ్చిందట. అమ్మ ఇప్పటికీ ఆ ఉంగరాన్ని పెట్టుకునే ఉంటుంది. ఇప్పుడు నా వంతు వచ్చింది. ఈ ఉంగరం నాకు చాలా బాగా నచ్చింది.. థ్యాంక్యూ అమ్మా’ అంటూ ఉంగరం వెనకున్న కథని చెప్పుకొచ్చింది.
ప్రముఖ నటి ఊర్వశీ రౌతెలా సింహం పిల్లలను పట్టుకొని దిగిన యానిమేషన్ వీడియోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘జాకీచాన్, రిహానా, సైఫ్ అహ్మద్ బెల్హాసాల తర్వాత ఆడసింహాల పిల్లలకు నా పేరు (ఊర్వశి) పెట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ అనుభవం ఎంతో మధురమైనది’ అంటూ లవ్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.
టాలీవుడ్ బ్యూటీ జెనీలియా తన అత్త గారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘కోడలు ఎప్పుడూ తనకు తానుగా ఉత్తమురాలు కాదు.. ఆమెకు అత్త సహాయం లభిస్తేనే అది సాధ్యమవుతుంది. అలా నా జీవితంలో భాగమై ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కొన్ని సార్లు ఇలాంటి ఆత్మీయ ఆలింగనాలు నాకు ఎంతో అవసరం. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ అత్తపై తనకున్న మమకారాన్ని చాటింది.
జర్మన్ బ్యూటీ ఎవ్లీన్ శర్మ తన తాజా ఫొటోని పంచుకుంటూ ‘మీకు మీరే సొంతంగా ఎదగడానికి ప్రయత్నించండి’ అనే క్యాప్షన్‌ని ఇచ్చింది.
‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తన తాజా ఫొటోని పోస్ట్ చేసింది. దీనికి ‘మీ చూపు ఎప్పుడూ లక్ష్యం వైపు ఉంటేనే అవరోధాలు కనిపించవు’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చింది.
క్యారక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి నటుడు నితిన్‌తో కలిసి దిగిన ఓ వీడియోని అభిమానులతో పంచుకుంది.
వీరితో పాటు పలువురు తారలు తమ తాజా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని ఓసారి చూసొద్దాం రండి...